వామనగుంటలు లెక్కలు నేర్పేవి. తొక్కుడుబిళ్ల పిక్కకు బలాన్నిచ్చేది. దాగుడుమూతలు పరిశోధనా జ్ఞానాన్ని పెంపొందించేది. గచ్చకాయలు ఏకాగ్రతను పెంచేది. నిన్నటి తరం ఆడిన ఆటలన్నీ అద్భుతాలే! కానీ, సెల్‌ఫోన్ చేతికొచ్చాక ఆటలన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ఈ తరం పిల్లల ఆటలన్నీ దా‘రుణాల’కు దారితీస్తున్నాయి. కొన్ని ఆటలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్న వాళ్లను కట్టడి చేయడం అనివార్యం. లేదంటే అది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.
Online Games | ఆటలంటే ఆహ్లాదాన్ని ఇవ్వాలి. ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అంతేకానీ, జీవితాలను అతలాకుతలం చేయొద్దు. కానీ, ఆన్లైన్ గేమ్స్ మాయలోపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నది నేటి తరం. మొమొ చాలెంజ్, పబ్జీ, బ్లూవేల్ చాలెంజ్ లాంటి గేమ్స్ అభం శుభం ఎరుగని చిన్నారుల ప్రాణాలనూ హరిస్తున్నాయి. నేడు కౌమార దశలో ఉన్న కుర్రకారంతా ఫోన్‌కు అతుక్కుపోయి ఆన్లైన్ ఆటల్లో మునిగిపోతున్నారు. ఆటవిడుపుగా మొదలయ్యే ఆట వ్యసనంగా మారి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నది.
పరిణామాలు తీవ్రం
ఆర్థిక మోసాలను పక్కనపెడితే, ఆన్లైన్ ఆటలో అంచెలు దాటేకొద్దీ వారి ఉత్సాహం కంచె దాటిపోతుంటుంది. లెవల్ ఫెయిల్ అయితే.. భూగోళం తలకిందులైందన్న రేంజ్లో ప్రవర్తిస్తుంటారు కొందరు. తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. చిర్రెత్తిపోతుంటారు. ఈ క్రమంలో కొందరైతే ఆత్మహత్యకూ పాల్పడుతున్నారు. లెవల్ దాటితే సంబురపడిపోవడం, దాటలేకపోతే లోలోపల కుమిలిపోవడం రెండూ తీవ్రమైన పర్యవసానాలే! పిల్లల్లో ఈ తరహా ప్రవర్తన గమనించినట్లయితే.. వాళ్లు ఆన్లైన్ గేమింగ్‌కు పూర్తిగా బానిసలైనట్టే అని గుర్తించొచ్చు. ఈ దశలో అయినా వాళ్లను కట్టడి చేయకపోతే.. పరిణామాలు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.
మోసాలకు అడ్డా..
ఆన్లైన్ ఆటలను మోసాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు ఫ్రాడ్స్టర్లు. యూజర్ల బలహీనతను తమ బలంగా మార్చుకుంటున్నారు గేమ్ తయారీదారులు. ముందుగా ఉచిత సబ్స్క్రిప్షన్ అంటూ ఆటలోకి లాగుతారు. ఆటల్లో పూర్తిగా మునిగిపోయాక.. ముసుగు తొలగిస్తారు. కఠినమైన లెవల్స్ దాటడానికి ఆఫర్లు ఇస్తూ అందినకాడికి దండుకుంటారు. ఆట మత్తులో ఎలాగైనా లెవల్ పూర్తిచేయాలన్న పంతంతో.. తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులను వాడేస్తున్న పిల్లలూ ఉంటున్నారు. మల్టీపుల్ ప్లేయర్స్ ఆటల్లో ఈ తరహా విపరీతాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. యూజర్లను అక్షయపాత్రలుగా మలుచుకొని.. పబ్బం గడుపుకొంటున్నారు గేమ్ డెవలపర్లు! బ్యాటిల్ గేమ్స్‌లో అయితే.. రకరకాల గన్స్ ఆఫర్ చేస్తూ జేబుకు చిల్లు పెడుతున్నారు.
తెలుసుకున్నాకే..
ఆన్లైన్ ఆటల ఉచ్చులో చిక్కొద్దంటే.. పిల్లల దృష్టిని ఇతర వ్యాపకాలపైకి మళ్లించడం ఒకటే మార్గం. ఆటవిడుపు కోసం కాసేపు ఆడుకుంటారు అనుకుంటే.. కొన్ని నియమాలకు లోబడి గేమింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సదరు గేమ్ ఏ తరహాదో ముందుగా తెలుసుకోవాలి. ఈసీ- ఎర్లీ చైల్డ్‌హుడ్, ఈ-ఎవ్రీవన్, టీ-టీన్, ఎమ్- మెచ్యూర్, ఏవో- అడాల్ట్స్ ఇలా గేమ్ యాప్‌లు వర్గీకరించి ఉంటాయి. మీ పిల్లల వయసు, ఆలోచనా విధానాన్ని బేరీజు వేసుకొని గేమింగ్ యాప్స్ (ఒకటి లేదా రెండు) ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఆ యాప్‌ల పిక్చర్స్ చూడాలి. హింసాత్మకమైన ఆటల జోలికి అస్సలు వెళ్లొద్దు. అసభ్యకరమైన సంభాషణలు ఉన్న ఆటలను ఇన్స్టాల్ చేయొద్దు. మీ పిల్లల వయసుకు తగిన యాప్‌లు అందులోనూ మెదడుకు మేత పెట్టేవాటిని, సరదాగా కాలక్షేపానికి అక్కరకు వచ్చే యాప్‌లనే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టేషన్‌లో రేటింగ్ బాగా ఉన్న వాటినే ఎంపిక చేయాలి. పేరెంటింగ్ కంట్రోల్స్ పక్కాగా ఉండేలా జాగ్రత్తపడాలి.
అందినకాడికి…
ఆన్లైన్ ఆటల్లో ఆఫర్ల కొనుగోలు సమయంలో జరిగే మోసాలు పత్రికల్లో ప్రధాన శీర్షికలు అవుతున్నాయి. యాప్‌లో క్రెడిట్/ డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లు యాక్టివేట్ అవుతారు. సందేశాలు పంపుతూ, లింక్‌లు షేర్ చేస్తూ… యూజర్లను ముగ్గులోకి లాగేందుకు ప్రయత్నిస్తారు. ఆట మత్తులో వాటికి స్పందించారో.. నయా పైసా లేకుండా ఖాతానంతా ఖతం పడతారు. ఈ ఖేల్ దునియాలో బోగస్ యాప్‌లు కూడా ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకున్న మరుక్షణం ఫోన్ హ్యాక్ అవుతుంది. సదరు యూజర్ వ్యక్తిగత సమాచారం అంతా ఫ్రాడ్‌స్టర్ల పరమవుతుంది. ఆన్లైన్ టోర్నమెంట్లు నయా మోసం. ఫేక్ పోటీలు నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసే యాప్‌లూ ఉన్నాయి. ఇక ఐపీఎల్, ఇతర మెగా క్రికెట్ ఈవెంట్లు ఉన్నప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్‌కు ప్రోత్సహించే యాప్‌లు కోకొల్లలు. ఈ ఉచ్చులో చిక్కుకొని లక్షలు కోల్పోయిన బాధితులూ ఉంటున్నారు. అన్నిటినీ మించి ఈ ఆటల్లో మునిగితేలడం వల్ల విలువైన సమయం కరిగిపోతుంది. దీనికి బహుమానంగా యాైంగ్జెటీ తగులుకుంటుంది.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్