మనదేశంలో మొట్టమొదటి సూర్యోదయం ‘అరుణాచల్ ప్రదేశ్’లోనే కనిపిస్తుంది. అందుకే.. ‘అరుణాచల్’కు ఆ పేరు వచ్చింది. మరి, ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భానుడు మొదటగా కనిపిస్తాడో తెలుసా? దానికి సమాధానం.. ‘డాంగ్’ అనే ఓ మారుమూల చిన్న పల్లె! దేశమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడే.. ఇక్కడ సూర్యుడు ‘హాయ్’ చెబుతాడు. ఈ అద్భుతాన్ని చూడటానికి ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ‘క్యూ’ కడతారు.
1999 వరకు మనదేశంలో అన్నిటికన్నా ముందుగా అండమాన్‌లోని ‘కట్చాల్’ దీవిలో సూర్యుడు ఉదయిస్తాడని భావించేవారు. కానీ, పర్యావరణ-ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనల తర్వాత.. భారత్‌లో మొట్టమొదటి సూర్యోదయం ‘డాంగ్’ లోయలోనే కనిపిస్తుందని అధికారికంగా నిర్ధారించారు.
భారతదేశంలో అత్యంత తూర్పున ఉన్న ఒక చిన్న పర్వత గ్రామం.. డాంగ్. చైనా, మయన్మార్ సరిహద్దుల ముఖద్వారంలో ఉంటుందీ ప్రాంతం. మనదేశంలో అన్నిటికన్నా ముందుగా సూర్య కిరణాలు తాకే భూభాగంగా గుర్తింపు పొందింది. ఈక్రమంలో ప్రకృతి ప్రేమికులకు, సాహసయాత్రికులకు.. ఒక అద్భుతమైన గమ్యస్థానంగా మారింది. ఈ మారుమూల పల్లె అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లా పరిధిలోకి వస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 1,240 మీటర్ల ఎత్తులో.. లోహిత్, సతి నదుల సంగమ క్షేత్రానికి సమీపంలో ఉంటుంది. పలు ప్రకృతి వింతలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది.

డాంగ్ లోయలో దినచర్య దేశంలోని అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. స్థానికులు చాలా ముందుగానే తమ రోజును ప్రారంభిస్తారు. అందరికన్నా ముందుగానే.. ముసుగు తన్నేస్తారు. ఎందుకంటే, శీతాకాల సమయంలో తెల్లవారుజామున 4:00 గంటలకే ఇక్కడ సూర్యుడు కనిపిస్తాడు. సాయంత్రం 4:30కల్లా మాయమై పోతాడు. ఇక, ఇక్కడి మొట్టమొదటి సూర్యోదయాన్ని చూడాలనుకునే పర్యాటకులు కూడా అందరికన్నా ముందుగానే ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. వాలాంగ్, డాంగ్ బేస్ క్యాంప్ నుంచి తెల్లవారుజామున 1:30 -2:00 గంటల మధ్యలోనే కొండపైకి ఎక్కడం మొదలు పెడతారు. అప్పుడే.. 4:30 గంటలకల్లా మొదలయ్యే సూర్యోదయాన్ని చూసే అవకాశం ఉంటుంది మరి!

కొండల నడుమ కొలువుదీరిన డాంగ్ లోయ.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తున్నది. మంచుతో కప్పిఉండే నీలి రంగు పర్వతాలు, దట్టమైన పైన్ అడవులు, వేలాడే వంతెనలు.. పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, కొండల వెనుక నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆకాశం నారింజ, ఎరుపు రంగుల్లోకి మారే దృశ్యం.. వీక్షకులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. చుట్టూ హిమాలయాల అందాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం కారణంగా.. డాంగ్ లోయను సందర్శించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతున్నది. అయితే, ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల.. ఇక్కడికి వెళ్లడానికి భారతీయులకు కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి.

డాంగ్ లోయకు అత్యంత సమీపంలో ఉండే పట్టణం వాలాంగ్. డాంగ్‌కు వెళ్లే పర్యాటకులు రాత్రి బస చేయడానికి హోటల్స్, హోమ్‌స్టేలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే.. డాంగ్ గ్రామాన్ని చేరుకోవచ్చు. ఇక డాంగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రధాన పట్టణం, జిల్లా కేంద్రం తేజు. పర్యాటకులకు అవసరమైన అన్నిరకాల వసతులు ఇక్కడే లభిస్తాయి. ఇక్కడి నుంచి వాలాంగ్.. సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఘాట్ రోడ్డు, కొండల గుండా ప్రయాణం సాగించాలి. ప్రైవేట్ వాహనాల్లో దాదాపు ఐదు నుంచి ఆరు గంటలు ప్రయాణం చేయాలి.