‘ఒంటరి వాడను నేను… ఎవ్వరికేమీ కాను’ అని సినిమాలో హీరో దర్జాగా పాడుకుంటాడు. ఎందుకంటే.. అది సినిమా కాబట్టి, పక్కా స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి. కథ సుఖాంతమే అవుతుందన్న గ్యారెంటీ ఉండబట్టి… ఒంటరితనాన్నీ గొప్పగా ఫీలవుతాడు హీరో. కానీ, రియల్ లైఫ్.. సినిమాలా బౌండెడ్ స్క్రిప్ట్ కాదు. ప్రతి మలుపులో గెలుపు పలకరిస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇన్ని తెలిసినా.. ‘ఏకాకి జీవితం నాది’ అని తెగ ఫీలైపోయేవాళ్లూ ఉంటారు. పైగా ‘మనిషి పుట్టినప్పుడు ఒంటరి.. పోయేటప్పుడు ఒంటరి..’ అని మెట్టవేదాంతాలు వల్లిస్తుంటారు.
బాస్.. ‘నేను ఒంటరి’ అని నువ్వనుకుంటే అయిపోతుందా! నీ వెనుక నీ ఫ్యామిలీ లేదు! నీ తోడు నీ స్నేహితులు లేరు!! అంతెందుకు నీతో నువ్వు లేవు! మరెందుకు ఒంటరి అనుకోవడం… ఏదో అయిపోవడం!! ‘నా కారణాలు నాకున్నాయి’ అంటావా!! ఏంటా రీజన్లు.. కెరీర్ నత్తనడకన సాగుతుందా? సత్తా చూపించు!! ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయా? రాబడి మార్గాలు అన్వేషించు!! నిక్కచ్చిగా ప్రయత్నించకుండా.. ఒంటరిగా కుమిలిపోవడం మనిషి బలహీనత! ఓ చిన్న అలలా మొదలయ్యే ఈ వేదన.. ఊబిలా మారకముందే, ఊపిరి సలపకుండా చేయకముందే.. మేలుకో! నిన్ను నువ్వు ఏలుకో!!
అండగా కుటుంబం.. కొండంత దన్నుగా అయినవాళ్లు.. ఇందరు ఉన్నా మనిషి ఒక్కోసారి తాను ఒంటరి అన్న భావనకు లోనవుతూ ఉంటాడు. ఇలాంటి అనుభవం మనిషికి చాలా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. అలా కుదేలైన చాలాసార్లు అయినవాళ్ల చొరవతోనే ఆ గండం నుంచి గట్టెక్కుతుంటాడు. కొన్నిసార్లు తనను ఈసడించుకుంటుందన్న సమూహమే.. ఆ మనిషికి ఊతమవ్వొచ్చు. అయితే, తన మాట చెల్లనప్పుడు, మరెవరో తనను అజామాయిషీ చేస్తున్నారన్న అనుమానం తలెత్తినప్పుడు.. మనిషి ఇలా ఒంటరితనానికి చేరువ అవుతుంటాడు.
నిరంతరం ఏదో బాధలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. తానే నిఖార్సైన మనిషినని, తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని తెగ ఇదైపోతుంటాడు. కానీ, పరిస్థితి ఇంతదాకా ఎందుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఒకవేళ అటుగా అడుగులు వేసినా.. తన దృక్కోణంలోనే ఆలోచిస్తూ, ఆత్మవంచనకు పూనుకుంటాడు. అసలు నిజం తెలుసుకునేందుకు సాహసించడు. ఒక్కసారి ఈ బారికేడ్‌ను దాటుకొని బయటికి వస్తే.. తాను ఒంటరి కాదన్న విషయం ఇట్టే తేటతెల్లం అవుతుంది.
