ఉరుకులు పరుగుల జీవితంలోపడి చాలామంది తల్లిదండ్రులు తమపిల్లలకు తగినంత సమయం కేటాయించలేక పోతున్నారు. టార్గెట్లు, టెన్షన్లు అంటూ.. మానసిక, శారీరక ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. ఉసూరుమంటూ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి.. పిల్లలు అల్లరి చేస్తూ కనిపిస్తారు. దాంతో, విసుగు తెప్పిస్తున్నారంటూ కసురుకుంటారు. నియంత్రణ కోల్పోయి చేయి చేసుకుంటారు. దాంతో, పిల్లలు మొండి
ఘటాల్లా తయారవుతున్నారు. ఈక్రమంలో చిన్నారులు మాట వినాలంటే.. చిన్నచిన్న టెక్నిక్స్ పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు గదిలో అల్లరి చేస్తుంటే.. తల్లిదండ్రులు బయటి నుంచే కేకలు వేస్తుంటారు. ఇలా అరవడం.. వారిని ఆదేశించినట్టే అవుతుంది. దానికి వారినుంచి స్పందన కూడా తక్కువగానే వస్తుంది. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. పిల్లల దగ్గరికి వెళ్లి, ఎదురుగా కూర్చొని.. వారితో ఐ కాంటాక్ట్ అవ్వాలి. వారి కళ్లలోకి చూస్తూ ఏ పని చెప్పినా.. బుద్ధిగా వింటారు. మీరు శారీరకంగా మీ పిల్లల స్థాయిలో ఉన్నప్పుడు.. మీ మాటలకు వారు శ్రద్ధగా స్పందిస్తారన్నది నిపుణుల సూచన.
మీరు కోపంగా, మీ స్వరం గంభీరంగా ఉంటే.. పిల్లలు నోరు మూసుకొని కూర్చుండిపోవచ్చు. కానీ, అది తాత్కాలికమే! అదే మీరు ప్రేమతో నెమ్మదిగా చెబితే.. ఆ మాటలు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి, పిల్లలతో నెమ్మదిగా, స్పష్టంగా, హృదయపూర్వకంగా మాట్లాడండి. ప్రశాంతమైన స్వరమే పిల్లల దృష్టిని బాగా ఆకర్శిస్తుంది. మీరు చెప్పేది పిల్లలు సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
‘అలా ఉండాలి. ఇలా ఉండాలి’ అంటూ లెక్చర్ల మీద లెక్చర్లు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కోపంగా మీరు ఎంత చెప్పినా.. పిల్లల చెవికెక్కదు. మీరు ఏం చెప్పాలనుకున్నా.. ఆ విషయాన్ని వారికి నచ్చేలా చెప్పండి. ‘గదిని శుభ్రం చేయండి!’ అని ఆదేశించే బదులు.. ‘మీ బొమ్మలను భద్రంగా దాచుకోండి!’ అంటూ సలహా ఇవ్వండి. ‘ఫస్ట్ బ్రష్ చేస్తారా? లేక టాయిలెట్‌కు వెళ్తారా?’ అని అడిగితే.. వారే ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు.
మీరు ఆదేశించిన వెంటనే.. పిల్లలు మారాలని ఏంలేదు. వారెప్పుడూ తక్షణమే స్పందించరు. మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి, దాన్ని పాటించడానికి పిల్లలకు కొంత సమయం పడుతుంది. చెప్పిందే మళ్లీమళ్లీ చెప్పి.. వారిని ఇబ్బంది పెట్టకండి. ఓపికగా ఉండండి. అలాగే.. చెప్పిన మాట పిల్లలు వినడం లేదంటే.. మిమ్మల్ని ధిక్కరిస్తున్నట్టే అనుకోవద్దు. ముందుగా, వారు ఏదైనా ఇబ్బందిగా ఫీలవుతున్నారో తెలుసుకోండి. అలసిపోయినా.. ఆకలితో ఉన్నా పిల్లలు మాట వినరు. అలాంటప్పుడు.. వారి అవసరాలు తెలుసుకొని తీర్చండి.