అర్థం చేసుకునే బాస్ ఉండటం.. నిజంగా వరమే! అయితే, అందరు బాస్లూ ఒకేలా ఉండరు. కొందరు ఉద్యోగులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. మరికొందరు వెంటపడి తరుముతుంటారు. అతిగా విమర్శిస్తుంటారు. ఏది చేసినా తిరస్కరిస్తుంటారు. ఇలాంటి బాస్‌ల ప్రవర్తనతో ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. పనిపై అసంతృప్తితోపాటు వారి మానసిక శ్రేయస్సుపైనా ప్రభావం పడుతుంది. అలా అని ఉద్యోగాన్నీ విడిచిపెట్టలేరు. బదులుగా.. బాస్‌ను నైస్‌గా మేనేజ్ చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వృత్తి జీవితంలో మనుగడ సాగించడానికి, ఎదగడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఏ సందర్భంలోనైనా మీ బాస్ మీపై కోపంతో అరిచినప్పుడు.. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. తిరిగి తనపై అరిస్తే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. బదులుగా.. ప్రశాంతంగా, ప్రొఫెషనల్‌గా ఉండటానికి ప్రయత్నించండి. మీరు మరింత స్పష్టంగా ఆలోచించడానికి, తెలివిగా ప్రతిస్పందించడానికి సమయం తీసుకోండి. సందర్భం వచ్చినప్పుడే.. అన్ని విషయాలపైనా సామరస్యంగా చర్చించుకోండి.
మీ బాస్ చెప్పిన ప్రతిదానికీ గంగిరెద్దులా తలాడించాల్సిన అవసరం లేదు. మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. ‘నో!’ చెప్పేయండి. అయితే.. మొహమాటం లేకుండా మొఖం మీదే చెప్పడం పద్ధతికాదని గుర్తుంచుకోండి. ప్రొఫెషనల్‌గా, గౌరవంగా.. ‘నో!’ చెప్పండి. మీకు-మీ బాస్‌కు మధ్య ఆరోగ్యకరమైన సరిహద్దును నిర్ణయించండి.
మీ బాస్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన కఠిన ప్రవర్తనకు కారణాలేంటో, మీ నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోండి. వృత్తిపరమైన టార్గెట్లు, ఉత్పాదకత పెంపు తదితర విషయాలే కారణాలైతే.. అందుకు తగ్గట్టుగా మీ పనితీరును మెరుగుపర్చుకోండి. అలాకాకుండా.. వ్యక్తిగతంగానే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టు గుర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి.
ఇది చివరి అస్త్రం. మీ బాస్ ప్రవర్తన మరీ భరించలేనంత భారంగా మారితే.. వేరే ఉద్యోగం చూసుకోండి. అయితే, కొత్త ఆఫీస్, ఉద్యోగం వల్ల కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. కానీ, కొన్నిరోజులు పోతే అదే అలవాటు అవుతుంది. కానీ, అక్కడే ఉంటే మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తుంచుకోండి.
మీ బాస్ మీ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? మీ తప్పులేకున్నా.. మిమ్మల్నే బాధ్యుల్ని చేస్తూ నిందిస్తున్నాడా? ఇలాంటి సందర్భాల్లో అతని ప్రవర్తనను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉండండి. మీ బాస్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బందులకు గురిచేశాడో.. సమయం, సందర్భం సహా అన్నిటినీ నోట్ చేయండి. ఎప్పుడైనా ఉన్నతస్థాయి సమావేశాలు జరిగినప్పుడు.. సందర్భం వస్తే మీ బాస్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. అయితే.. ఇది మీ బాస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. వాస్తవాలతో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాత్రమే!