ఎవరైనా సరే తాను ఒంటరి అని ఫీలవుతున్నారంటే.. ప్రధాన కారణం కుటుంబంలో మీ పాత్ర సరిగ్గా నిర్వర్తించకపోవడమే! మన మేలు కోరే అమ్మానాన్నలను సరిగ్గా అర్థం చేసుకుంటే.. వాళ్లు ఎప్పుడూ మన వెన్నుదన్నుగా ఉన్నారనిపిస్తుంది. ఏ మనిషీ ఎప్పుడూ ఒకేలా ఉండడు. కుటుంబంతో సంతోషంగా గడపాలని ఉన్నా.. ఆర్థికపరమైన చిక్కులో, ఉద్యోగంలో ఒత్తిళ్లో ఆ మనిషిని అలా ఉండకుండా చేస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన సహజ స్వభావంలో గుర్తించదగిన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరెంత దాచాలని ప్రయత్నించినా… చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు ఆ మార్పును, కనిపించని ఆందోళనను ఇట్టే పసిగట్టేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. మనకన్నా వాళ్లే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు.
ఈ క్రమంలో కాస్త చొరవగా విషయమేంటని ఆరా తీస్తారు. దానికి బదులు చెప్పడం మాట అటుంచి, చాలామంది మౌనముద్ర వహిస్తుంటారు. గట్టిగా అడిగితే… మరింత బిగుసుకుపోతారు. టీనేజ్ కుర్రాడికైనా, ప్రేమలో మునిగిపోయిన కుర్రదానికైనా, ఆర్థికంగా కుదేలైన వ్యక్తికైనా.. ఎవరికైనా ఇలాంటి రోజు ఒకటొస్తుంది. సరిగ్గా ఆలోచిస్తే.. ఎంత పెద్ద సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. మన ఇబ్బందిని ఇంట్లో వాళ్లతో పంచుకోకుండా, వారి సలహా తీసుకోకుండా… దాటేద్దామనే ప్రయత్నంలో చాలామంది ఒంటరిగా మిగిలిపోతుంటారు. తీరా చేతులు కాలాక.. ఇంట్లోవాళ్లకు పరిస్థితి వివరించినా ఆశించిన ఫలితం రాకపోవచ్చు.
పెద్దవాళ్లు కాబట్టి ఆవేశంలో నిందించొచ్చు, ఆవేదనలో కొన్నాళ్లు మాట్లాడటం మానేయొచ్చు! అంతమాత్రానికే ఒంటరినైపోయానని బాధపడితే ఎలా? ఇలా కుదేలైపోవడం వల్ల.. సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలమై కూర్చుంటుంది. అలా కాకముందే మీ ఆవేదననంతా వారికి విడమరిచి చెప్పండి. వాళ్ల సాయం కోరండి. కన్నబిడ్డ ఆపదలో ఉంటే.. ఏ తల్లిదండ్రులూ పట్టించుకోకుండా ఉండరు. తమ శక్తికి మించి మిమ్మల్ని ఆ గడ్డు స్థితి నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వాళ్లు కూడా కాస్త కఠినంగా వ్యవహరించవచ్చు. అదుపాజ్ఞల్లో ఉండాలని శాసించవచ్చు. అయినా ఫర్వాలేదు! మన బాగు కోసం మనకన్నా ఎక్కువగా పరితపించే వ్యక్తులు ఇచ్చే భరోసాతో అప్పటి వరకు మనసులో గూడుకట్టుకున్న ఒంటరితనం పలాయనం చిత్తగిస్తుంది.
ఒంటరి జీవితానికి చెల్లుచీటి పలికే ధైర్యం జీవితభాగస్వామి. అతని రాకతో ఆమె, ఆమె అడుగుపెట్టడంతో అతని జీవితం ఫలవంతం అవుతుంది. ఆలుమగలు అన్న తర్వాత ముద్దులే కాదు.. ఇచ్చిపుచ్చుకునేవి చాలా ఉంటాయి. సంతోషాలు మాత్రమే పంచుకుంటాను, బాధలు దిగమింగుకుంటాను అని ఇద్దరిలో ఎవరు భావించినా… ఒంటరితనాన్ని స్వాగతించినట్టే అవుతుంది. జీవితం సజావుగా ముందుకుసాగాలంటే.. నమ్మకం చెడకుండా చూసుకోవాలి. ఇద్దరిలో ఎవరికే ఇబ్బంది వచ్చినా.. మరొకరితో మొహమాటం లేకుండా షేర్ చేసుకోవాలి. స్వయంకృతమే అయినా, ఇతరుల వల్ల మోసానికి గురైనా, కారణమేదైనా.. మీ పార్ట్నర్తో చెప్పే ప్రయత్నం చేయాలి. అలా చెప్పకుండా.. మీలో మీరే మదనపడుతూ ఉంటే ఒంటరి ఫీలింగ్ దాడి చేస్తుంది.
