‘ఫూల్ మఖానా’ను చాలామంది హెల్దీ స్నాక్స్‌గా తీసుకుంటున్నారు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లను పొందుతున్నారు. ఆరోగ్యానికి భరోసానిచ్చే ఈ తామర విత్తనాలు.. కొందరికి మాత్రం హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. ‘మఖానా’కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
గర్భిణులు మఖానాను పరిమితంగానే తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దాంతో అసౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి, వైద్యుడిని సంప్రదించిన తర్వాతే.. మఖానాను తినాలి.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారికీ.. మఖానా మంచిది కాదు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల సమస్య ఉన్నప్పుడు.. శరీరంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. దీర్ఘకాలంలో గుండె సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, కిడ్నీరోగులు ‘మఖానా’ ముట్టకుంటేనే బెటర్!
మఖానా తింటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో లభించే ఫైబర్.. కొన్నిసార్లు గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను సృష్టిస్తుంది. అల్సర్, గుండెల్లో మంట, ఇతర జీర్ణ సమస్యలుంటే.. మఖానాను పక్కన పెట్టేయాలి.
కొందరిలో ‘మఖానా’ అలెర్జీలకు దారితీస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద, ఇతర ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. మఖానా తిన్నప్పుడు ఏదైనా అలెర్జీ వచ్చినట్లయితే.. వీటికి దూరంగా ఉండాలి. తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
మఖానాలో కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది. వైద్యుడి సలహా మేరకు పరిమితంగా
తీసుకోవాలి.