ఉదయం 9 – సాయంత్రం 5.. ఈ సంప్రదాయ పనిగంటలపై నవతరం ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అందరికీ అలవాటైన, అనుకూలమైన సమయాలను వీరు సంపూర్ణంగా మార్చేస్తున్నారు. ‘మైక్రో షిఫ్టింగ్’ పేరుతో.. పని గంటలను చిన్నచిన్న బ్లాక్‌లుగా విభజిస్తున్నారు. అత్యంత ఉత్పాదకత ఉన్నప్పుడే పనిచేస్తూ.. మిగతా సమయాన్ని వ్యక్తిగత అవసరాలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం చాలామంది జీతాల్లో కోతలను కూడా భరిస్తున్నారు. ఎందుకంటే.. జీతం కన్నా తమకు జీవితమే ముఖ్యమని చెబుతున్నారు.
జెన్-జెడ్ ఉద్యోగులు.. షెడ్యూల్ సౌలభ్యాన్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం మైక్రోషిఫ్టింగ్ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ తరహా ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే.. పని ఉన్నా లేకపోయినా కంప్యూటర్ల ముందు కూర్చోవడానికి జెన్-జీ తరం ఆసక్తి చూపడం లేదట. అందుకే, ఎన్నో ఏళ్లుగా దాదాపు అన్నిరకాల పరిశ్రమల్లో కొనసాగుతున్న 9-5 టైమ్ మాడల్‌ను వీరు పక్కన పెట్టేస్తున్నారు. చదువు, బహుళ ఉద్యోగాలను సమతుల్యం చేయడానికి మైక్రో షిఫ్టింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. ఇందులో ఎనిమిది గంటల షిఫ్ట్ అనేది ఉండదు.
ఉద్యోగులు తమ వృత్తిగత, వ్యక్తిగత అవసరాల ఆధారంగా పనిదినాన్ని చిన్నచిన్న, సౌకర్యవంతమైన బ్లాక్‌లుగా విభజించుకుంటున్నారు. ఉదయాన్నే విధుల్లోకి చేరి లాగిన్ అవుతున్నారు. రెండుమూడు గంటలపాటు వర్క్ చేసుకొని.. మధ్యాహ్నం విరామం తీసుకుంటున్నారు. భోజనం ముగించిన తర్వాత.. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తిరిగి లాగిన్ అవుతున్నారు. దీంతో.. ఇటు వృత్తిగత బాధ్యతలతోపాటు అటు వ్యక్తిగత పనులను కూడా సమర్థంగా నిర్వహించుకుంటున్నారు.
ప్రస్తుతం అనేక సంస్థలు ఇంకా వర్క్ ఫ్రం హోమ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. దాంతో, చాలామందికి ఈ మైక్రో షిఫ్టింగ్స్ అనుకూలంగా మారుతున్నాయి. అదే సమయంలో.. పనివేళలు తగ్గడం వల్ల ఎదురయ్యే జీతాల కోతలను కూడా భరిస్తున్నారు. వారానికి నాలుగు రోజుల అనువైన పని గంటల కోసం.. తమ వార్షిక జీతంలో 9 శాతం త్యాగం చేస్తున్నారు.