చిన్న తడబాటు పెద్ద ఎడబాటుకు దారి తీయొచ్చు కూడా! భార్యకు సమస్య తలెత్తితే భర్తతో, భర్తకు ఇబ్బంది ఎదురైతే భార్యతో పంచుకోవాలి. మీరున్న పరిస్థితిని విడమరచి చెప్పాలి. మీ కష్టసుఖాలు పంచుకునే వ్యక్తి ఓ మాట అంటే పడటంలో తప్పు లేదు. ఆ క్షణంలో చిన్నబుచ్చుకున్నా.. మరుక్షణంలో బుజ్జగించే ప్రయత్నం చేయాలి. అంతేకానీ, అసలే పీకల్లోతు సమస్యలో ఇరుక్కొని, దాన్ని దాచి, ఆపై వాళ్లు ఏదో అన్నారని ఆవేశానికి గురైతే… ఇబ్బంది తొలగకపోగా, కొత్త చిక్కులు చుట్టుకుంటాయి. కాబట్టి, మీరు ఒంటరిగా ఫీలవుతున్నారని అనిపించిన వెంటనే… మీ భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. వారి మాటలతో ఊరడిల్లండి. అప్పటిదాకా మిమ్మల్ని విసిగించిన ఒంటరితనం మీ జంటను చూసి ఒంటరిగా ఎటో వెళ్లిపోతుంది.
కుటుంబంతో పంచుకోలేని విషయాలు కూడా స్నేహితులతో షేర్ చేసుకుంటాం. మనసుకు దగ్గరైన నేస్తం దగ్గర అరమరికల్లేకుండా ఉంటాం. అలాంటి స్నేహితులు ఒకరిద్దరు ఉన్నా చాలు.. ఒంటరితనం మీ దరిదాపుల్లోకి రాదు. మీరు లోన్లీగా ఫీలైనప్పుడు అలాంటి దోస్తును మనసులో తలుచుకోండి. వీలైనంత తొందరగా కలవండి. వారితో మీ పరిస్థితిని వివరించండి. అది ఆర్థికపరమైన అంశమైనా అవ్వనీయండి, హార్ధిక విషయమైనా కానివ్వండి! ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తపరచండి, ఆ వ్యక్తి తక్షణం మీకు సాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ, మిమ్మల్ని గాలికి వదిలేయడు. మిమ్మల్ని బంధీ చేస్తున్న ఒంటరి ఫీలింగ్‌ని తరిమేయడానికి మాటసాయం అయినా చేస్తాడు. కొన్నిసార్లు స్నేహితులతో మాటపట్టింపుల వల్ల కూడా ఒంటరితనం ఆవహిస్తుంటుంది. ఇలాంటప్పుడు బెట్టుకు పోకుండా.. మెట్టు దిగడం మంచిదని గుర్తుంచుకోవాలి. మీరూ బాధపడి, వారినీ బాధపెట్టి… నలిగిపోకుండా ప్రశాంత వాతావరణంలో కలిసే ప్రయత్నం చేయండి. అపార్థాలతోపాటు లోన్లీ ఫీలింగ్కీ బైబై చెప్పేయండి.
