చిరుజల్లులకు ప్రకృతే కాదు.. మన మనసూ పులకిస్తుంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ, కొందరిలో మాత్రం.. వర్షం చెప్పలేని భయాన్ని కలిగిస్తుంది. ఆకాశంలో ఉరుము ఉరిమితే.. వీళ్ల గుండెల్లో పిడుగు పడుతుంది. ఆ భయానికే.. ఓంబ్రోఫోబియా అని పేరు. భారీ వర్షాలకే కాదు.. తేలికపాటి చినుకులకూ వీళ్లు భయపడుతుంటారు.
ఓంబ్రోఫోబియా బాధితులు తమకు వర్షం ఏదో ఒక హాని కలిగిస్తుందని భావిస్తారు. వాన వల్ల విద్యుత్ అంతరాయాలు, దాంతో చీకట్లు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఆమ్ల వర్షాలు, వర్షంతో వచ్చే సూక్ష్మక్రిముల గురించీ ఆందోళన చెందుతారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో.. ఓంబ్రోఫోబియా బాధితులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కారణాలు: ‘ఓంబ్రోఫోబియా’కు నిర్దిష్ట కారణాలు లేవు. కానీ, వర్షం వల్ల కలిగిన కొన్ని భయంకరమైన అనుభవాలు.. కొందరిని వర్షం అంటే భయపడేలా చేస్తాయి. వరదల్లో ఆత్మీయులను కోల్పోయిన వాళ్లలో.. భయంకరమైన తుఫాను, వరదల నుంచి బయటపడిన వ్యక్తుల్లో కలిగే భయం.. క్రమంగా ఓంబ్రోఫోబియాగా మారుతుంది. కొందరిలో ఈ ఆందోళన పుట్టుకతోనే వస్తుందట. ఇలాంటివారిలో వర్షం పడుతున్నప్పుడు తీవ్రమైన భయం, ఆందోళన, విపరీతంగా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు పుట్టడం, తలతిరగడం, నోరు ఎండుకపోవడం, వికారం, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు : ఓంబ్రోఫోబియా బాధితులు.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్లేటప్పుడు వాతావరణ సూచనలను గమనించాలి. ముఖ్యంగా, వర్షం వచ్చే అవకాశం ఉంటే.. బయటికి వెళ్లకుండా ఉండాలి. ఇక తేలికపాటి లక్షణాలు ఉంటే.. చికిత్స అవసరం లేకపోవచ్చు. కానీ, తీవ్రంగా ఉంటే చికిత్స తీసుకుంటేనే మంచిది. ఇలాంటి బాధితుల్లో కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, హిప్నోథెరపీతో వర్షం అంటే భయం తగ్గించేలా చేయొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. పలు రకాల మందులతోపాటు ధ్యానం, యోగాతోనూ ‘ఓంబ్రోఫోబియా’ నుంచి బయటపడొచ్చు.