శిథిల స్థితిలో నిర్మాణాలు.తాగునీరు లేని తరగతి గదులు. విరిగిన బెంచీలు. ముక్కలైపోయిన కుర్చీలు. పిడికెడు మంది విద్యార్థులు. ఇదంతా ఆమె బాధ్యత తీసుకోవడానికి ముందు మాట. అర్చన నోగూరి ప్రధానోపాధ్యాయురాలి హోదాలో కాలుపెట్టగానే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొద్దికాలంలోనే అత్యుత్తమ పాఠశాల స్థాయికి చేరింది ఆ సర్కారు బడి. ఆ చొరవకు గుర్తింపుగానే ఆమె జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
‘పాఠశాల సమాజానికి దూరంగా ఉండొద్దు. సమాజంలో ఓ భాగం కావాలి. అంతెందుకు? ప్రభుత్వ పాఠశాలల కోసం సర్కారు చాలా చేస్తున్నది. ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నది. మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందిస్తున్నది. యూనిఫామ్ సమకూరుస్తున్నది. టీచర్లు కూడా ఎంతోకొంత చేయగలిగితేనే పిల్లలు అన్ని రకాలుగా ఎదుగుతారు’.. ఇప్పుడే కాదు. విద్యార్థి దశ నుంచీ బోధన రంగం మీద నా నిశ్చితాభిప్రాయం ఇది. ఇరవై మూడేండ్ల క్రితం.. నా కల నిజమైంది. ఏరికోరి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాను. చాలా పాఠశాలల్లో పనిచేశాను. పదేండ్ల క్రితం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెన పల్లి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా వచ్చాను.
రెండు వేల జనాభా ఉన్న పెద్ద గ్రామం అది. కానీ, పాఠశాలలో 30 మంది విద్యార్థులే ఉన్నారు. దాదాపు మూతపడే స్థితిలో ఉంది. ఒక బడి తలుపులు మూసుకుంటే.. వందల జీవితాలు చీకటి పాలవుతాయి. ఏ విద్యాలయానికీ ఆ దుస్థితి రాకూడదు. ఎలాగైనా మా పాఠశాలను బతికించుకోవాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో చాలామంది తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపేవారు. ఇంటింటికీ తిరిగి కన్నవారితో మాట్లాడాను. టీచర్లు లేరు, తాగునీటి వసతి లేదు, కనీసం ఇంగ్లిష్ మీడియం ఉన్నా పంపేవాళ్లం.. ఇలా రకరకాల కారణాలు చెప్పారు. గ్రామసభ నిర్వహించి అందరి సహకారం కోరాను. సానుకూల స్పందన వచ్చింది. ఆ భరోసాతో బడి సమీపంలోని ఎస్సీ కాలనీలో ప్రతి కుటుంబాన్నీ కలిశాను. ఆర్థిక భారంతో పిల్లలను చదివించలేకపోతున్న తల్లిదండ్రులతో మాట్లాడి 25 మంది పిల్లల్ని చేర్చుకున్నాను.
Archana
పట్టుదలతో మెప్పించి..
రోజూ అందరికంటే ముందు నేనే బడికి వెళ్లేదాన్ని. లెక్కలు రాని పిల్లలకు లెక్కలు నేర్పేదాన్ని. తెలుగులో వెనుకబడినవారికి చదవడం, రాయడం అలవాటు చేయించాను. ఆ ఏడాది విద్యార్థుల్లో వచ్చిన మార్పును అంతా గమనించారు. దీంతో రెండో ఏడాది 90 మంది పిల్లలు వచ్చారు. ఆ తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మా పాఠశాల పూర్తిస్థాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా మారింది. దీంతో పక్కనున్న ఎల్లారం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాతిక మందిని చేర్పించారు. వాళ్లను చూసి ముత్యంపేట, చింతపల్లి, దండేపల్లి, వెంకటాపూర్ నుంచీ పిల్లలు వచ్చారు. అయితే, విద్యార్థుల సంఖ్య పెరిగాక కూడా తాగునీటి వసతి ఉండేది కాదు. తరగతి గదులూ అంతంతమాత్రమే. సర్పంచ్ చొరవ తీసుకుని.. పాడైపోయిన రెండు గదులను బాగు చేయించారు.
