Sister Hood | కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సంప్రదాయం పురుడు పోసుకుంది. ‘సిస్టర్హుడ్’గా పిలిచే ఈ ట్రెండ్.. మహిళా ఉద్యోగులను ఏకం చేస్తున్నది. పనిప్రదేశాల్లో మహిళల మధ్య బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించడంతోపాటు వారి కెరీర్‌కు చోదక శక్తిలా పనిచేస్తున్నది. ఉద్యోగినుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూనే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా వృత్తి నైపుణ్యాలను పెంచుతున్నది.
ఒకే కార్యాలయంలో పనిచేసేవారి మధ్య పలకరింపులు మామూలే! అయితే, అది ఆఫీస్‌లో అడుగుపెట్టినప్పుడు ‘గుడ్ మార్నింగ్’.. వెళ్లేటప్పుడు ‘గుడ్ నైట్’ చెప్పడం దగ్గరే ఆగిపోతున్నది. లంచ్ బ్రేక్‌లోనో.. పనిమధ్యలో కాఫీ తాగేటప్పుడో చెప్పుకొనే కబుర్లకే పరిమితం అవుతున్నది. అయితే.. ఈ సిస్టర్హుడ్ కాస్త భిన్నమైంది. ఇది.. ఉద్యోగినులతో ఐక్యతా రాగం పాడిస్తున్నది. తోటివారి ఎదుగుదలకు మద్దతు ఇవ్వాలన్న నిబద్ధతను పెంచుతున్నది. వారి విజయంలో కీలకపాత్ర పోషించాలన్న తపనను రాజేస్తున్నది.
లింగ సమానత్వంలో పురోగతి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ పని ప్రదేశాల్లో మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. మెకిన్సే కంపెనీ నివేదిక ప్రకారం.. నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉన్నది. ఆ ఉన్నవారిలోనూ.. మగవాళ్లకు అడ్డుపడని ఆటంకాలెన్నో అతివలకు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ‘సిస్టర్హుడ్’.. మహిళల మధ్య ఒక కీలకమైన మద్దతు వ్యవస్థగా పనిచేస్తున్నది. వారి భద్రతకు, బలానికి భరోసా ఇస్తున్నది.
ఔత్సాహిక మహిళా సాంకేతిక నిపుణులకు మార్గదర్శకత్వం, మద్దతును అందించడం ద్వారా.. సాంకేతిక రంగాన్ని సిస్టర్హుడ్ ట్రెండ్ గణనీయంగా ప్రభావితం చేస్తున్నది. మహిళలు కెరీర్లో పురోగతి సాధించడంలో సాయపడటంతోపాటు వారివారి రంగాలలో మెరుగైన ఆవిష్కరణలు, సహోద్యోగులను బలోపేతం చేయడంలోనూ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు కార్పొరేట్ సిస్టర్హుడ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నాయి. మహిళలకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు వారి కెరీర్ డెవలప్మెంట్పై దృష్టిపెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. మహిళల కోసం సపోర్ట్ నెట్వర్క్ నిర్మించడమనేది.. వారి కెరీర్ పురోగతికి దోహదం చేయడమేనని నిపుణులు అంటున్నారు. అందుకే, ఉద్యోగినులూ.. ‘సిస్టర్హుడ్’కు జై కొట్టండి. మీకు తెలియని వృత్తి నైపుణ్యాలను తెలుసుకోండి. తెలిసినదాన్ని పంచుకోండి. కెరీర్లో దూసుకెళ్లండి.