ఒకప్పుడు రోజును గంటల్లో లెక్క కట్టుకునేవారు. జీవితం స్లో మోషన్లో నడిచేది. మనసులో మాట చేరాలంటే రోజుల తరబడి ఉత్తరం ప్రయాణించేది. కరెంటు బిల్లు కట్టాలంటే గంటల తరబడి క్యూలో నిలబడేవాళ్లు. బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, సిటీకి వెళ్లాలన్నా ప్రహసనమే. ఇప్పుడన్నీ చిటికెలో జరిగిపోతున్నాయి. కోరుకున్న ప్రతిదీ పది నిమిషాల్లోనే ప్రత్యక్షం. జీబీల కొద్దీ డేటా సెకన్లలో సంపూర్ణం. కానీ, ఒకటి గమనించారా?! ఎవరి దగ్గరా సమయం ఉండటం లేదు. ఉద్యోగం కోసమో, సోషల్ మీడియాలోనో, వారాంతపు షికారులతోనో.. అంతా వ్యస్తమే. ఇంతకీ మనిషి అంతులేని డబ్బుతో సంతోషంగా ఉంటాడా?
లేకపోతే తగినంత డబ్బుతోపాటు కాస్త తీరిక ఉంటే బాగుంటాడా?!

అనగనగా ఓ జమీందారు. రాచభోగాల మధ్య తేలుతూ ఉండేవాడు. పిలిస్తే నౌకర్లు, కదిలితే గుర్రాలు, పొలాలు, భవనాలు.. అన్నీ ఉన్నా ఏదో వెలితి. చెప్పలేని దిగాలు. ఓ రోజు ఆ చింతతోనే తన తోటలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతనికి ఓ తోటమాలి కనిపించాడు. ఒంటి మీద సరైన దుస్తులు కూడా లేవు. అయినా పాడుతూ, తుళ్లుతూ పనిచేస్తున్న తనని చూసి ఈర్ష్య కలిగింది. ఆ సంతోషాన్ని ఎలాగైనా దూరం చేయాలనుకున్నాడు. జమీందారు ఆలోచన విన్న దివాన్జీ ఓ 99 వేల వరహాలు ఇచ్చారంటే మీ పని చేసేస్తాను అన్నాడు. మర్నాడు ఆ డబ్బుల మూట తోటమాలి ఇంట్లో పడేట్టు చేశాడు దివాన్జీ. అవి లెక్కపెట్టుకున్న తోటమాలికి పట్టలేని సంబరమేసింది. అంతలోనే అది అసంతృప్తిగా మారింది. ఇంకొక్క వెయ్యి వరహాలు దక్కితే తను లక్షాధికారిని అవుతాను కదా అనుకున్నాడు. అప్పటి నుంచీ తన తాపత్రయం అంతా ఆ లోటును పూర్తి చేయడంలోనే సాగింది.
ఆ మర్నాటి నుంచి తోటమాలి కడుపు మాడ్చుకున్నాడు, మరింత కష్టపడ్డాడు, పిల్లల్ని కూడా పనికి పంపాడు. మరోవైపు చేతిలో ఉన్న డబ్బు ఏదో ఒక అవసరానికి ఖర్చవడం మొదలైంది. అదేం చిత్రమో లోటు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. దాంతోపాటే తన దిగులు కూడాను. ఇప్పుడు తను ’99 వేల రూపాయల సంఘంలో సభ్యుడు’. ఉన్నదాంతో అసంతృప్తి, అది చేజారిపోతుందేమో అన్న భయం, మరింత జోడించాలనే తాపత్రయం.. వెరసి తన మనసును విరిచేశాయి. ఓ రెండు నెలల తర్వాత అదే తోటలో దిగాలుగా పనిచేస్తున్న తోటమాలిని చూసిన జమీందారు ఆత్మ శాంతించింది. అదే సమయంలో తన మనసులో చింతకు కూడా కారణం తెలిసొచ్చింది. డబ్బు ఎవరికైనా అవసరమే. పేదరికంలో ఉన్నా ఆత్మసంతృప్తే ముఖ్యమనే మాట ఈ వినిమయ కాలంలో ఆత్మవంచనే అవుతుంది. కానీ, ఆ డబ్బుతో పాటు మరిన్ని సంపదలూ ముఖ్యమేనన్న మాటను కూడా మర్చిపోకూడదు. సిరితో పాటు ఆ సంపదలు లేని జీవితం అసంపూర్ణమే!