అప్పటి ఎమ్మెల్సీ రూ.1.10 లక్షలతో బోరు వేయించారు. మోటారు పెట్టించారు. ఆ తర్వాత రెబ్బనపల్లికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే ప్రవాస పూర్వ విద్యార్థి బెంచీలు, వాటర్ ప్యూరిఫయర్ సమకూర్చారు. ఇవన్నీ చూసి.. హైదరాబాద్ నుంచి ఓ ఫౌండేషన్ డిజిటల్ ఎడ్యుకేషన్ పెట్టండి మేము మద్దతు ఇస్తామని ముందుకొచ్చింది. ఆరు కంప్యూటర్లు అందించింది. వాటితో ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పేందుకు ఒక ఇన్స్ట్రక్టర్ను నియమించి.. నా సొంత డబ్బుతో నెలకు రూ.3 వేల జీతం ఇస్తున్నాను. అలా పిల్లల సంఖ్య 190కి పెరిగింది. విద్యార్థులకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో.. దాతల సహకారంతో ఇద్దరు ప్రైవేటు టీచర్లను పెట్టుకున్నాం. అయినా మరో ఇద్దరు అవసరం అయ్యారు. సొంత నిధులతో వాళ్లనూ నియమించాను. మొత్తం ఆరుగురు టీచర్లు రావడంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. కరాటే ఇన్స్ట్రక్టర్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆడపిల్లలకు ఆత్మరక్షణ అవసరమనే ఉద్దేశంతో ప్రత్యేక కరాటే తరగతులు నిర్వహిస్తున్నాం.
ప్రపంచంతో పరిచయం
ప్రతి క్లాస్ రూమ్‌కు ఒక రీడింగ్ కార్నర్ (లైబ్రరీ) ఏర్పాటు చేశాం. అక్కడ 100 నుంచి 150 పుస్తకాలు ఉంటాయి. ఖాళీ సమయంలో వాటిని చదువుకోవచ్చు. చదవగానే సరిపోదు, మరునాడు సమీక్ష రాసుకొని రావాలనే నియమం పెట్టాం. దీనివల్ల వ్యక్తీకరణ మెరుగుపడుతుంది. ఎంతో మెరుగుపడింది కూడా. మా పిల్లలు చిన్నచిన్న కథలు రాస్తున్నారు. వాటన్నిటినీ ఓ పుస్తకంగా తీసుకొచ్చే ఆలోచన ఉంది. విద్యార్థులను తరచూ బయటికి తీసుకు వెళ్తాను. రైతులతో, గొర్రెల కాపరులతో, పంచాయతీ సిబ్బందితో.. ఇలా రకరకాల వ్యక్తులతో మాట్లాడిస్తాను. పర్యావరణ పరిరక్షణపైనా అవగాహన కల్పిస్తున్నా. ఇటీవల మట్టి వినాయకులను తయారు చేసి పంపిణీ చేశారు మా విద్యార్థులు. రెసిడెన్షియల్ స్కూల్లో, మాడల్ స్కూల్లో గణనీయమైన సీట్లు సాధిస్తున్నారు మా వాళ్లు. ఒకరికి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం లభించింది. మా తాత నోగూరి పురుషోత్తం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మనసున్న మనిషి. ఎన్నో జీవితాను తీర్చిదిద్దారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నా. ఉద్యోగంలో చేరాక డిగ్రీ, నాలుగు పీజీలు చేశాను. పీహెచ్డీ చేస్తున్నాను. ఇటీవల అందుకున్న జాతీయ అవార్డును సమష్టి కృషి ఫలితంగా భావిస్తాను. బడిని బాగు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
…? గుళ్లపెల్లి సిద్ధార్థ గౌడ్
మాదరబోయిన శ్రీనివాస్ యాదవ్
Archana