ఇంటిని ఇంద్రభవనంలా మార్చుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, పెరుగుతున్న ధరలు.. మధ్యతరగతి ఆశలకు గండి కొడుతున్నాయి. అయితే, సరైన ప్లానింగ్ ఉంటే.. చిన్న ఇంటికి కూడా లగ్జరీ లుక్ తీసుకురావచ్చని ఇంటీరియర్ డిజైన్ నిపుణులు అంటున్నారు. ఉన్నదాంట్లోనే ఉన్నతంగా చూపించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. గోడలకు తేలికపాటి రంగులు వేయించాలి. తెలుపు, లేత నీలం, క్రీమ్ లాంటి రంగులు.. వెలుతురును ప్రతిబింబిస్తాయి. గది పెద్దదిగా కనిపించేలా చేస్తాయి. ఇక గోడలకు తగ్గట్టుగానే ఫర్నిచర్, కర్టెయిన్స్ కూడా ఒకే రంగు షేడ్స్‌లో ఎంచుకోవాలి. దీనివల్ల గది విడివిడిగా కాకుండా.. ఒకే పెద్ద ప్రదేశంలా కనిపిస్తుంది.
చిన్న గదుల్లో పెద్ద అద్దాలను అమర్చండి. దీనివల్ల గది రెట్టింపు పరిమాణంలో ఉన్నట్లు భ్రమ కల్పిస్తాయి. కిటికీకి ఎదురుగా అద్దం ఉంచితే.. బయటి వెలుతురు గది మొత్తం వ్యాపించి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఫర్నిచర్ ఎంపికలోనూ కాస్త స్మార్ట్‌గా ఆలోచించాలి. మల్టీ పర్పస్ ఫర్నిచర్ కొనుగోలు చేయాలి.
స్టోరేజ్ ఉండే బెడ్స్, సోఫా కమ్ బెడ్, మడతపెట్టే డైనింగ్ టేబుల్స్‌ను ఎంచుకోవడం మంచిది. నేలకు అంటుకుని ఉండే సోఫాల కంటే.. కాళ్లు ఉండే ఫర్నిచర్‌తో గచ్చు కనిపిస్తుంది. గది ఇరుకుగా అనిపించకుండా ఉంటుంది. ఇక గదిలో సామాగ్రి ఎంత తక్కువ ఉంటే.. ఆ గది అంత విశాలంగా కనిపిస్తుంది. కాబట్టి, వాడని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయండి.