వానాకాలం ఒక్కతే రాదు. వెండి మబ్బుల మూట కట్టుకొని, వాన జల్లుల్ని పట్టుకొస్తుంది. గాలిలో ఎగిరే తుమ్మెదల్లాగే మేఘాలను చూడగానే మన మనసూ నృత్యం చేస్తుంటుంది. మేఘ గర్జనలూ మనకు సన్నాయిల్లా వినిపించడానికి ఈ కాలంలో పెండ్లిండ్లూ కారణమే. మొత్తానికి మేఘమంటే మనకు మేనమామంత ఇష్టం. అందుకే ఆ మబ్బుల్ని ముంగిట్లోకి తీసుకొచ్చేలా రకరకాల ఇంటీరియర్ వస్తువులు, ఫర్నిచర్ రూపొందుతున్నాయి. అవి ఇంట్లో ఉంటే మబ్బులతో మనం కలిసున్నట్టే…
ఆకాశంలో దూది మబ్బులు కనిపిస్తున్నాయంటే వాతావరణం నిర్మలంగా ఉన్నట్టు. గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు. చిరుజల్లులు కురిపించే వానకుండలు ఎక్కడ ఉంటే అక్కడ నిర్మలత్వం ఉన్నట్టే. అందుకే వాటిని నట్టింట్లోకి ఆహ్వానిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇంటీరియర్‌లో భాగం చేస్తూ ఇంటికి సరికొత్త మేఘాల తోరణం కట్టుకుంటున్నారు. హాల్ నుంచి బెడ్రూమ్ వరకూ అన్ని చోట్లా మబ్బుల ముద్ర వేసే వీలుండేలా ఎన్నో ఉత్పత్తులు దొరుకుతున్నాయిప్పుడు.
హాల్లోకి రాగానే మనకు ముందుగా కనిపించేవి సోఫాలే. లివింగ్ రూమ్కీ ఇవే అందం. అందుకే రొటీన్‌కి భిన్నంగా ఉంచేలా దూది మబ్బుల్ని పోలి వీటిని రూపొందిస్తున్నారు. స్పాంజి, దూది, గొర్రె ఉన్నిలాంటివి ఇందుకోసం వినియోగిస్తున్నారు. మేఘం నుంచి వాన పడుతున్నట్టు, దాని మీద మనం కూర్చున్నట్టు కనిపించేలా చిత్రమైన స్టూళ్లను రూపొందిస్తున్నారు. మంచాల్లో కూడా మబ్బుల ఆకృతి అమరేలా తీర్చిదిద్దుతున్నారు. అద్దాలకీ ఆ అందాన్ని అద్దుతున్నారు.
ఇంటికి కాంతిని తెచ్చే లైట్లనైతే ఆకాశంలో మబ్బుని తెచ్చి వేలాడగట్టారా… అనిపించేలా తయారు చేస్తున్నారు. థండర్ స్టార్మ్ క్లౌడ్ లైట్లలో ఉరుముల శబ్దాలు కూడా వస్తాయి. దానికి తగ్గట్లు తళుక్కుమనే మెరుపులు, మబ్బు నుంచి చినుకులు పడుతున్నట్లు వెలుగులు కనిపిస్తాయి. ఇవి బ్లూటూత్‌తో అనుసంధానమై పాటలూ వినిపిస్తాయి. ఇక, ఇలాగే రంగులు, మారుతూ పాటలు వినిపించేలా గాల్లో తేలే లేవిటేటింగ్ క్లౌడ్ స్పీకర్లు కూడా వస్తున్నాయి. మరి ఈ వానాకాలం మీ ఇంటికీ మేఘాల ముస్తాబు చేస్తారా!