యుగాలుగా మనిషి జీవితం ప్రకృతితో మమేకమై సాగుతుంది. అయితే, నాగరికత పెరిగే కొద్దీ మనిషిలో స్వార్థం పెరిగింది. తన మనుగడ సజావుగా సాగడానికి ప్రకృతిని పణంగా పెడుతూ వచ్చాడు. యాంత్రిక విప్లవంతో మహోన్నత దశకు చేరుకున్నాడు. ఈ అభివృద్ధి పథంలో శతాబ్దాలు గడిచిన తర్వాత.. ప్రకృతికి తాను చేసిన చేటును తలుచుకొని మారే ప్రయత్నాలూ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికిల్స్ పురుడు పోసుకున్నాయి. పేరుమోసిన సంస్థలన్నీ ఎలాంటి కాలుష్యం వెదజల్లని వాహనాల తయారీలో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కేరళకు చెందిన నలుగురు యువకులు మాత్రం.. పర్యావరణ హితం కోరి వినూత్న ఆవిష్కరణకు నడుం బిగించారు. అందులో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన అజీమ్ హష్మి, డెవిస్ జాకబ్, జాకబ్ థెక్కెకర, అబ్దుల్ అనే నలుగురు ఇంజినీర్లు కలిసి సోలార్, ఈవీ ట్రై సైకిళ్లను రూపొందించారు. అలువా పట్టణం కేంద్రంగా సుగ్రహ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను నెలకొల్పి..
ఈ వాహనాల్ని అభివృద్ధి చేశారు. 300 కిలోల పేలోడ్ కెపాసిటీ ఉన్న ఈ సోలార్ ట్రై సైకిల్ చెత్త సేకరణకు, ప్రకటనల కోసం ఉపయోగించొచ్చు. పూర్తిగా సౌరశక్తితో ఇది పనిచేస్తుంది. పెడల్ సాయంతోనూ నడిపించొచ్చు. రోజుకు వంద కిలోమీటర్ల దాకా దీనిపై స్వచ్ఛంగా ప్రయాణించొచ్చు. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం పూర్తిస్థాయిలో సౌరశక్తితో పనిచేస్తుంది. రెండోది ఎలక్ట్రిక్ ట్రై సైకిల్. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. మూడోది మాన్యువల్ పెడల్ వేరియంట్. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో వీటిని విక్రయిస్తున్నారు. సుగ్రహ స్టార్టప్‌ను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈ నలుగురు. ముగ్గురు, నలుగురు ప్రయాణించేందుకు అనువుగా దీనిని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు. వీరు చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తూ కేరళ స్టార్టప్ మిషన్ దన్నుగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ నిధి ప్రయాస్ నుంచి గ్రాంట్ కూడా అందింది. ఈ మొత్తంతో తమ ఆవిష్కరణను మరింత మందికి చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈ కేరళ దోస్తులు!