కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు(Coimbatore) విమానాశ్రయం సమీపంలో కాలేజీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. నిందితులను థావసి, కార్తీక్, కాళీశ్వరన్‌గా గుర్తించారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్కౌంటర్ సమయంలో ఆ ముగ్గురి కాళ్లలోకి పోలీసులు కాల్చారు. దీంతో వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 19 ఏళ్ల ఉన్న కాలేజీ విద్యార్థిని స్నేహితుడిని తరిమికొట్టిన ముగ్గురు నిందితులు ఆమెపై లైంగిక దాడి చేశారు. నవంబర్ 2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గ్యాంగ్ రేప్‌కు గురైన విద్యార్థినితో పాటు ఆమె స్నేహితుడు కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్నేహితుడితో కారులో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో నిందితులు ముగ్గురు వచ్చి ఆమెను లాక్కెళ్లారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఆమె చదువుకుంటున్నది. అత్యాచార ఘటన రాజకీయంగా తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సీఎం స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీసీటీవీ ఫూటేజ్‌ను తీక్షణంగా పరిశీలించిన తర్వాత పీలమేడు పోలీసులు ఆ నేరగాళ్లను పట్టుకున్నారు. వెల్లికినారులోని నిర్మానుష ప్రదేశంలో ముగ్గురూ దాక్కున్నట్లు గుర్తించారు. పోలీసులు వాళ్లను చుట్టుముట్టడంతో.. వాళ్లు ఎదురుతిరిగారు. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బృందంపై అటాక్ చేశారు. ఓ కానిస్టేబుల్‌కు గాయమైంది. అయితే ఆ సమయంలో పోలీసులు ఫైరింగ్ చేయడంతో ఆ నిందితుల కాళ్లకు బుల్లెట్లు దిగాయి. ఓ నిందితుడికి ఒకే కాలుకు బుల్లెట్ దిగింది. మిగితా ఇద్దరికీ రెండు కాళ్లకు బుల్లెట్లు దిగాయి. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.