Phoenix | తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ఫీనిక్స్ విడుదలకు సిద్ధమైంది. యాక్షన్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొని, తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. గోపీచంద్ గారికి ధన్యవాదాలు. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నేను జవాన్ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్ ఈ కథ చెప్పారు. మా అబ్బాయిని ఇందులో హీరోగా చూడాలనుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సినిమా చేశారు.
నేను చూసినప్పుడు చాలా బాగుంది. ఇది నా కుమారుడు సూర్యకి ఒక అద్భుతమైన ఆరంభం. చిన్నప్పటి నుంచి తనకి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. నన్ను కూడా అలాంటి సినిమాలు చేయమని చెబుతుండేవాడు. ఇప్పుడు తన కల నెరవేరింది. ఈ సినిమా సాధ్యమైనందుకు డైరెక్టర్ అనల్ అరసు, నిర్మాత రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు. తెలుగు నేర్చుకుంటున్నాను, త్వరలో తెలుగులోనే మాట్లాడతా అని అన్నారు విజయ్ సేతుపతి. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. విజయ్ సేతుపతి గారు నాకు ఎంతో ఇష్టమైన నటుడు. వరలక్ష్మి శరత్‌కుమార్ మా జయమ్మ . ఆమెతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఫీనిక్స్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తమిళ్లో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. సూర్య సేతుపతికి తెలుగు ప్రేక్షకుల మద్దతు తప్పకుండా లభిస్తుంది అని అన్నారు.
హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ.. “ఫీనిక్స్ నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి, మా నాన్నగారికి, వరలక్ష్మి గారికి, గోపీచంద్ గారికి థాంక్యూ. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ .. విజయ్ సేతుపతి గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన కుమారుడు సినిమా చేస్తున్నాడని తెలిసి సెకండ్ థాట్ లేకుండా ఓకే చెప్పాను. తమిళ్లో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అదే విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. సూర్యకి మీ అందరి ఆశీర్వాదం కావాలి అనిఅన్నారు. తమిళ్లో భారీ విజయాన్ని సాధించిన ఫీనిక్స్, యాక్షన్ మరియు ఎమోషన్ కలయికగా తెరకెక్కింది. ఇప్పుడు అదే సక్సెస్‌ని తెలుగు ప్రేక్షకుల ముందు రిపీట్ చేయాలని చిత్రబృందం ఆశిస్తోంది.