Skipping | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. రోజూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు. దీంతో వారికి చక్కని వ్యాయామం జరిగేది. దీని వల్ల వారు ఆరోగ్యంగా ఉండేవారు. వృద్ధాప్యం వచ్చినా శారీరక దారుఢ్యం ఉండేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులోనే అన్ని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం వ్యాయామం లేదా శారీరక శ్రమ లేకపోవడమే అని చెప్పవచ్చు. కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయితే మనకు అనేక రకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా మంది తమకు సౌకర్యవంతంగా ఉండే వ్యాయామాలను చేస్తుంటారు. ఇక అలాంటి వ్యాయామాల్లో స్కిప్పింగ్ కూడా ఒకటి. దీన్నే రోప్ జంపింగ్ లేదా స్కిప్పింగ్ రోప్స్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాయామాన్ని చాలా మంది చేస్తుంటారు. అయితే దీన్ని రోజూ చేయడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
స్కిప్పింగ్ ను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. అయితే స్కిప్పింగ్ అసలు అలవాటు లేని వారు రోజుకు 30 నిమిషాలు చేయడం కష్టం అవుతుంది. కనుక ముందుగా 5 నిమిషాలతో ప్రారంభించాలి. క్రమంగా ఆ సమయాన్ని పెంచుతూ పోవాలి. దీని వల్ల రోజూ 30 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసే సామర్థ్యం వస్తుంది. ఇలా ఈ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. స్కిప్పింగ్ వల్ల గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. దీన్ని అత్యుత్తమ, ఖర్చు లేని కార్డియో వ్యాయామంగా చెప్పవచ్చు. దీని వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సక్రమంగా అవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
స్కిప్పింగ్ వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ సులభంగా బయటకు వెళ్లిపోతుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు చక్కని వ్యాయామం అవుతుంది. ముఖ్యంగా పొట్ట, తొడలు, పిరుదులకు చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ఆయా భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరం సన్నగా నాజూగ్గా మారుతుంది. కండరాలు దృఢంగా మారి చక్కని దేహ దారుఢ్యం సొంతమవుతుంది. శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. యాక్టివ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట ఉండవు. బద్దకం పోతుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరిగిపోతుంది. రోజూ 30 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే శరీరం సుమారుగా 300 క్యాలరీల వరకు శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. అధిక బరువు సులభంగా తగ్గుతారు.
స్కిప్పింగ్ చేయడం వల్ల చర్మం సైతం సురక్షితంగా ఉంటుంది. చర్మానికి రక్త సరఫరా పెరుగుతుంది. పోషకాలు లభిస్తాయి. వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. చర్మం శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయి. దీనికి క్యాల్షియం లోపం తోడైతే ఎముకలు పెళుసుగా మారి త్వరగా విరిగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే రోజూ స్కిప్పింగ్ చేస్తే వృద్ధాప్యంలో ఎముకల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. స్కిప్పింగ్ చేయడం వల్ల వృద్ధాప్యంలో ఎముకలు చాలా బలంగా మారుతాయి. ఇలా ఈ వ్యాయామం మనకు ఎంతో మేలు చేస్తుంది. కనుక రోజూ స్కిప్పింగ్ చేయడం మరిచిపోకండి.