పిల్లల్ని ‘క్రమశిక్షణ’లోనే పెంచాలని నేటితరం తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ, ఎక్కువగా ‘శిక్ష’, ‘శిక్షణ’తోనే వారిని దారిలో పెట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారులను లేనిపోని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎందుకంటే.. పిల్లల భావోద్వేగాలు వేరుగా ఉంటాయి. వారి మెదళ్లలో పుట్టుకొచ్చే సవాలక్ష ప్రశ్నలతో, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే వారు అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేరు. ఫలితంగా, పెద్దవాళ్ల ఆగ్రహానికి గురవుతుంటారు. దీర్ఘకాలంలో గందరగోళంతోపాటు మానసిక క్షోభకూ గురవుతారు. కాబట్టి, మొదట తల్లిదండ్రులు మారాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చేసే చిన్నచిన్న తప్పులను ముందుగా గుర్తించి, వాటిని నివారించడంలో పిల్లలకు అండగా ఉండాలని చెబుతున్నారు.
g పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, అందుకు తగ్గట్టుగా ప్రవర్తించడంలో చాలామంది పేరెంట్స్ విఫలమవుతున్నారు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు వారికి లెక్చర్ ఇవ్వడం, శిక్షించడం ఏమాత్రం మంచిది కాదట. బాధలో, నిరాశలో ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం దాదాపు అసాధ్యం. ఇలాంటి సమయంలో వారికి మంచి మాటలు చెప్పినా.. అది వారిని మరింత బాధకు గురిచేస్తుందట. పరిస్థితులు ప్రశాంతంగా మారిన తర్వాతే.. మార్గదర్శకత్వాన్ని ఎక్కువగా గ్రహిస్తారట.
g కొందరు తల్లిదండ్రుల క్రమశిక్షణ ప్రోగ్రామ్.. రోజుకో రకంగా ఉంటుంది. ఈరోజు మెచ్చుకున్న విషయంలోనే.. మరుసటి రోజు తిట్ల దండకం మొదలుపెడతారు. భోజనం చేయడం, బంధువులతో కలిసిపోవడం, ఆరుబయట ఆటలాడటం.. లాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు విరుద్ధభావాలతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి భావాలు పిల్లలను గందరగోళానికి గురి చేస్తాయట. తల్లిదండ్రుల అంచనాలు ఏమిటో కచ్చితంగా తెలియని చిన్నారులు.. ఏది ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తుంటారట. ఈ క్రమంలో వారి మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది.
g నేటితరం తల్లిదండ్రులు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి.. చిన్నారుల నుంచి ఎక్కువగా ఆశించడం. సమస్య ఏమిటంటే.. పసిపిల్లల మెదళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనీ, అన్నిట్లోనూ ఫస్ట్ రావాలని ఆశ పడుతుంటారు. లక్ష్యాన్ని చేరుకోనివారిపై కస్సు బుస్సులాడుతారు. దాంతో, పిల్లలు నిరాశకు గురవుతారు.