పెరటి తోటలను ఆశించే చీడపీడలను నివారించడానికి రసాయన మందులనే ఆశ్రయించాల్సిన అవసరంలేదు. మొక్కలకు మేలుచేసే మిత్ర పురుగులను ఆకర్షిస్తే సరిపోతుంది. ఫలితంగా.. కొన్నిరకాల తెగుళ్లను నియంత్రించి, తోటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సాలె పురుగులు, తూనీగలు, పైరేట్ నల్లులతోపాటు కొన్నిరకాల ఈగలు కూడా పంటలకు మేలు చేస్తాయి. మొక్కలకు హానిచేసే రకరకాల కీటకాలను నివారించడంలో ఇవి సాయపడతాయి. ముఖ్యంగా పేనుబంక, దోమలు, తెల్లదోమ వంటి హానికర పురుగులను తిని మొక్కలను కాపాడతాయి.
అయితే, రసాయన మందులు ఎక్కువగా వాడితే.. మిత్రపురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటి వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను పాటించండి. దీనివల్ల రసాయనాల అవశేషాలు లేని కూరగాయలు, ఆకు కూరలు చేతికి అందుతాయి. ఇక కొన్నిరకాల పక్షులు కూడా చీడపురుగులను తింటాయి. వాటికోసం తోటల్లో పక్షిస్థావరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. తోటలో మొక్కల వైవిధ్యాన్ని పెంచడం కూడా ఓ చిట్కానే! తోటలోకి మిత్ర పురుగులను ఆకర్షించే కొన్ని మొక్కలను నాటండి. సోంపు, కొత్తిమీర, మెంతులు నాటడం వల్ల లేడీబగ్స్, హోవర్ఫ్లై లాంటి ఈగలు వస్తాయి.