బాబాలంటే దేవుడు.. స్వర్గనరకాల గురించి చెప్పేవాళ్లనుకుంటారు. బాబాలు ప్రత్యేకమైన ఆహార్యంలో ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. పీపల్ బాబా మాత్రం అందుకు భిన్నంగా ఉంటాడు. అందరిలాగే ఉంటాడు. అందరిలో ఉంటాడు. ప్రకృతిని కాపాడటమే కర్తవ్యంగా భావించిన వ్యక్తి ఆయన. 18 రాష్ర్టాల్లోని 202 జిల్లాల్లో 20 మిలియన్లకుపైగా మొక్కలు నాటాడు, నాటించాడు. ఇంత గొప్ప పని చేసినా ఆయన ఘనమైన ప్రచారం చేసుకోలేదు. ఆ ప్రచార ఖర్చుతో ఇంకొన్ని మొక్కలు నాటొచ్చని పీపల్ బాబా ఆలోచన.
పీపల్ బాబాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆజాద్ జైన్. వాళ్ల నాన్న ఇండియన్ ఆర్మీలో డాక్టర్‌గా పని చేసేవాడు. ఆయనకు చండీగఢ్ నుంచి పూణెకు బదిలీ కావడంతో వాళ్ల కుటుంబం ఊరు మారాల్సి వచ్చింది. పూణె పాఠశాలలో ఓ రోజు ఇంగ్లిష్ టీచర్.. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని చెప్పింది. కిర్కీ మిలటరీ స్టేషన్ దారిలో పిల్లలతో మొక్కలు నాటించింది. 1977 జనవరి 26న ఆజాద్ మొదటిసారి మొక్కనాటాడు. ఆ రోజు అతని పుట్టిన రోజు కావడం విశేషం. ఆ సంతోషం ఎప్పటికీ ఉండేలా తర్వాత రోజుల్లోనూ మొక్కలు నాటుతూపోయాడు ఆజాద్. పూణెలో మొక్కలు నాటే అభిరుచి ఉన్న వాళ్లతో ఒక క్లబ్ ఉంది. ఆజాద్ అందులో చేరాడు.
తర్వాత మొక్కలు నాటడం ఉద్యమంగా పెట్టుకున్నాడు. ఇంగ్లిష్, జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసినా పర్యావరణ పరిరక్షణ కర్తవ్యంగా భావించాడు. మొక్కలు నాటడం కోసమే 2010లో ‘గివ్ మీ ట్రీస్ ట్రస్ట్’ నెలకొల్పాడు. భారతీయ తత్వవేత్త రజనీష్ ఓషో భావాలకు ప్రభావితుడైన ఆజాద్ జైన్ 1984లో సన్యాసం స్వీకరించాడు. ప్రకృతిపట్ల ప్రేమ, మొక్కల పెంపకం పట్ల బాధ్యతాయుతంగా పరివర్తన చెందిన ఆజాద్‌కి ‘స్వామి ప్రేమ్ పరివర్తన్’ అని పేరుపెట్టాడు ఓషో. స్వామి ప్రేమ్ పరివర్తన్ని సాధారణ ప్రజలు పీపల్ బాబా అని పిలుస్తుంటారు. లెక్కకు మించి రావి మొక్కలు నాటడంతో ఆయనకు ఆ పేరు స్థిరపడింది. పీపల్ బాబా ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక ఒడిదొడుకులు ఎదురైనా మొక్కలు నాటడం ఆపలేదు. 43 ఏండ్ల పాటు నిర్విరామంగా ఆయన ప్రయాణం సాగింది. ఇంకా సాగుతూనే ఉంది.