పిల్లలతో సరదాగా పార్కుకు వెళ్తే రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. ఆ ఆనందంతోపాటు తెలియకుండానే కొన్ని సమస్యలూ వెంట తెచ్చుకుంటున్నామని చాలామందికి తెలియదు. ప్రతి పార్క్ గేట్ ముందు పిల్లల కోసం పీచు మిఠాయి, బొంబాయి మిఠాయి అమ్మేవాళ్లు కనిపిస్తారు. ఆ పీచు మిఠాయి కొనివ్వమని పిల్లలు ఏడుస్తుంటే ‘అబ్బా ప్రాణం తీస్తున్నారు కదా’ అని నసుగుతూ కొనిస్తారు. పారదర్శకంగా ఉండే చక్కెరతో తయారయ్యే పీచు మిఠాయికి గులాబీ రంగు ఎలా వస్తుందో కొనేవాళ్లకు తెలియదు. రొడామిన్-బి అనే సింథటిక్ రసాయనం కలపడం వల్ల పీచు మిఠాయికి ఈ రంగు వస్తుంది. దీనిని వస్త్రపరిశ్రమలో, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. దుస్తులకు వేసే రంగుని ఆకట్టుకునేలా ఆహారానికి అంటించి అమ్ముతున్నారు.
చిలగడదుంప, రత్నపురి గడ్డలకూ రాస్తున్నారు. రంగు బాగా లేని వాటికి మార్కెట్లో ధర తక్కువ. కాబట్టి ఈ రంగుని అద్ది అమ్ముతున్నారు. రోడ్డు పక్కన అమ్మే వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియాకు ఆకట్టుకునే రంగు ఈ రొడామిన్-బి వల్లే వస్తుంది. ఈ కలుషిత ఆహారం తినడం వల్ల కణాల్లో ఆక్సీకరణ చర్యలు ఎక్కువగా జరుగుతాయి. అన్ని రకాల జీవక్రియల్లో మార్పులు వస్తాయి. క్యాన్సర్, ఇతర అనేక రోగాలకు దారి తీస్తుంది. పెండ్లి, ఇతర వేడుకల్లో చికెన్, క్యాలిఫ్లవర్ ఫ్రైలు ఈ రంగును పులుముకుంటున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ తరహా పదార్థాలకు నో చెప్పండి.
ఆహార పదార్థాలు కొనేముందు, తినేముందు రంగులో కల్తీ జరిగిందీ, లేనిదీ తెలుసుకోవాలంటే ఈ పరీక్ష చేయండి. కొద్దిపాటి దూది తీసుకుని దానిని నీళ్లలో లేదా నూనెలో ముంచి ఆహారంపై కాసేపు ఉంచి తీయండి. పదార్థం రంగు దూదికి అంటుకుంటే.. ఆహారంలో కల్తీ జరిగినట్టే. అందులో రొడామిన్-బి రసాయనం ఉన్నట్టే. ఆహారం కల్తీ జరిగిందని పారేయకుండా కొంతమంది కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులకు ఆహారంగా పెడతారు. విషం ఏ ప్రాణికైనా హాని చేస్తుందని మరవకండి. ఆ ఆహారాన్ని ఇతర జంతువులు తినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెత్తలో కలపండి.