మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. నిత్యం ఎన్నో ఆలోచనలు, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటుంది. అలాంటి బ్రెయిన్ కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కోరుకుంటుంది. ఇలా అనుకునే వాళ్లకు మంచి ఆప్షన్‌గా ‘సోలో డైనింగ్’ ట్రెండ్ వచ్చేసింది. ఒంటరిగా డిన్నర్‌కు వెళ్లడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుందని నేటి యువత చెబుతున్నది.
సాధారణంగా ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేస్తుంటే.. చుట్టుపక్కల వాళ్లు విచిత్రంగా, జాలిగా చూస్తుండొచ్చు. అందుకు కారణం మనందరికీ గ్రూప్ డిన్నర్స్ మాత్రమే అలవాటు. అలాంటివాళ్లను పట్టించుకోకుండా సోలో డిన్నర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఒంటరిగా కూర్చుని తినడంవల్ల ‘మీ టైమ్’ అనేది ఉంటుంది. అలాగే మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన మనసుకు మనం దగ్గరగా ఉండటం.
ఒంటరిగా అలా ఎలా తినాలి? అనుకునేవాళ్లూ ఉంటారు. అందువల్ల సోలో డైనింగ్ని ఆసక్తికరంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో అయినా, రెస్టారెంట్లో అయినా ప్లేట్లో నచ్చిన ఆహారం, చెవిలో ఇష్టమైన మ్యూజిక్ వంటివి ఉంటే.. సోలో డైనింగ్ని సంతోషంగా ఆస్వాదించొచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం, ఒంటరిగా ఉంటే మానసిక ఆరోగ్యం ఎలా బాగుంటుంది? అని. నిజానికి ఒంటరిగా కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారని, మెడిటేషన్ లాంటి ఫీలింగ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలో కూడా అప్పుడప్పుడూ చేసే సోలో డైనింగ్ మానసిక ఆరోగ్యానికి మంచిదని తేల్చారు. ఇది పని ఒత్తిడిని తగ్గించి, ఎమోషనల్ రెగ్యులేషన్ని మెరుగుపరుస్తుంది. కొత్తగా ఉన్నా, ఈ సోలో డైనింగ్ కాన్సెప్ట్ బాగుంది కదూ!