ఇప్పుడు చాలామంది పెరటి కూరగాయలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంట్లోనే రకరకాల కూరగాయల మొక్కల్ని పెంచుకుంటున్నారు. అయితే, కలుపు సమస్యలతో సతమతం అవుతున్నారు. దీనికి మల్చింగ్ మంచి పరిష్కారం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మొక్క చుట్టూ రక్షణగా ప్లాస్టిక్ కవర్ను కప్పి ఉంచడమే మల్చింగ్ విధానం. మల్చింగ్ వేయడం వల్ల చీడపీడల బాధ తగ్గి.. దిగుబడి పెరుగుతుంది.
కలుపునూ నివారిస్తుంది. ఎందుకంటే.. ఈ ప్లాస్టిక్ షీట్ అడుగుభాగంలో వచ్చే కలుపు మొక్కలకు సూర్యరశ్మి అందదు. దాంతో, కిరణజన్య సంయోగక్రియ జరగక కలుపు మొక్కలు వాడిపోయి, ఎండిపోతాయి. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయిన తర్వాత తిరిగి మళ్లీ మట్టిని దున్నాల్సిన అవసరం ఉండదు. పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.
కొందరు ప్లాస్టిక్ మల్చింగ్కు బదులుగా సేంద్రియ మల్చింగ్ ఎంచుకుంటారు. వరి గడ్డి, గోధుమ గడ్డి, బెరడు, పొడి గడ్డి, పొడి ఆకులు, గడ్డి క్లిప్పింగ్ మొదలైన సహజ పదార్థాలతో ఈ సేంద్రియ మల్చింగ్ తయారవుతుంది. ప్లాస్టిక్ నివారణ సాధ్యమైనా.. సేంద్రియ మల్చింగ్ సులభంగా కుళ్లిపోతుంది. దాంతో, చీటికీమాటికీ మార్చాల్సి వస్తుంది. అంతేకాదు.. కొన్నిరకాల క్రిమికీటకాలను కూడా ఆకర్షిస్తుంది. ఈ విషయంలో ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.