పదేండ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి విష ప్రచారం చేసి విజయం సాధించింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కేసీఆర్ పాలనను విమర్శించడంపైనే ఆ పార్టీ దృష్టి సారించింది. పరిశ్రమలు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. పంటలను నమ్ముకున్న ప్రజలు యూరియా కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సుమారు 20 నెలల కాంగ్రెస్ హయాంలో పాలన పట్టాలు తప్పి పడకేసింది. ఒక్క రంగం అని కాదు, అన్ని రంగాల్లోనూ వేగంగా అధోగతికి పురోగమిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మరో అబద్ధాన్ని ముందటేసుకున్నారు. అసలు ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.90 వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతికి తావేది? అంత గొప్ప ప్రాజెక్టు కండ్ల ఎదుట కనబడుతూ లక్షల ఎకరాలకు నీరందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా తన మోసపూరిత ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి తాగునీరు తరలిస్తున్నారు.
కాళేశ్వరం మొదలు కోదాడ వరకు మత్తడి దూకుతుంటే సహించలేని, ఒప్పుకోలేని ఒక మానసిక బలహీనతలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకేనేమో, అసెంబ్లీలో హరీష్రావు ప్రాజెక్టు విషయంలో నిజాలు బయటపెడుతుంటే భయపడిన మంత్రులందరూ మూకుమ్మడిగా, ఒక పథకం ప్రకారం దాడిచేశారు. నియామకాల విషయంలోనూ అంతే.. తాము నింపింది కేవలం 6 వేల ఉద్యోగాలే. కానీ, 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఇది కేసీఆర్ పుణ్యమేనని నిజాయితీగా చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం ఆ గొప్పతనాన్ని తమకే ఆపాదించుకుంటున్నది. ఒక్క ఇల్లు కట్టకపోయినా నాటి ప్రభుత్వం పూర్తిచేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కొత్తగా రంగులు వేయించి ఇందిరమ్మ ఇళ్లు అంటూ హడావుడి చేస్తున్నది.
పాలన చేతకాక ఎంతసేపు గత ప్రభుత్వమే అన్ని సమస్యలకు కారణమంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారాలు ఎల్లకాలం పనిచేయవనేది రోజురోజుకు రుజువవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల్లోనే రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చింది నిజం కాదా? ఏ ప్రాజెక్టు కట్టారు? ఏ ఉత్పాదక పథకం చేపట్టారు? చేసిన దానికన్నా చెప్పుకుంటున్నది మాత్రం ఎక్కువ కనబడుతున్నది. ఫ్యూచర్ సిటీకైనా, మూసీ నది పునరుద్ధరణకైనా, చివరికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకైనా కేంద్రాన్ని నిధుల కోసం యాచించడం నిజం కాదా? రెండు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. మొత్తంగా ఆత్మ రక్షణలో పడి దానిని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడులకు దిగుతున్నదనేది స్పష్టం.
ఇక ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య ఏ మాత్రం సయోధ్య, అవగాహన లేవు. ఎవరేం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. న్యాయస్థానాలకు కూడా ఇలాంటి సమాచారం ఇస్తుండటంతో మొట్టికాయలు తప్పడం లేదు. ప్రజలు ఎవరి మాట నమ్మాలి? అసలు ఇది సాధ్యమేనా? కాలువ పనులు ఈ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి జరుగుతాయనుకోవడం అమాయకత్వం మాత్రమే. ప్రజలను మరోమారు వంచించడమే.
