Eco soap bank | సుమారు ఎనిమిదేండ్ల కిందటి ముచ్చట. అమెరికాలోని పిట్స్బర్గ్కు చెందిన సమీర్ లఖానీ కాంబోడియా పర్యటనకు వెళ్లాడు. అక్కడి పురాతన కట్టడాలు చూసి ఎంతగానో ఆనందించాడు. అదే సమయంలో ఆ నిర్మాణాల చెంత నిరుపేదలు పడుతున్న దురవస్థలు చూసి బాధపడ్డాడు. ఓ తల్లి నెలల పసికందుకు దుస్తులు ఉతికే సబ్బుతో స్నానం చేయిస్తుండటం చూసి చలించిపోయాడు. ‘ప్రకృతి పరంగా, పర్యాటకంగా ఎన్నో అద్భుతాలను తనలో పొదుగుకున్న కాంబోడియాలో ఇలాంటి పరిస్థితా?’ అని మథనపడ్డాడు. గణాంకాలు పరిశీలిస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిలో కేవలం ఒక్కశాతం మాత్రమే వంటి సబ్బుతో స్నానం చేస్తున్నట్టు లెక్క తేలింది. శుభ్రత కరువై ఎందరో చిన్నారులు అనారోగ్యాల బారినపడుతున్నట్టు గుర్తించాడు సమీర్. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించాడు. అందులోంచి పుట్టిందే ‘ఎకో సోప్ బ్యాంక్’ స్వచ్ఛంద సంస్థ.
నిరుపేదల ఆర్థిక స్థితిగతులను మార్చే శక్తి సమీర్ దగ్గర లేకపోవచ్చు. కానీ, తనవంతుగా వారి బాగుకోసం నడుం బిగించాడు. ‘ఎకో సోప్ బ్యాంక్’ ద్వారా సబ్బులను సేకరించడం మొదలుపెట్టాడు. కొత్త సబ్బులు కొనుగోలు చేసేంత ఆర్థిక వనరులూ అందుబాటులో లేవు. వాడినవి, అరిగిపోయిన సబ్బులను సేకరించడం పనిగా పెట్టుకున్నాడు. వాటిని రీసైకిల్ చేసి మన్నికగా తీర్చిదిద్దేవాడు. తర్వాత ఆ సేఫ్టీ సబ్బులను నిరుపేదలకు ఉచితంగా పంచే ఏర్పాట్లుచేశాడు. ఏదో పదోపరకో సబ్బులు సేకరించలేదు ఆయన. ‘ఎకో సోప్ బ్యాంక్’ ద్వారా ఏకంగా 90 లక్షల సబ్బులను సేకరించాడు. పది దేశాల్లో 16 రీసైకిల్ యూనిట్ల ద్వారా వాటిని తాజా సబ్బులుగా తీర్చిదిద్ది పరిశుభ్రతను కానుకగా అందించాడు. కాంబోడియాతోపాటు మరెన్నో దేశాల్లోని నిరుపేదలకు ఈ సబ్బులు చేరాయి. దీంతోపాటు బంగ్లాదేశ్ పల్లెల్లో విద్యుత్ కాంతులు నింపడానికి చేయూతనిచ్చాడు సమీర్. నేపాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమయ్యాడు. 2014 నుంచి సేవాపథంలోనే కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2017లో సీఎన్ఎన్ టాప్ టెన్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. 2020 ఫోర్బ్స్ టాప్ థర్టీ అండర్ థర్టీ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సమీర్ భారత మూలాలున్న అమెరికన్ కావడం విశేషం.
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”