విశ్వం దాకా ఎందుకుగాని, ఈ భూమి వయసుతో పోల్చుకుంటే మనిషి ప్రయాణం చాలా చిన్నది. ఇక నాగరికత అయితే కొన్ని వేల ఏళ్ల నాటిదే. నిప్పుతో కాలిన మాంసాన్ని చూసి వంట నేర్చుకున్నాడు, నీటికి పండే గింజలను చూసి సాగు మొదలుపెట్టాడు, మిగులును వ్యాపారంగా మార్చుకుని లాభాలు సాధించాడు. స్థిరత్వంతో పాటే రాజ్యాలు మొదలయ్యాయి. సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. నాణేలు వచ్చాయి. వాటిని సంపాదించుకోవడం కోసం, ఖర్చు చేయడం కోసం రకరకాల ఉత్పత్తులు వచ్చాయి. గ్లోబలైజేషన్ మొదలయ్యాక ఉత్పత్తి రంగం ఓ విస్ఫోటనంలా మారింది. ఇప్పుడు డబ్బు ఓ మారకం విలువ కాదు. మనిషి సత్తాను కొలిచే మీటర్. కానీ దేనికైనా పరిమితి ఉన్నప్పుడు.. అది డబ్బుకి కూడా వర్తిస్తుంది కదా!
డబ్బుకి స్వేచ్ఛ ఉండాలి!
కొన్నాళ్ల క్రితం నితిన్ కౌశిక్ అనే ఓ సీఏ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘చాలామంది డబ్బును పరపతి పెంచుకోవడం కోసమే వాడుకుంటున్నారు. ఖరీదైన కారు, విలాసమైన బంగ్లా, కళ్లు చెదిరే వస్త్రధారణ కోసమే దాన్ని వాడుతున్నారు. కానీ నిజమైన సంపద స్వేచ్ఛలోనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఉపాధిరంగంలో స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా చెబుతాడు నితిన్. మన మనసుని, శరీరాన్ని నిస్సారంగా మార్చే ఉద్యోగానికి దూరంగా ఉండటం. వాయిదాల కోసమో, అప్పులు తీర్చడం కోసమో పని చేయాల్సిన అగత్యం లేకపోవడం. నచ్చని పరిస్థితుల నుంచి బయటికి రాగలగడం. పనితో పాటు ఇంటికి కూడా తగినంత సమయాన్ని కేటాయించే స్థితిలో ఉండటం. ఇదే అసలైన సంపద అన్నది నితిన్ సూచన.
చాలామంది నిరంతరం ఉద్యోగం చేస్తున్నా.. ఒక్క పూట సెలవు తీసుకుంటేనో, పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్తేనో కూడా యాజమాన్యానికి ఏదో ద్రోహం చేసినంతగా పశ్చాత్తాపపడిపోతుంటారు. అలాంటి మానసిక బానిసత్వానికి దూరంగా ఉండమంటాడు నితిన్. అంతేకాదు! చాలామంది వయసులో ఉన్నప్పుడు తగినంత సంపాదిస్తున్నా కూడా… సమాజంలో పరపతి పెంచుకోవడానికే ఎక్కువ భాగాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంత మొత్తాన్ని 12-14 శాతం వడ్డీ వచ్చేలా పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు వస్తుందనీ, ఒకరి మీద ఆధారపడని స్వేచ్ఛనిస్తుందనీ చెబుతారు. ఏతావాతా సంపదను ప్రదర్శన కోసం కాకుండా, పెట్టుబడి కోసం వాడమని.. స్వేచ్ఛగా పనిచేసే వాతావరణంలో ఉండమని తన సూచన.
సమయమే సంపద!
బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆష్లే విలాన్స్ అనే శాస్త్రవేత్త. ఏకంగా 4,600 మంది మీద ఓ పరిశోధన చేశాడు. దీనికోసం అభ్యర్థులను కొన్ని ప్రశ్నలు అడిగాడు. మీరు ఆఫీసుకు దగ్గరగా ఉండే చవకైనా అపార్టుమెంటును ఇష్టపడతారా లేకపోతే ఆఫీసుకు దూరంగా ఉండే విలాసమైన విల్లాను ఎంచుకుంటారా? కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు ఉండే ఉద్యోగం కావాలా లేకపోతే ఎక్కువ జీతంతో ఎక్కువ పనిగంటలు చేస్తారా? లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు చాలామంది సమయం మిగిలే మార్గాన్నే ఎంచుకున్నారు. అభ్యర్థుల వయసు పెరుగుతున్న కొద్దీ సమయం వైపు మొగ్గు చూపడం విశేషం. జీవితం గడుస్తున్న కొద్దీ మనకోసం గడిపే కాలం ఎంత విలువైందో గ్రహించడమే ఇందుకు కారణం.
ఈ అధ్యయనానికి కొనసాగింపుగా మరో పరిశోధన కూడా జరిగింది. ఉన్న డబ్బుతో కాలాన్ని ఆదా చేస్తే ఎక్కువ తృప్తి లభిస్తుందా లేకపోతే వస్తువులతో సంతృప్తి ఉంటుందా అన్నదే ఆ ప్రశ్న. అది తేల్చుకోవడానికి అభ్యర్థులకు కొంత డబ్బు ఇచ్చి.. దాంతో నచ్చింది కొనుక్కోమని చెప్పారు. చిత్రంగా ఎవరైతే ఆ డబ్బును సమయం ఆదా చేసే సేవలకు వాడుకున్నారో వాళ్లే మరింత తృప్తిగా ఉన్నట్టు తేలింది. సంపాదన అంటే డబ్బు మాత్రమే కాదు.. సమయం కూడా అన్నది తేలిపోయింది. మనతో మనం గడిపే ఏకాంతం కావచ్చు, కుటుంబంతో గడిపే కాలం కావచ్చు, మిత్రులను కలిసే కాలక్షేపం కావచ్చు.. ఇవన్నీ వృథా అనుకుంటే బతుకు విలువ తరిగిపోతుంది. భౌతిక వస్తువులు మిగిలిపోతాయి కానీ అనుభూతులు కాదు.

ఆరోగ్యమే కదా!
12 ఏళ్లకే ఊబకాయం, పాతికేళ్లకే రక్తపోటు, మూడు పదులకే మధుమేహం.. ఇవన్నీ భయాలు కాదు, వాస్తవాలు. గణాంకాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. మైసూరు స్కూళ్లలో జరిగిన ఓ సర్వేలో ఏకంగా ఏడు శాతం పిల్లల్లో రక్తపోటు కనిపించింది. ఇక అపోలో వెలువరించిన ఓ నివేదికలో 5-17 ఏళ్లలోపు పిల్లల్లో ఏకంగా 17 శాతం మందికి మధుమేహం వచ్చే ప్రమాదం కనిపించింది. ఇక ఐదోవంతులో ఊబకాయం ఉంది. ఇవే కాదు ఇప్పటి జీవనశైలి వల్ల క్యాన్సర్ నుంచి గుండెపోటు వరకు సవాలక్ష సమస్యలు వస్తున్నాయి. ఇవి కేవలం అసౌకర్యమే కాదు, తీవ్రమైన ఆర్థిక సమస్యలకీ దారితీస్తున్నాయి. జీవనశైలి వ్యాధులతో ప్రపంచానికి ఏటా రెండు కోట్ల కోట్ల రూపాయల భారం పడుతోందని అంచనా.
జీవితంలో ఆరోగ్యం ముఖ్యమా సంపద ముఖ్యమా అని తేల్చేందుకు కూడా చాలా పరిశోధనలే జరిగాయి. తగినంత డబ్బు ఉన్నవారు మొదట్లో మెరుగైన జీవనశైలితో ఉన్నట్టు, తగిన వైద్యం చేయించుకుంటున్నట్టు కనిపించింది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం కంటే సంపాదనకే ఎక్కువ విలువ ఇచ్చేవారి సంతృప్తి, ఆయుష్షు రెండింటిలోనూ లోటు కనిపించింది. అంతేకాదు! ఆరోగ్యంగా ఉండేవారే ఉన్న సంపదను అనుభవించగలుగుతున్నారనీ, అవసరానికి మించి సంపాదన వెంట పడుతున్నప్పుడు అది అసంతృప్తికీ, అనారోగ్యానికీ దారితీస్తున్నదనీ తేలింది.
