పండ్లు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం. మనిషి తినగలిగిన ప్రతి పండూ.. ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. అదే సమయంలో కొందరికి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది. రుచితోపాటు పోషకాల్లోనూ మేటిగా ఉండే జామపండు కూడా.. కొన్నిసార్లు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
జామపండులో విటమిన్ సి, పొటాషియం, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో ముందుంటుంది. చర్మ సంరక్షణలోనూ, మలబద్ధకాన్ని నివారించడంలోనూ దివ్యౌషధమే! కానీ, కొందరు ఈ పండుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
జామలోని కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు అలెర్జీని కలిగిస్తాయి. ముఖ్యంగా, సున్నితమైన చర్మం ఉన్నవాళ్లలో దురద, మంట, చర్మం ఎర్రబడటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, చర్మ సమస్యలు ఉన్నవారు ఈ పండును తినేముందు నిపుణుల సలహా తీసుకోవడం బెటర్.
నిద్రపోయే ముందు జామపండు తినడం మంచిదికాదట. ఎందుకంటే, ఈ పండ్లలో ఫ్రక్టోజ్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు జామపండ్లను తినకపోవడమే మంచిది.
జామపండు గింజల్లో ఆక్సలేట్లు ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఇవి మరింత ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి, వారు జామపండ్లను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నా, గింజలు లేకుండా తీసుకోవాలి.
జామపండ్లలో లభించే అధిక ఫైబర్.. కొందరికి చికాకును కలిగిస్తుంది. కడుపు తిమ్మిరి, విరేచనాలు, అధిక అపానవాయువు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉంటే, జామపండును తొక్క తీసి తినడం అలవాటు చేసుకోవాలి.