Rajesh Danda | తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్న రాజేష్ దండ తాజాగా నిర్మించిన ‘కె ర్యాంప్’ (K RAMP) సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. మాస్, క్లాస్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టి నిర్మాతతో పాటు బయ్యర్లకు కూడా లాభాలు తెచ్చిపెట్టింది. ప్రొడక్షన్ విలువలు, ప్రమోషన్లలో రాజేష్ దండ మరోసారి తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘కె ర్యాంప్’ విజయవంతంగా నడుస్తున్న సమయంలో కొన్ని వెబ్సైట్లు తన గురించి, సినిమాపై నెగటివ్ ప్రచారం చేయడంతో ఆవేశంతో కాస్త ఘాటుగా మాట్లాడారు రాజేష్. ఆయన అసభ్య పదజాలం వాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సంబంధిత వెబ్సైట్ నిర్వాహకులు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, రాజేష్ దండ కూడా తమపై కుట్ర జరుగుతోందని వాదించారు. అయితే, ఈ వివాదానికి తాజాగా ముగింపు పలికిన రాజేష్ దండ, సక్సెస్ మీట్లో మాట్లాడుతూ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. గత ప్రెస్ మీట్లో నేను వాడిన మాటలు ఇబ్బందిగా ఉన్నాయని నా స్నేహితులు చెప్పారు. ఆ రోజు కోపంతో మాట్లాడాను. తప్పు చేశానని ఇప్పుడు గ్రహిస్తున్నాను. మీడియాతో ఎప్పుడూ విరోధం పెట్టుకోను. ఇతర వెబ్సైట్లపై చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను. నాకు అందరి సపోర్ట్ కావాలి,” అని రాజేష్ దండ తెలిపారు.
తన బహిరంగ క్షమాపణతో ఈ వివాదం ముగిసినట్లే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నెటిజన్లు కూడా రాజేష్ దండ ప్రొఫెషనలిజం, పాజిటివ్ అటిట్యూడ్‌ను ప్రశంసిస్తున్నారు. ‘కె ర్యాంప్’ విజయంతో టాలీవుడ్లో మరోసారి చర్చనీయాంశమైన రాజేష్ దండ, త్వరలోనే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వివాదాలకు దూరంగా, కంటెంట్ ఆధారిత సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.