నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పెంచుతున్నారు. ముఖ్యంగా.. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లే ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే, ఇలా పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పెంచడం ఏమాత్రం మంచిదికాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పిల్లలకు బాల్యంనుంచే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. లేకుంటే.. భవిష్యత్తులో దుబారాకు మారుపేరుగా నిలుస్తారని హెచ్చరిస్తున్నారు.
పిల్లలకు అడిగినంత కాకుండా.. తక్కువ పాకెట్ మనీ ఇవ్వండి. ఎక్కువ కావాలంటే.. ఇంటిపనులు చేసి సంపాదించుకోవాలని చెప్పండి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఇంటి పనులు నేర్చుకుంటారు. డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకుంటారు. వారికి పని విలువ, డబ్బు విలువ తెలియడంతోపాటు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది. కాబట్టి, పిల్లలకు చిన్నతనం నుంచే పనులు చేయడం నేర్పించాలి. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాళ్లకు అర్థమయ్యేలా చూడాలి.
పిల్లలకు మామూలు కిడ్డీ బ్యాంకులకు బదులుగా.. గ్లాసుతో తయారైన కిడ్డీ బ్యాంకులను ఇవ్వండి. అందులో జమచేసే డబ్బులు రోజురోజుకూ పెరుగుతూ వారికి కనిపిస్తుంటే.. వారిలోనూ డబ్బులు ఇంకాఇంకా పొదుపు చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది.
మీ నెలవారీ ఖర్చులు, ఇంటి బడ్జెట్ గురించి పిల్లలకు చెప్పండి. మీ సంపాదన, ఖర్చులు, పొదుపు.. ఇలా అన్ని విషయాలను వారితో పంచుకోండి. దీనివల్ల మీ ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చు చేయడం అలవాటుగా మార్చుకుంటారు.
డబ్బులను ఖర్చు పెట్టేముందు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా పిల్లలకు మార్గనిర్దేశం చేయండి. ఏదైనా వస్తువును కొనుగోలు చేసేముందు.. నిజంగా ఆ వస్తువు అవసరమా? లేదా అనేది నిర్ధారించుకోవాలని చెప్పండి. ఈ అలవాటు.. దుబారాను తగ్గిస్తుంది.
అన్నిటికన్నా ముందు.. మీరు మారండి. దుబారా ఖర్చులను తగ్గించుకోండి. ముఖ్యంగా పిల్లలతో కలిసి బయటికి వెళ్లినప్పుడు డబ్బులను ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టకుండా.. పొదుపు పాటించండి. అప్పుడే పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.