‘జెన్-జెడ్’ అంటేనే.. హడావుడి జీవితం! అస్తవ్యస్తమైన జీవన విధానం! ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్‌లు.. అర్ధరాత్రి పార్టీలు.. నిద్రలేని రాత్రులు.. అన్నీ కలిసి ఈ తరానికి శాపంగా మారుతున్నాయి. వారిని సంతానానికి దూరం చేస్తున్నాయి. ఈ క్రమంలో.. నేటి యువతరం జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
సంతానోత్పత్తిలో వయసుదే కీలక పాత్ర! కానీ, ఉన్నత చదువులు, ఉద్యోగ లక్ష్యాలు.. ఇలా అనేక కారణాలతో ‘జెన్-జెడ్’లో చాలామంది పెళ్లిని, ఆ తర్వాత పిల్లల్నీ వాయిదా వేస్తున్నారు. అయితే, ఒక నిర్దిష్ట వయసు తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. మహిళల్లో 35 ఏళ్లు దాటితే.. ఆకస్మిక గర్భస్రావాలు, ఇతర సమస్యలు, పిల్లల్లో జన్యుపరమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివారు ముందుగానే ఆధునిక పద్ధతుల్లో అండాలను సంరక్షించుకోవాల్సిందే!
నేటి తీరికలేని జీవనశైలితో చాలామంది ఊబకాయం బారినపడుతున్నారు. మరికొందరు సైజ్ జీరో అంటూ.. కడుపు కట్టుకొని సన్నబడిపోతున్నారు. ఈ రెండూ సంతాన సాఫల్యతపై దుష్ప్రభావం చూపేవే! తక్కువ బరువు.. అండాశయాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెలలు నిండకుండానే ప్రసవమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక ఎక్కువ బరువుంటే.. రుతుచక్రం దెబ్బతింటుంది. గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. సంతాన సాఫల్యత కోసం బరువును అదుపులో ఉంచుకోవాల్సిందే!
ఇంటివంట అంతగా రుచించని తరం. ‘టిఫిన్ బాక్స్’ అంటేనే.. అదేదో వింత వస్తువు అన్నట్టు చూసే జనం. బయటికెళ్లారంటే.. బయటి ఫుడ్ తినాల్సిందే అనేరకం! కానీ, జంక్‌ఫుడ్‌లో ఉండే చెడు కొవ్వులు.. మహిళల రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి. పునరుత్పత్తి హార్మోన్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే, సంతానోత్పత్తి మెరుగుపడాలంటే.. ఆహారంలో తృణధాన్యాలు, చేపలు, కూరగాయలను భాగం చేసుకోవాల్సిందే!
ఉద్యోగులకు నైట్ షిఫ్ట్‌లు, యువతకు లేట్‌నైట్ పార్టీలు.. కారణాలు ఏవైతేనేం, ఈతరం కుర్రకారుకి రాత్రినిద్ర కరువైపోతున్నది. నిద్రలేమి.. సంతానోత్పత్తిపై దుష్ప్రభావం చూపుతుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి.. వంధ్యత్వానికి కారణం అవుతున్నది. మెరుగైన సంతానం కావాలంటే.. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్రపోవాల్సిందే!
పొగతాగడం వల్ల ఆడవాళ్లలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువగా కాఫీలు తాగినా.. పునరుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోజుకు 100 ఎంజీ కంటే ఎక్కువగా కెఫీన్ తీసుకునేవారికి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇక ధూమపానం చేసే మహిళల్లో అండాశయ నిల్వలు తగ్గుతాయి. మానసిక, శారీరక ఒత్తిడితోపాటు వాతావరణ కాలుష్యం, సెల్ఫోన్ల అతివాడకం కూడా.. సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పండంటి బిడ్డను పొందాలంటే.. ఈ అలవాట్లను దూరం పెట్టాల్సిందే!