పిల్లల మొట్టమొదటి రోల్‌మోడల్స్.. తల్లిదండ్రులే! మిమ్మల్ని చూసే మీ పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. మీరు చేసే ప్రతిపనినీ వాళ్లు నిశితంగా గమనిస్తారు. మీరు చేసే ఏ చిన్న పొరపాటైనా.. వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో.. మీ పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. కుటుంబసభ్యులు మొదలుకొని అపరిచితుల వరకూ.. ఎవరెవరితో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ పిల్లలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. అందుకే, పిల్లల ముందు ఇతరులతో మర్యాదగా మెలగాలన్నది మానసిక నిపుణుల సూచన.
తల్లిదండ్రులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే.. పిల్లలు కూడా ఫాలో అయిపోతారు. వారుకూడా మీ ఆహారపు అలవాట్లనే అలవర్చుకుంటారు. మీరు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల.. వారూ ఆరోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడతారు.
పిల్లలకు గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. బాల్యంలో ఏదైనా అలవాటు చేస్తే.. పెద్దయ్యాక కూడా పాటిస్తూ ఉంటారు. అందుకే, మీ పిల్లల్ని ప్రతిరోజూ మీతోపాటే వ్యాయామం చేయడానికి తీసుకెళ్లండి. వారు పెరిగేకొద్దీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు.
భావోద్వేగాలను అదుపు చేసుకోవడం, ఒత్తిడిని జయించడంలో మీ పిల్లలకు మీరే మొదటి గురువులు. ఆయా సందర్భాల్లో మీరు ఎలా స్పందిస్తున్నారో గమనించి.. వారుకూడా ఆయా ప్రతిస్పందనలను అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి, భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు తలెత్తినప్పుడు.. పిల్లల ఎదుట గొడవలకు దిగడం ఏమాత్రం మంచిదికాదు.
మీరు మీ వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమతుల్యం చేస్తున్నారో పిల్లలు గమనిస్తుంటారు. మీరు ఎప్పుడూ పని ఒత్తిడికి గురికావడం, కుటుంబంతో మంచి సమయం గడపలేకపోవడం వల్ల.. మీ పిల్లల్లో ప్రతికూల దృక్పథం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి జీవితంలోపాటు వ్యక్తిగత సమయానికీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. మీ పిల్లలకూ ఆ రెండిటి విలువ తెలుస్తుంది.
ఆర్థిక సమస్యల గురించి ఇంట్లో చర్చించడం, బడ్జెట్ వేసుకోవడం లాంటివి.. మీ పిల్లల్లో డబ్బుపై అవగాహన పెంచుతాయి. దుబారా ఖర్చులు, పొదుపు లాంటి మాటలు.. పిల్లల్లో ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కల్పిస్తాయి.