ఇంట్లోవాళ్లను మినహాయిస్తే.. అయినవాళ్లందరూ బంధువులు కావొచ్చు! కానీ, బంధువులందరూ అయినవాళ్లు అయ్యే అవకాశం లేదు!! మారిన కాలమాన పరిస్థితుల్లో దగ్గరి బంధువులు కూడా వీలైనంత దూరం పాటిస్తూ ఉన్నారు. మనమూ ఆ కోవకు చెందినవాళ్లమే!! వాళ్లు మనల్ని ఉద్దరించేది లేదు.. మనం వాళ్లను సంస్కరించేదీ ఉండదు! అయితే ఈ బంధుగణంతో పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. కానీ, మీరు ఆందోళనగా ఉన్నారనీ, ఏదో ఇబ్బందుల్లో పడ్డారనీ, మరేదో సమస్యల్లో చిక్కుకున్నారనీ తెలిస్తే… అక్కడి నుంచి తీవ్ర సానుభూతి వ్యక్తమవుతుంది. పరోక్షంగా మీ గురించి టన్నులకొద్దీ మాటలు కుమ్మరిస్తారు. అవి మన జీవితాన్ని తీర్చిదిద్దకపోగా, మరింత కుంగుబాటులోకో, ఇంకింత అగాథంలోకో తోసేస్తాయి.
అందుకే, బంధుగణాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో అయినవాళ్లు, మీకోసం పరితపించేవాళ్లు ఒకరిద్దరు ఉన్నా.. అవసరం అనుకుంటే వారి సలహాలు తీసుకోండి. వారి మాటలు మీకు బలాన్నివ్వొచ్చు. వారి సాయం కొంత ఊరట అందించొచ్చు. బంధువుల తర్వాతి స్థానం సమాజానిది. ఎదిగిన వాణ్ని చూసి ఓర్వలేని సమాజం.. పడినవాణ్ని చూసి ఫక్కున నవ్వుతుంది. అలాంటి సామాజిక చైతన్యం తరాల నుంచి వేళ్లూనుకొని ఉంది. ఈ వ్యవస్థని గొప్పగా ఊహించుకొనో, దానికి భయపడో మీ బతుకును పరేషాన్ చేసుకోవద్దు. పైగా.. ఎవరి గురించో ఆలోచించే తీరిక ఎవరికీ లేదు!
మీ చుట్టుపక్కల వాళ్ల గురించి మీరెంత తక్కువగా ఆలోచిస్తారో… మీ గురించీ వాళ్లు అంతే పరిమితంగా ఆలోచిస్తుంటారు. ఈ మాత్రానికి ‘సమాజానికి ఏమని సమాధానం చెప్పాలి’ అని తల్లడం మల్లడం అయిపోవద్దు. మీ ఒంటరి ఫీలింగ్‌కి సమాజమే కారణమని మీకు అనిపించినా, ఒకవేళ అదే నిజమైనా.. ఇగ్నోర్ చేయడమే పరిష్కారం. మిమ్మల్ని ఎంత ఒంటరి చేయాలని ప్రయత్నిస్తే.. మీ పనికి (వృత్తి, ఉద్యోగం) అంతగా దగ్గరవ్వండి. ఈ పోరాట ఫలితం.. సమాజంలో మిమ్మల్ని తలెత్తుకునేలా నిలబెడుతుందన్నది వాస్తవం.
బాస్ ఏదో అన్నాడని ఒంటరిగా ఫీలవుతుంటారు కొందరు. ఆ సమయంలో తన శ్రమనంతా దోచుకుంటున్నది ఆ వ్యక్తే అన్న భావన కలుగుతుంది. అంతకుముందు నాలుగైదుసార్లు శెహభాష్ అన్న బాసు.. ఏ పరాకులోనో చిరాకుపడితే.. శివాలెత్తిపోతారు. పర్యవసనం ఆలోచించరు సరికదా, తెగేదాకా లాగాలన్న దుస్సాహసానికీ ఒడిగడతారు!! దీనివల్ల నష్టపోయేది మీరే అని గుర్తుంచుకోండి. అలాగని మీ పై అధికారులు ఈసడించుకున్నా పడి ఉండమని కాదు! మరో పట్టు దొరికే వరకు.. ఉన్నది వదులుకోవద్దు! ఆత్మాభిమానం చంపుకోవాల్సిన పనిలేదు. వాళ్లు లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా వివరణ ఇవ్వండి.
