ఈకాలం పిల్లల్లో దూకుడు స్వభావం పెరుగుతున్నది. పెంపకంలో లోపం, తల్లిదండ్రుల గారాబమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అయితే, వారిని అదుపులో పెట్టడానికి అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తే.. మరీ మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అది వాళ్ల ఎదుగుదల మీదా ప్రభావం చూపుతుంది. కాబట్టి.. పిల్లల్లో దూకుడు స్వభావాన్ని తగ్గించాలంటే, వారిని కాస్త నెమ్మదిగానే దగ్గరికి తీసుకోవాలి. అదెలాగంటే..
ప్రశాంతతే ప్రధానం: కొందరు పిల్లల్లో కోపం, విసుగు, అసహనం ఎక్కువగా ఉంటాయి. అలాంటివారితో ఎలాంటి సందర్భాల్లోనైనా ప్రశాంతంగానే వ్యవహరించాలి. వారు ఏదైనా తప్పుచేస్తే.. అందరిముందూ కోప్పడకుండా ప్రశాంతంగా వారిని దగ్గరికి తీసుకోవాలి. మీ భావోద్వేగాలు నియంత్రణలోనే ఉన్నాయని పిల్లలకు తెలిసేలా వ్యవహరించాలి. అప్పుడే పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుంది.
భావోద్వేగాలతో బంధం: పిల్లల్లో ప్రతికూల భావోద్వేగాలు ఉన్నప్పుడే.. వారిలో దూకుడు, నిరాశ, కోపం అనేవి పెరుగుతాయి. అలాంటి సమయంలో కొందరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. కాబట్టి.. మీ పిల్లలు తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు వారికి మద్దతుగా నిలవాలి. వాళ్ల ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవాలి. వారి భావాలను నిర్భయంగా పంచుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి. ఏదైనా విషయంలో వారు కలత చెందినట్లు అనిపిస్తే.. వారు ప్రశాంతంగా మారడానికి తగిన సమయం ఇవ్వాలి. వారిని కాసేపు అలా ఒంటరిగా వదిలేయాలి.
స్నేహ హస్తం: పిల్లలతో కఠినంగా ఉండకుండా.. స్నేహితులుగా మెలగండి. వారితో సరదాగా సమయం గడపడం వల్ల పిల్లల మనసులో ఉండే సంకోచాలు దూరమైపోతాయి. స్కూల్ నుంచి రాగానే హోమ్‌వర్క్ చేయమంటూ విసిగించకుండా.. స్కూల్లో సమయాన్ని ఎలా గడిపారో తెలుసుకోండి. దాంతో వాళ్లు మీకు మరింత దగ్గరవుతారు.
దృష్టిని మళ్లించాల్సిందే: కొన్నిసార్లు పిల్లల దృష్టిని మళ్లించడం కూడా వారిని కూల్ చేస్తుంది. పిల్లలు దూకుడు స్వభావాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే.. వారికి సపోర్ట్ చేయాలి. ఇవన్నీ కాకుండా, పరిస్థితి మరీ చేయి దాటిపోతున్నట్లు అనిపిస్తే.. చైల్డ్ సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్‌ని కలవడం మంచిది.