Social Media | బాల్యం ఆన్లైన్ ఉచ్చులో చిక్కుకుపోతున్నది. పసితనాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. పిల్లలు రోజూ కనీసం మూడు గంటల సేపు ఎలక్ట్రానిక్ తెరల వైపు కళ్లప్పగించి చూస్తున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో యూట్యూబ్ వీడియోలు, ఓటీటీలదే కీలక పాత్ర. ఫేస్బుక్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియాలకూ అలవాటు పడుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నవారి సంఖ్యా తక్కువేం కాదు. కన్నవాళ్ల బ్యాంకు వివరాలతో బెట్టింగ్ జోలికి వెళ్లి లక్షలు పోగొట్టుకున్న ఉదంతాలూ ఉన్నాయి.
‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ ఎనిమిది వేలమంది పట్టణ ప్రాంత తల్లిదండ్రులను సర్వే చేసి మరీ ఈ గణాంకాలను వెల్లడించింది. సగానికి సగం మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు చూడకూడని సైట్స్ చూస్తున్నారని కానీ, వాడకూడని యాప్స్ వాడుతున్నారని కానీ తెలియదు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఓ వ్యసనంగా మారిపోవడం వల్ల పిల్లల్లో అసహనం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి సమస్యలు, కుంగుబాటు, ఒత్తిడి తదితర లక్షణాలు కనిపిస్తున్నట్టు
మానసిక నిపుణులు చెబుతున్నారు.