అయినా అర్థం చేసుకోకపోతే లిఖిత పూర్వకంగా, ఆధారాలు సహా వివరాలు అందజేయండి. అప్పటికీ తగ్గకపోతే.. మీ సమయం కోసం వేచి ఉండండి. అదును చూసి ఎత్తు వేసి.. కుయుక్తులను చిత్తు చేయండి. శక్తియుక్తులు మీ బలమైతే తాత్కాలికంగా ఉత్పన్నమైన ఉపద్రవాలు… జల ద్రావణిలో ఉప్పులా ఇట్టే కరిగిపోతాయి. అంతోటి దానికి మీకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు, ఒంటరిగా మిగిలిపోవడం మీ కెరీర్‌కు మాత్రమే కాదు, ఆరోగ్యానికీ చేటు చేస్తుందని గుర్తించండి.
చివరిగా… నీ బలం నువ్వే! నీ సామర్థ్యాలు నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. క్రికెట్లోనే చూడండి… ఒక మంచి బ్యాటర్‌కి అన్ని రకాల షాట్లు ఆడటం తెలుసు. కానీ, షార్ట్ పిచ్ డెలివరీని డ్రైవ్ చేస్తానంటే కుదరదు. ఫుల్‌లెంగ్త్ బాల్‌ను హుక్ చేయాలంటే సాధ్యపడదు. నేనిలాగే ఆడతానని మొండికిపోతే అప్పనంగా వికెట్ చేజార్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక తెలివైన బ్యాటర్.. బౌలర్ బాల్ డెలివరీ చేశాక, లిప్తపాటు కాలంలో తను ఆడే షాట్ ఎంపిక చేసుకొని, ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఒక్కోసారి అంచనా తప్పొచ్చు, ఔట్ కూడా అవ్వొచ్చు! కానీ, నిజాయతీగా చేసిన ప్రయత్నం.. ఆ ఆటగాడికి మరో అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి, ఎన్ని ఒత్తిళ్లు ముసురుకున్నా.. ఒంటిచేత్తో ఎదుర్కునే ధైర్యాన్ని సంపాదించుకోవాలే కానీ, ఒంటరిగా మిగిలిపోయానే అన్న దైన్యానికి లోనుకావొద్దు. ఈ రోజు నీది కాదేమో! రేపటి రోజు నీది కావాలంటే మాత్రం… ‘నేను ఒంటరి కాదు’ అని బలంగా ఫిక్సవ్వాలి. నీ వెంట ఎవరూ లేకున్నా, రాకున్నా… నీ కోసం నువ్వు బలంగా నిలబడాలి. అప్పుడు నువ్వు ఎన్నటికీ ఒంటరిగా మిగిలిపోవు!!
ఒంటరితనం గుండెమీద తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపోటును అమాంతం పెంచేస్తుంటుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే హృద్రోగాలూ మొదలవుతాయి. 2024లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఒంటరితనంతో బాధపడేవారు ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలకు దగ్గరవుతున్నారని తేలింది. మానసికంగా ఏకాకిగా ఫీలయ్యేవాళ్లలో హార్మోన్లు కూడా గతి తప్పుతాయి. ఒత్తిడి సమయంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ శాతం పెరిగిపోవడంతో అజీర్తి, నిద్రలేమి పట్టి పీడిస్తాయి. మరోవైపు హ్యాపీ హార్మోన్‌గా పేరున్న డోపమైన్ ఉత్పత్తి తగ్గి.. సంతోషం సగానికి సగం తగ్గిపోతుంది. పెద్దలే కాదు, పిల్లలు కూడా ఒంటరితనం బాధితులే! ముఖ్యంగా తల్లిదండ్రులు అంతగా పట్టించుకోకపోవడం వల్ల.. పిల్లల్లో ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. కొన్నిసార్లు సంతోషంగా ఉన్న తోటి పిల్లలను చూసి ఓర్వలేని స్థితికి చేరుకుంటారు. దీన్ని పరిష్కరించకపోతే.. వారిలో క్రూర స్వభావం పెరుగుతుంది.
