మన ఆలోచనలే మనం అనే సంగతి తెలిసిందే! అంతేకాదు మన ఆలోచనలకు మన శరీర ఆరోగ్యానికీ సంబంధం ఉంటుంది. ఎన్నో శారీరక స్పందనలకు మన ఆలోచనలే మూల కారణంగా నిలుస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలు మన మానసిక, శారీరక ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపినట్టే, ప్రతికూల ఆలోచనలు తీవ్రమైన దుష్ప్రభావం చూపుతాయి. జీవితానికి ముప్పు కలిగించే ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
చెడ్డ ఆలోచనలు శరీర ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాలం గడిచే కొద్దీ గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది.
ప్రతికూల ఆలోచనలు కేవలం భావోద్వేగానికి సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి ఎన్నో శారీరక సమస్యలను ప్రతిబింబిస్తాయి. దీర్ఘకాలంపాటు కొనసాగితే రక్తపోటు, జీర్ణ వ్యవస్థ రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు థైరాయిడ్ పనితీరును కూడా దెబ్బతీస్తాయట. దీంతో అలసట, మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి.
మన నమ్మకాలు, విశ్వాసాలు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మన దృష్టి కోణాన్ని రూపొందిస్తాయి. కాబట్టి మీ గురించి, తోటివారి గురించి, మీ కెరీర్, మీ పరిసరాల పట్ల సానుకూలంగా ఉండాలి. మీ బలాలు, మీలో మంచిని నమ్ముకుంటే మీ జీవితాన్ని మార్చుకోగలరు. ప్రతికూల ఆలోచనలను పారదోలి సానుకూల మనస్తత్వాన్ని ఏర్పర్చుకోండి.