దేశమంతా రుతుపవనాలు విస్తరించడంతో.. వానలు జోరందుకుంటున్నాయి. కేరళ పడమటి కనుమలను దాటుకొచ్చిన మేఘాలు ఓ చోట ఉరుముతూ కురుస్తున్నాయి. ఇంకోచోట ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్నాయి. ఎక్కడెలా ఉన్నా.. మాన్సూన్ సందడి కేరళలో భలేగా ఉంటుంది. పరవళ్లు తొక్కే నదులు ఒకపక్క, నిశ్చలంగా ఉండే కడలి వెనుక జలాలు మరోపక్క.. వీటి పక్కగా ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు… ఇలా ప్రకృతి దిద్దిన కేరళ కథాకళి నృత్యం కన్నా ఇంపుగా ఉంటుంది. ఇన్ని అందాలు తొలకరి జల్లుల్లో మరింత మెప్పిస్తాయి. మలయాళ సీమను దర్శించాలన్న మనోరథాన్ని ఈడేర్చుకునే సరైన సమయం ఇది. ఎందుకు ఆలస్యం చలో కేరళ..
కేరళలో ముచ్చటైన ప్రదేశం తెన్మల. ఇది కొల్లాం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెన్మల అంటే తేనె గుట్ట అని అర్ధం. ఒకప్పుడు ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట తేనెపట్టులతో అలరిస్తూ ఉండేది. ఇప్పటికీ ఇక్కడి వనాల్లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, చెట్లు చాలా కనిపిస్తాయి. తొలకరి పలకరింపుతో తెన్మల తనువెల్లా హరివిల్లు విరబూస్తుంది. ప్రకృతి ఆరాధకులకు తప్పకుండా నచ్చితీరుతుంది. సాహస యాత్రికులకు ట్రెక్కింగ్, రాక్ ైక్లెంబింగ్ అందుబాటులో ఉన్నాయి. తెన్మల డ్యామ్, బటర్ ఫ్లై సఫారీ, షెండుర్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పాండవుల గుహ ఇలా తెన్మల చుట్టపక్కల బోలెడన్ని విహార కేంద్రాలున్నాయి.
కోవలం అంటే ‘కొబ్బరిచెట్ల వనం’ అని అర్థం. ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు విపరీతంగా ఉంటాయి. తివేండ్రం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ విహార కేంద్రం పర్యాటకులకు స్వర్గధామం. అరేబియా సముద్రం అందాలు వీక్షించాలంటే కోవలం సరైన ఎంపిక. రుతుపవనాల వేళ తీరం వెంబడి వీచే చల్లటి గాలులకు తనూలతిక వయ్యారాలు పోతుంది. అదే సమయంలో గగన తలంలోని కారుమబ్బుల గుంపు పలకరిస్తుంది. చిరుజల్లులతో మొదలైనా తీరం నుంచి కదలం. జడివానగా పెరిగినా.. తనువంతా తడిసి ముద్దయిపోతున్నా.. ఇసుక తిన్నెల్లో స్థిరంగా ఉండిపోతాం.
కేరళ పర్యటన ఎక్కణ్నుంచి మొదలుపెట్టినా ఇంపుగానే ఉంటుంది. వేటికవే ప్రత్యేకమైనవి. ‘తూర్పు వెనిస్’గా పేరున్న అలెప్పీలో కాలువలు కోకొల్లలు. తేలికపాటి తెప్పల్లో గింగిరాలు కొడుతూ.. పర్యటించవచ్చు. గూటి పడవలో బోటీ తింటూ సాగిపోవచ్చు. రిచ్ హౌస్‌బోట్‌లో దూరి రేయంతా సేదతీరొచ్చు. కాలువ గట్లపై ఆకుపచ్చ తివాచీలు కనువిందు చేస్తాయి. పడవ ప్రయాణంలో ఉండగా చిరుజల్లులు కురిశాయా.. మీరు అదృష్టవంతులే! ఈ సమయంలో నారికేళ నూనె వాసన పడకపోయినా… అడిగిమరీ అందులో మిర్చీలు వేయించుకొని తింటారు. అలెప్పీ సరసనే ఉంటుంది వెంబనాడ్ సరస్సు. ఇందులోని పతిరమన్నాల్ ద్వీపం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. కాలువలు, సరస్సులే కాదు.. అలెప్పీకి అల్లంత దూరంలో మరాఠీ బీచ్, కృష్ణపురం బీచ్, అలెప్పీ లైట్‌హౌస్ ఇలా వరుసపెట్టి చూస్తూ రోజులు గడిపేస్తారు.
గిరుల లోగిలి వయనాడ్ తొలకరి వేళ కడిగిన ముత్యంలా మెరిసిపోతుంటుంది. వయల్ (వరి పంటలు), నాడ్ (ప్రాంతం) వరి అధికంగా పండే ప్రాంతం కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. వయనాడ్ జిల్లా సముద్రమట్టానికి 700 నుంచి 2100 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. కొండలు, లోయలు, కాలువలు, కాఫీ, టీ తోటలతో ఆ ప్రాంతమంతా ప్రకృతికి చిరునామాగా కనిపిస్తుంది. కురువా ద్వీపం, బాణాసుర సాగర్, మీనముట్టి జలపాతం ఇవన్నీ వయనాడ్ పర్యాటకులకు కావాల్సినంత ఆనందాన్నిస్తాయి.