ఆరోగ్యం కోసం.. ఆనందం కోసం ఇప్పుడు చాలామంది సైకిల్ యాత్రలు చేస్తున్నారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ రెండు చక్రాలపై సవారీకి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఒంటరిగా ప్రయాణించడానికీ ముందుకొస్తున్నారు. ఇలాంటి యాత్రలతో ప్రకృతిని ఆస్వాదించడంతోపాటు సరికొత్త అనుభవాలను మూట గట్టుకుంటున్నారు. అయితే.. సైక్లింగ్ యాత్రలో అనేక సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే.. సోలో సైక్లింగ్ చేపట్టేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సోలో సైక్లింగ్‌కు వెళ్లేముందు.. సైకిల్ కండిషన్‌ను ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అవసరమైతే టైర్లు, బ్రేకులు సహా ఇతర విడిభాగాలను మార్చుకోండి. హెల్మెట్లు, గ్లవ్స్తోపాటు ప్రథమ చికిత్స కిట్‌ను వెంట ఉంచుకోండి. రాత్రిపూట ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కాబట్టి, సైకిల్ ముందు, వెనుక లైట్లతోపాటు రిఫ్లెక్టర్లనూ అమర్చుకోండి.
సైకిల్ యాత్ర చేయాలంటే ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమే. కాబట్టి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోండి. లేకుంటే.. తగినంత విశ్రాంతి తీసుకోండి. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించినప్పుడే.. ప్రయాణానికి సిద్ధమవ్వండి. దారిలో బలవర్ధకమైన ఆహారం తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగుతూ ఉండండి.
ఎక్కడికి వెళ్లాలి? ఏ మార్గం గుండా వెళ్లాలి? ఎక్కడ బస చేయాలి? అనే విషయాలను ముందుగానే నిర్ణయించుకోండి. ఇక మీరు ప్రయాణించే మార్గం గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. రోడ్ల స్థితిగతులు, ట్రాఫిక్, వసతి సౌకర్యాలు ఇతర అంశాల గురించి క్షుణ్నంగా తెలుసుకోండి. వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి తాజా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే యాప్స్‌ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి.
భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. టూర్‌కు సంబంధించిన అన్ని విషయాలను కుటుంబసభ్యులతో పంచుకోండి. ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకుంటారు? లాంటి సమాచారాలను ముందే తెలియజేయండి.
అవసరమైన వస్తువులను మాత్రమే ప్యాక్ చేయండి. ఏమైనా మర్చిపోతే.. దారిలో కొనుగోలు చేయవచ్చు. కాబట్టి.. ప్రతిదీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్ కోసం పోర్టబుల్ చార్జర్, పోర్టబుల్ వైఫై హాట్‌స్పాట్, లోకల్ మ్యాప్స్, జీపీఎస్ పరికరాలు వెంట ఉంచుకోండి. రాత్రిపూట సైక్లింగ్ చేయాల్సి వస్తే.. అందుకు తగిన దుస్తులను ధరించండి.
ఇక సైకిల్‌కు సంబంధించిన ప్రాథమిక మరమ్మతులను నేర్చుకోండి. చిన్నచిన్న సమస్యలు ఎదురైతే.. మీరే రిపేర్ చేసుకునేలా ఉండాలి. దీనివల్ల సమయం ఆదా కావడంతోపాటు ఒత్తిడి ఉండదు. అందుకోసం వివిధ అవసరాలకు ఉపయోగపడే మల్టీ టూల్‌ను వెంట ఉంచుకోండి.