వంటకు రుచిని అందించే ఉప్పు.. ఇంటికి శుభ్రతను తీసుకొస్తుంది. మరకలు, చెడువాసనలను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా.. ఇనుప సామగ్రికి పట్టిన తుప్పును వదలగొట్టడంలో ఉప్పు ముందుంటుంది. ఎలాంటి రసాయనాలు లేకుండానే.. ఇంటిని తళతళా మెరిపిస్తుంది. ఐరన్ కడాయిలు ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే.. తుప్పుపట్టి పోతాయి. తిరిగి వాడేటప్పుడు నానా తంటాలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు తుప్పు పట్టిన ఐరన్ కడాయిలపై కొద్దిగా ఉప్పు నీటితో స్ప్రే చేసి.. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తడివస్త్రంతో తుడిచేస్తే.. తుప్పు వదిలిపోతుంది.
వంటపాత్రలపై జిడ్డు, ఆహారపు మచ్చలను ఉప్పు ఇట్టే పోగొట్టేస్తుంది. ఆయా పాత్రల్లో కొద్దిగా ఉప్పు, నళ్లు పోసి.. కొన్ని నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగి తుడిచేస్తే.. జిడ్డు మాయమైపోతుంది.
సింక్లో ఆహార వ్యర్థాలు మిగిలిన చోట దుర్వాసన వ్యాపిస్తుంది. ఈ సమస్యకు ఉప్పునీరు చెక్ పెడుతుంది. సింక్పైన కొంత ఉప్పు చల్లి.. ఆపై చల్లని నీళ్లు పోసి కడిగేస్తే సరి. మరకలు తొలగిపోయి సింక్ మెరిసిపోవడంతోపాటు దుర్వాసన కూడా తగ్గిపోతుంది.
ఉల్లి, వెల్లుల్లి లాంటివి కట్ చేసిన తర్వాత.. చేతులకు ఘాటైన వాసన అంటుకుంటుంది. చాలాసేపటి వరకూ ఆ వాసన వస్తూనే ఉంటుంది. ఉప్పు నీటితో చేతులను కడిగేస్తే.. ఆ వాసనలు దూరమవుతాయి.
ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే.. మరింత శుభ్రంగా మారుతుంది. ఉప్పు నీటితో తుడువడం వల్ల దుర్వాసన కూడా తగ్గుతుంది.