ఒంటరితనం జబ్బు కాదు. కాలక్రమంలో శిశిర రుతువులా వచ్చిపోతుందంతే! ఆ లోన్లీనెస్ మన ఉనికిని, వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని ప్రశ్నించకముందే.. తేరుకోవాలి. సమస్య ఎక్కడుందో గుర్తించాలి. ఈ లక్షణాలు అడపాదడపా తొంగి చూస్తున్నాయంటే మీరు ఒంటరిగా ఫీలవుతున్నట్టే!
వారానికి ఒకసారికి మించి ఒంటరితనపు భావన తీవ్రంగా తల్తెత్తుతున్నదంటే.. సమస్య ముదిరి పాకాన పడుతున్నట్టే!
ఒంటరితనంలో నిద్ర సరిగ్గా ఉండదు. నిశ్చింతగా పడుకోలేరు. ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలి కూడా తగ్గుతుంది. కొందరు జంక్ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు.
ధూమపానం, మద్యపానం అలవాట్లు అధికమవుతాయి. ఇంట్లోవాళ్లపై కస్సుబుస్సులాడుతుంటారు.
ఎవరితో కలవడానికి ఇష్టపడరు. మానసికంగానే కాదు, భౌతికంగానూ ఒంటరిగా ఉంటుంటారు. ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం చేసినా ముక్తసరిగా సమాధానం ఇస్తారు.
ఇవన్నీ ఒంటరితనంతో బాధపడుతున్నారు అనడానికి హెచ్చరికలే! ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. కుటుంబసభ్యులే చొరవ చూపి, వారి సమస్యను అడిగి తెలుసుకోవాలి. దాని పరిష్కారానికి భరోసా ఇవ్వాలి.
ఏకాంతం వేరు, అంతర్ముఖత్వం వేరు. ఈ రెండూ మనిషికి మేలు చేసేవే. కానీ, ఒంటరితనం మాత్రం సమస్యే! దాన్నుంచి వీలైనంత త్వరగా బయటపడే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఈ పరిష్కారాలు ప్రయత్నించి చూడండి.
1. మరీ లోన్లీగా ఫీలైతున్నప్పుడు మీ అభిరుచులను యాక్టివేట్ చేయండి. సంగీత సాధన మీ హాబీ అయితే, ప్రతిరోజూ దానికి ఓ గంట సమయం
కేటాయించండి.
2. ప్రతి ఉదయం సూర్యకాంతిలో తిరగడం వల్ల కూడా మనసుకు హాయి కలుగుతుంది. ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే సెరిటోనిన్ మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఒంటరితనాన్ని చేధిస్తుంది.
3. ఒంటరితనానికి విరుగుడు విహారమే! లోన్లీగా ఫీలైనప్పుడు ఫ్యామిలీతో చిన్నపాటి టూర్ వేయండి. మది కోరే మధుసీమలకు ఒంటరిగా వెళ్లినా.. ఒంటరితనం పారిపోతుంది.
4.పెంపుడు జంతువులతో కాలం గడిపినా.. లోన్లీనెస్ క్రమంగా తగ్గుతుంది.
5. ఆఫీస్‌లో మూడీగా కూర్చోకుండా.. లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లో నలుగురితో కలిసిపోయే ప్రయత్నం చేయండి. పనిచేసే చోట ఉన్న పరిస్థితులపై అసనహం వ్యక్తం చేయకుండా, సరదాగా కాలక్షేపం చేయండి.
6. పజిల్స్ చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, వర్కవుట్లు చేయడం, ఆటలు ఆడటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ… ఒంటరితనంపై బ్రహ్మాస్త్రంగా పనిచేస్తాయి.
– కణ్వస