తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులు పిల్లల ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో పిల్లలు చెడు భావాలకు లోనవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల వ్యవహారశైలే అంటున్నారు నిపుణులు. పిల్లల ముందు ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడటం కొన్ని తరాలుగా మన దగ్గర కొనసాగుతున్నది. బంధువులు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు పెద్దల నోటి నుంచి ‘ఆడంగి మాటలు, ఆడపిల్లలా ఆ నడకేంటి, నువ్వేమన్నా ఆడదానివా?’ ఇలా అమ్మాయిలను కించపర్చడం రివాజుగా వస్తున్నది. అంతేకాదు, అమ్మాయిల విషయంలో ‘మగరాయుడిలా ఆ ఫోజులేంటి, ఆడపిల్లవు ఆడపిల్లలా ఉండాలి’ అని ఆడవాళ్లే పిల్లలను గద్దిస్తుంటారు.
తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగడంతో సమాజంలోనూ ఆడ, మగ మధ్య తీవ్రమైన అగాథాన్ని సృష్టించేశాయి. పెద్దలు పలికే ఈ మాటల వల్ల కొన్ని పనులు ఆడవాళ్లే చేస్తారేమో, కొన్ని పనులు మగపిల్లలు చేయకూడదు అనే భావన మనలో బలంగా నాటుకుపోయేలా చేశాయి. పిల్లాడికి ఆడుకోవడానికి బొమ్మతుపాకీలు తెచ్చే తల్లిదండ్రులు, తమ కూతురి కోసం కిచెన్ సెట్ ఆర్డర్ చేస్తుంటారు. అబ్బాయిని దుకాణాలకు పంపే పేరెంట్స్, అమ్మాయిలకు ఇల్లు శుభ్రం చేసే పని అప్పగిస్తుంటారు. అంతేనా కుర్రాడు ఆసక్తి కొద్దీ.. గరిట పట్టుకుంటే.. ‘నీకెందుకురా ఆడవాళ్ల పనులు’ అంటూ బయటికి పంపేస్తుంటారు.
ఇది పిల్లల్లో లింగవివక్షను పెంచడమే కాదు, పేరెంట్స్ తమ పట్ల చూపుతున్న వివక్షనూ తెలియజేస్తుంటుంది. భవిష్యత్ తరాలు లింగ వివక్షకు గురికావొద్దంటే.. తల్లిదండ్రులు తమ వైఖరులు మార్చుకోవాలి. ఆడ, మగ అంటూ కంపేర్ చేయడం మానుకోవాలి. పిల్లలు ఆడే ఆటలు, చేసే పనుల విషయంలో వాళ్ల ఇష్టాన్ని తెలుసుకోవాలి. పిల్లల అభిరుచి, శారీరక సామర్థ్యం, ప్రతిభను బట్టి వాళ్లు ఆటలాడుకునే అవకాశం కల్పించాలి. ఈ తరం తల్లిదండ్రులైనా తాము చేస్తున్న తప్పుల్ని తరిమేయగలిగితే… వాళ్ల పిల్లలు పెద్దయ్యాక లింగ సమానత్వాన్ని గుర్తించగలుగుతారు. తరాలుగా మన జాతిని పట్టిపీడిస్తున్న లింగవివక్ష జాడ్యం నిదానంగా అయినా తెరమరుగవుతుంది.