జయమునిచ్చే జమ్మి
జమ్మిచెట్టుని ‘శమీ వృక్షం’ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాలలో దీనిని ‘ఆరణి’ అని అంటారు. మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత విజయ దశమినాడు ఆ అస్త్రశస్ర్తాలకు పూజలు చేసిన తర్వాత ధరిస్తారు. అందుకే దసరా పండుగ నాడు ఆయుధ పూజ, శమీ పూజ సంప్రదాయాలను హిందువులు పాటిస్తున్నారు. జమ్మిచెట్టు జయాన్ని ఇస్తుందని నమ్ముతారు. హిందువుల ఇళ్లలో ఉదయం ఆయుధ పూజ, సాయంత్రం జమ్మి పూజ చేస్తారు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ, పూజలు చేసిన తర్వాత ఆ చెట్టు ఆకుల్ని పెద్దలకు ఇచ్చి ఆశీర్వచనం పొందుతారు. ఈ ఆకుల్ని ‘బంగారం’ అంటూ పది మందికి పంచిపెడతారు. జమ్మి చెట్టుని ‘నవ గ్రహాల వృక్షం’గా పరిగణించేప్పుడు మాత్రం శనీశ్వరునికి ప్రతీకగా భావిస్తారు. వినాయకుని పూజలో ఈ జమ్మి ఆకు కూడా ఉంటుంది.
‘శమీ శమయతే పాపం..
శమీ శతృ వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ..
రామస్య ప్రియదర్శినీ’
అన్న శ్లోకాన్ని చెట్టు చుట్టూ తిరుగుతూ చదివి నమస్కారం చేసుకుంటారు.
జమ్మి పూలు మొగ్గ దశలో పసుపు రంగులో ఉంటాయి. విరబూసే సమయానికి గులాబీ రంగులోకి మారతాయి. ఈ పువ్వు సన్నగా, పొడవుగా, త్రిభుజాకారంలో ఉంటుంది. జమ్మి అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. ఈ చెట్టు వేళ్లు భూమి లోపలికి చొచ్చుకొని, నీటిని గ్రహిస్తాయి. ఈ చెట్టు మధ్యస్థంగా పెరుగుతుంది. జమ్మి ఆకులు చింత ఆకుల్లా కనిపిస్తాయి. కానీ, పరిమాణంలో అంతకన్నా చిన్నగా ఉంటాయి. జమ్మి చెట్టు ఇంట్లో నాటుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం. కొమ్మను అంటుకట్టి, విత్తనాలనునాటి ఈ చెట్లు పెంచుకోవచ్చు. జమ్మిచెట్టు జయాలను ఇచ్చేదే కాకుండా సర్వరోగ నివారణి కూడా. ఆయుర్వేద ఔషధాల తయారీలో జమ్మి ఆకు, పూలు, విత్తనాలు, బెరడు ఉపయోగపడతాయి. విరేచనాలను కట్టడి చేయడానికి ఈ ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటారు. జమ్మి కాయల్లో అనేక పోషకాలుంటాయి. జమ్మి కాయలతో కూరలు కూడా వండుకుంటారు. ఎడారి ప్రాంత వాసులు జమ్మి కాయలు ఎండబెట్టి, వరుగులు చేసుకొని సంవత్సరమంతా వంటల్లో వాడుకుంటారు.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు