సిటీబ్యూరో,ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి , అసాధారణ ప్రతిభ కనబరిచిన 1446 మంది పోలీసు సిబ్బందికి నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ రివార్డులు అందజేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఎక్స్‌ట్రామైల్ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా ఈ ఎక్స్‌ట్రామైల్ అవార్డులను ప్రవేశపెట్టామని, వీటితోపాటు గుడ్వర్క్డన్ రివార్డులను పోలీసు సిబ్బందికి ఇచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ పోలీసు వృత్తి కేవలం విధినిర్వహణ మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యతగా గుర్తు చేస్తూ పోలీసులు సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు.
అప్పగించిన పనిని పూర్తి చేయడం కంటే బాధితులకు ఎంతటి భరోసాను కల్పించామన్నదే అసలైన విజయమని, విధులకు అతీతంగా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించినప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రతీనెలా జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. పురస్కారాలు అందుకున్న వారిలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.
ఎక్స్ట్రామైల్లో భాగంగా విధి నిర్వహణలో విధులకు అతీతంగా సేవలందించిన 271 మందికి ఈ పురస్కారం దక్కగా, గుడ్‌వర్క్ డన్లో భాగంగా విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 1175 మందికి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులు, నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్.శ్వేత, డీసీపీలు చైతన్యకుమార్, శిల్పవల్లి, అరవింద్‌బాబు, లావణ్యనాయక్ జాదవ్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.