విలువలే ఆస్తి
నాకేంటి? అన్నది ఓ కామెడీ డైలాగ్ కాదు. ప్రతి మనిషిలో మెదులుతున్న ఆశ. ఒకరిని పలకరించినా, ఒక పని చేసినా, ఆఖరికి ప్రేమించినా.. అందులో నాకేంటి అన్న ప్రశ్నదే పెద్దరికం. ఒకప్పుడు సత్యహరిశ్చంద్రుడి సత్యనిష్ఠనీ, శిబి చక్రవర్తి త్యాగాన్నీ నాటకాలుగా చూపించేవారు. నీతి, త్యాగాలకు అంతలా కట్టుబడి జీవితాన్ని పణంగా పెట్టాలని కాదు కానీ.. ఆ దారిలో నడవాలన్నది వాటి సూచన. గాంధీలాంటి వాళ్లు నిజం పట్ల నిర్భయంగా ఉండటానికి ప్రేరణ ఇలాంటి కథలే. అవి కాకపోయినా మనకు లోకంలో ఎలా ఉండాలి.. లౌక్యంగా ఉంటూనే ఎలా విలువల్ని కాపాడుకోవాలో చెప్పే నీతి శతకాలు ఉండేవి. అవీ ఆకట్టుకోకపోతే నీతికథలు వినిపించేవి. తరగతి గదుల్లో వీటితో పాటు నీతిశాస్ర్తాన్నీ చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు. తెలుసుకునే ప్రయత్నమూ ఎవరూ చేయడం లేదు. కానీ, విలువలే నిజమైన సంపద అంటున్నారు సామాజికవేత్తలు. పరిశోధనలూ అదే చెబుతున్నాయి.
2023లో కృతజ్ఞత మీద ఒక మెటా అనాలసిస్ జరిగింది. అంటే అప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నిటినీ క్రోడీకరించి చూశారు. అందులో తేలిందేమిటంటే కృతజ్ఞతగా ఉండేవారిలో కుంగుబాటు, ఉద్వేగం, సానుకూలత, సంతృప్తి లాంటి స్థాయులు ఏకంగా 7 శాతం ఎక్కువగా కనిపించాయి. రాబర్ట్ ఎమన్స్ అనే పరిశోధకుడి నివేదికలో జీవితం పట్ల కృతజ్ఞతగా ఉండేవారిలో అనారోగ్య లక్షణాలు కూడా తక్కువగా కనిపించాయి.
సాయం చేసేవారిలోనూ సానుకూలమైన ప్రభావాలే కనిపించాయి. దీనికి ‘హెల్పర్స్ హై’ అని పేరు పెట్టారు కూడా! మరొకరికి సాయం చేయడం వల్ల మనలోని ఎండార్ఫిన్స్, డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు మెరుగుపడతాయనీ.. దానివల్ల మన మానసిక, శారీరిక ఆరోగ్యం బలపడుతుందని తేలింది. కరుణ, సహానుభూతి వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒంటరితనం దూరమవుతుందని నిరూపించారు. ఈమధ్యకాలంలో చాలామంది స్వచ్ఛంద సేవ వైపు మొగ్గుచూపేందుకు ఈ సంతృప్తి ఓ కారణం. లక్షల కోట్లు సాధించినవాళ్లు కూడా గివింగ్ ప్లెడ్జ్ పేరుతో తమ ఆస్తిలో కనీసం సగభాగాన్ని దానం చేయడం వెనుకా ప్రశాంతమైన రిటైర్మెంటే కోరిక.

బంధాలు స్నేహితులు
జగమంత కుటుంబాలు ఎలాగూ లేవు. ఊరంతటినీ బంధుత్వాలతో పిలిచే పలకరింపులూ వినిపించడం లేదు. తమ అపార్ట్మెంట్లో చనిపోయాక ఏళ్లు లేదా దశాబ్దాల తరబడి ఆ శవాన్ని కూడా ఎవరూ గమనించని వార్తలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ చదువులు, కెరీర్ పరుగుల్లో పడి స్నేహాలను దూరం చేసుకోవడం ఓ విషాదం. స్నేహం అంటే నిజమైన సంపద అని తెలియని మాయ.