హెలికాప్టర్ లేకుండా ఎటూ కదలమంటున్నారు కొందరు మంత్రులు. ఈ విషయమై మంత్రుల మధ్య కూడా కనపడని మంటలున్నాయి. హెలికాప్టర్ కోసం లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. కానీ మంత్రుల ప్రకటనలు నవ్వు పుట్టిస్తున్నాయి. హెలికాప్టర్ ఖర్చు కంటే కారు కోసం అయ్యే ఖర్చు ఎక్కువని సెలవిస్తున్నారు మంత్రివర్యులు. ఎంత సమర్థింపు? ఎంత గడుసుగా మాట్లాడుతున్నారు వీరు? ఇక యూరియా లభ్యత రాష్ట్రంలో రెండు నెలల నుంచి రైతులను వేధిస్తున్నది. పగలు రాత్రి యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. సహనం నశించి తమ చెప్పులు క్యూలో ఉంచి తాము నీడకు తల దాచుకుంటున్నారు. అసలు యూరియా కొరత లేదని ఒకరంటే, కేంద్రం మన కోటా కంటే తక్కువ విడుదల చేసిందని మరొకరు అంటున్నారు.
అసలు రైతులే బ్లాకులో అమ్ముకోవడానికి ఎగబడుతున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించారు. బస్తా యూరియా కోసం మహిళలు కూడా కుస్తీలు పడుతున్నారు. పదేండ్లుగా లేని సమస్య ఈ యేడే ఎందుకు వచ్చిందో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముందుచూపు లేకపోవడమే కారణం. ఒకపక్క పంట పొలాలను పరిశ్రమల కోసం లాక్కోవడానికి ప్రయత్నిస్తూ, భూమిని నమ్ముకున్న రైతులను బెదిరిస్తున్నారు. బనకచర్ల విషయంలోనూ తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. అంతిమంగా రాష్ర్టానికి ఒరిగింది శూన్యం. చివరికి గోదావరి జలాలు ఆంధ్ర ప్రాంతానికి సమర్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ర్టానికి ఇంతకంటే జరిగే ద్రోహం ఏముంటది?
ఈ ప్రభుత్వం ఏ విధంగానూ తమ ప్రయోజనాలు కాపాడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో మెరుపు ధర్నా చేశారు. సంబంధిత మంత్రులు తప్పించుకొని తిరిగారు. అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చుచేసి ఏం సాధించారు? విమర్శలు మూటగట్టుకున్నారు. వరదలతో కొన్ని జిల్లాలు అతలాకుతలమవుతున్న వేళ ముఖ్యమంత్రి విద్యాశాఖతో సమీక్షలు, మూసీ నది పునరుద్ధరణ కోసం సమావేశం నిర్వహించడం రోమ్ చక్రవర్తిని తలపిస్తున్నది. పేదల గూడు కూల్చడానికే గాని పలుకుబడి గల పెద్దవారి జోలికి పోయే సాహసం చేయదని హైడ్రా నిరూపించింది. అందరూ సమానులే కానీ కొంతమంది మాత్రం ఎక్కువ సమానులని జార్జ్ ఆర్వెల్ అన్నమాట ఈ ప్రభుత్వం నిజం చేస్తున్నది.
భూముల స్వాధీనానికి ఒప్పుకోబోమని కొడంగల్ రైతులు పోరాటం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు కూడా తమ భూములు ఇవ్వబోమని మొరాయిస్తున్నారు. లగచర్ల రైతులే వారికి స్ఫూర్తి. వ్యవసాయం పండుగ చేస్తామంటే ఇదేనేమో? మంత్రులు వేసే పిల్లి మొగ్గలు ప్రజలు గమనించడమే కాదు, అసహ్యించుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల విషయంలోనూ సమ్మె సైరన్ మోగిస్తేనే ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రతి విషయంలోనూ సమస్య పరిష్కరించలేక కేవలం గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కమిటీలతో కాలయాపన చేస్తున్నది. అబద్ధపు ప్రచారాలు, అసంబద్ధమైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఐదేండ్లు ఉంటే ఇంకెన్ని అనర్థాలు జరుగనున్నాయో? కాంగ్రెస్ పార్టీని నిమజ్జనం చేసి తెలంగాణను తిరిగి పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయనడంలో సందేహం లేదు.
– శ్రీశ్రీ కుమార్