వేసవిలో చెమట పట్టడం కామన్! ఫలితంగా, బూట్ల నుంచి దుర్వాసన రావడం కూడా మామూలు విషయమే! అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాసనను వాపస్ పంపించొచ్చు.
ఎండలో ఉంచడం: ఎక్కడికైనా వెళ్లినప్పుడు బూట్లను విప్పేసి కబోర్డ్‌లో ఉంచేస్తారు. అలాకాకుండా.. బూట్లను ఎండలో వదిలేయండి. వాటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను నిర్మూలించడంలో సూర్యరశ్మిని మించింది లేదు.
సాక్స్: బూట్ల నుంచి ఎక్కువగా దుర్వాసన రావొద్దంటే.. ఎప్పుడూ సాక్స్ ధరించాలి. వాటినీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
వెనిగర్: ఒక లీటర్ స్ప్రే బాటిల్లో సగం వెనిగర్, ఇంకా సగం నీళ్లు నింపుకోవాలి. బూట్లను శుభ్రం చేసిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని బూట్ల లోపల స్ప్రే చేసుకోవాలి. కాసేపు నీడలో ఆరబెడితే.. బూట్లలోంచి దుర్వాసన వదిలిపోతుంది.
వంట సోడా: బూట్లలో తేమతోపాటు బ్యాక్టీరియాను నిర్మూలించడంలో వంటసోడా చాలా గొప్పగా పనిచేస్తుంది. బూట్లలో కొద్దిగా బేకింగ్ సోడా చల్లి.. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పాత బ్రష్‌తో బూట్లను శుభ్రంగా కడిగేయాలి. దుర్వాసన ఆమడదూరం పారిపోతుంది.
లవంగం నూనె: 2007లో మైకోబయాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగం నూనెకు బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించే సుగుణాలు ఉన్నాయి. ఇది సువాసనను కూడా వెదజల్లుతుందని వెల్లడైంది. దీంతోపాటు టీట్రీ ఆయిల్, దేవదారు నూనెలు కూడా బూట్లలోంచి వచ్చే చెడు వాసనను తొలగించడంలో ఉపయోగపడతాయి.