దంపతుల మధ్య ఎలాంటి దాపరికాలూ ఉండకూడదు. అయినా.. భాగస్వామితో చెప్పకూడని విషయాలు, చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయని అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెటర్ హాఫ్ కదా!’ అని ప్రతిదాన్నీ షేర్ చేస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకీలా సమస్యలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా, ప్రేమికులు, కొత్తగా పెళ్లయిన జంటలు.. ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.
గతం.. గతః: ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ప్రేమ పక్షులైనా.. కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్న నవ జంటలైనా.. మీ గత సంబంధాల గురించి మీ భాగస్వామికి తెలియకుండా చూసుకోండి. ఈ జీవితం మీ ఇద్దరిది మాత్రమే! కాబట్టి, మీ జీవితంలో లేని మూడో వ్యక్తి కోసం.. మీ మానసిక స్థితిని పాడు చేసుకోకండి. మీ గత సంబంధాలకు సంబంధించిన నిజం.. మీ భవిష్యత్తుకు విషంగా మారుతుందని గుర్తుంచుకోండి.
నీ ఇష్టమే.. నా ఇష్టం!: మీ భాగస్వామి ఇష్టాయిష్టాలను తెలుసుకోండి. అందుకు తగ్గట్లే వ్యవహరించండి. వారి అలవాట్లను మీ అలవాట్లుగా మార్చుకోండి. అదే సమయంలో మీతోపాటు వారి వ్యక్తిగత స్వతంత్రాన్నీ గౌరవించండి. వారికి అసౌకర్యం కలిగించే విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి.
మీ మాటలు జాగ్రత్త..: ఎలాంటి సందర్భాల్లోనైనా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ భాగస్వామిని బాధపెట్టే, తప్పుడు సందేశాన్ని ఇచ్చే పదాలను ఉపయోగించకండి. మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.