పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా. దాంతో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, క్రమశిక్షణ కారణంగా యాక్టివ్గా లేకపోవడం లాంటివి గమనించొచ్చు. కఠిన నియమాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కొరకరాని కొయ్యల్లా తయారయ్యే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల విషయంలో తల్లిదండ్రులు పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచినవారు అవుతారు.
పాజిటివ్ ఆలోచనలు: పిల్లల్లో ముందుగా పాజిటివ్ ఆలోచనలను పెంపొందించాలి. చదువు, ఆటలు ఇలా ఏ అంశంలోనైనా వారిని ప్రోత్సహించాలి. వారికి ఎందులో ఆసక్తి ఉందో గమనించి.. ఆ దిశగా వెన్నుతట్టాలి. మార్కులు సరిగ్గా రావడం లేదని మందలించడం కన్నా.. చదువు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ నాలుగు మంచిమాటలు చెబుతూ వారిని నిదానంగా దారిలోకి తెచ్చుకోవాలి.
సహాయపడే గుణం: తల్లిదండ్రుల గుణగణాలు పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. మీరు స్వార్థంగా ఉంటూ.. పిల్లలకు నిజాయతీగా ఉండాలని బోధిస్తే ఫలితం ఉండదు. సాయం చేసే లక్షణం మీలో ఉన్నప్పుడే.. అది పిల్లలకు చెప్పకుండానే అలవడుతుంది. మీరు అపాత్రదానం చేస్తే.. వాళ్లూ అలాగే తయారవుతారు. ఎవరికి సాయం చేసినా, ఎందుకు చేస్తున్నాం, సాయం పొందిన వారి అవసరం ఎంత విలువైనదో తెలియజెప్పాలి. అప్పుడే నలుగురికీ సాయం చేసే లక్షణం మీ పిల్లల్లో పెంపొందుతుంది.
బాధ్యతలు అప్పగించాలి: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారిని చదువుకోమని చెబుతూ ఉంటాం. చదువుతోపాటు ఇంట్లో చిన్నచిన్న పనులు వాళ్లకు అప్పగించాలి. ఆ పని పూర్తిచేసే బాధ్యత వారిదేనని చెప్పాలి. దానివల్ల పిల్లల్లో కృషి, పట్టుదల పెరుగుతాయి.
ఫోకస్ ముఖ్యం: ఏ పని మొదలుపెట్టినా దానిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని పదేపదే చెబుతూ ఉండాలి. ఫోకస్ పెట్టి చేస్తే పూర్తికాని పని ఏదీ ఉండదని చెప్పాలి. ఒక గోల్ పెట్టుకుని ప్లాన్ చేసి దానిని సాధించడం అలవాటు చేయాలి. అంతేకాదు, ఏ విషయాన్నయినా తల్లిదండ్రులతో పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.