Orange | నారింజ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. చలికాలం సీజన్ లో ఇవి మనకు మార్కెట్లో ఎక్కువగా దర్శనమిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అత్యధిక మొత్తంలో లభించే పండ్లలో నారింజ పండు కూడా ఒకటి. నారింజ పండ్లను అనేక రకాలుగా తీసుకోవచ్చు. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా జ్యూస్ చేసి తాగవచ్చు. ఇతర పండ్లతో కలిపి సలాడ్ రూపంలోనూ తినవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నారింజ పండ్లను తినాలని వైద్యులు చెబుతుంటారు. ఈ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. రోజూ కచ్చితంగా ఒక నారింజ పండును తినాలని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ పండ్లను కచ్చితంగా రోజూ తినాలని వారు చెబుతున్నారు.
నారింజ పండ్లలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి అధికంగా లభించే పండ్లలో నారింజ పండు ముందు వరుసలో నిలుస్తుంది. ఒక మీడియం సైజు నారింజ పండును తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో 100 శాతం లభిస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు తగ్గుతాయి. విటమిన్ సి వల్ల చర్మానికి సైతం ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
నారింజ పండ్లను తినడం వల్ల విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి నారింజ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక నారింజ పండును తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లను తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. నారింజ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఉండదు. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు సైతం నారింజ పండ్లను తినవచ్చు. ఇందులో భయం చెందాల్సిన పనిలేదు. నారింజ పండ్లను తింటే షుగర్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఇది అపోహే. ఇందులో నిజం లేదు. ఎందుకంటే నారింజ పండు గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 40గా ఉంటుంది. అందువల్ల ఈ పండును తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా ఈ పండ్లను రోజూ తినవచ్చు. ఇందులో సందేహించాల్సిన పనిలేదు. ఇక ఈ పండ్లలో సిట్రేట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కిడ్నీల్లో స్టోన్లు ఏర్పడకుండా చూస్తాయి. అందువల్ల కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే మూత్రం పీహెచ్ స్థాయిలు సరైన రీతిలో ఉంటాయి. దీని వల్ల మూత్రాశయం, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా నారింజ పండును రోజుకు ఒకటి చొప్పున తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.