ఓ మనిషికి ఎంతమంది నేస్తాలు ఉండాలనే దానిమీద ఎవరి వీలును బట్టి వారు నిర్ణయించుకోవచ్చు. కానీ రాబిన్ డన్ బర్ అనే శాస్త్రవేత్త సూచించిన డన్ బర్ సంఖ్యను చాలామంది నమ్ముతారు. తన ప్రకారం ఎవరికైనా ఓ 150 మంది వరకూ పరిచయస్తులు ఉండవచ్చు. ఇందులో ఓ అయిదుగురు ప్రాణ స్నేహితులు, 15 మంది దగ్గరి మిత్రులు (తరచూ పలకరించేంతలా), 50 మంది మిత్రులు (వేడుకలకు పిలిచేంతగా) ఉండాలి, మిగతావారు కనీసం గుర్తుపట్టి పలకరించే వారై ఉండాలి.
150 సంగతి దేవుడెరుగు. ఫేస్బుక్ నేస్తాలను పక్కన పెడితే.. అసలు మిత్రులు సంఖ్య పడిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 30 ఏళ్లలో ప్రాణ స్నేహితుల సంఖ్య నాలుగో వంతుకు తగ్గిపోయిందనీ.. పదిమందికి మించి మిత్రులు ఉన్నది కేవలం 13 శాతం మందికేనని తేలింది. స్నేహాలు కేవలం ఓ భరోసానో కాలక్షేపమో కాదు. స్నేహాలు లేని జీవితం అసంపూర్ణం అని సవాలక్ష పరిశోధనలు చెబుతున్నాయి.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 90 ఏళ్లుగా సాగుతున్న ఓ పరిశోధన దీర్ఘకాలిక సంతోషానికి, ఆరోగ్యానికి, ఆయుష్షుకి.. స్నేహబంధాలే కీలకం అని తేల్చడం విశేషం. డబ్బు, హోదా, కెరీర్ విజయాలకంటే మంచి బంధాల వల్లే ఎక్కువ సంతృప్తి కలుగుతుందని వీరు చెప్పారు. మరీ ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత ఓ వ్యక్తి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తన బంధాలే నిర్ణయిస్తాయని తేల్చారు.
మూడు లక్షల మంది మీద చేసిన మరో పరిశోధనలో స్నేహితులు ఉండేవారిలో ఆయుష్షు పెరిగే అవకాశం ఏకంగా 50 శాతం పెరిగినట్టు గమనించారు. అంతేకాదు! స్నేహితులు ఉన్నవారిలో కుంగుబాటు, ఒత్తిడి, గుండె జబ్బులు, మతిమరపు, అకాల మరణం, పక్షవాతం లాంటి సమస్యలు తక్కువగా ఉన్నాయనీ రోగనిరోధక శక్తి మెరుగ్గాను, ఆరోగ్యపు అలవాట్లు పుష్కలంగా కనిపిస్తున్నాయని తేల్చారు. ఈమధ్యకాలంలో జరిగిన మరో పరిశోధనలో స్నేహం మన వయసును తగ్గించే యాంటి ఆక్సిడెంట్‌లా పనిచేస్తుందని బయటపడింది.

సంపద అంటే డబ్బే అనుకోవడం జాలిపడాల్సిన పరిస్థితే. అది స్వార్థానికీ, ఇతరుల గురించి లెక్కలేనితనానికీ, ధన ప్రదర్శనకే దారితీస్తుంది. మన తర్వాత తరాన్నీ చెడగొడుతుంది. ఇప్పటికే ఆ భావన బలపడిపోయిన సమయంలో అంతకంటే విలువైన విషయాలను గుర్తుచేసి, అలవాటు చేయకపోతే అదే నిజమైన పేదరికంగా మారుతుంది.
ఉద్యోగంతో పాటు కుటుంబానికి కూడా తగిన సమయం ఇవ్వాలనే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతున్నది. కుటుంబమే నిజమైన ప్రాధాన్యం అనీ, కుటుంబంతో గడిపేవారు కెరీర్లో కూడా రాణిస్తారని ఎప్పుడో తేలింది. ఇది గుండెను పదిలంగా ఉంచుతుందని ఏకంగా హార్వర్డ్ శాస్త్రవేత్తలే తేల్చారు.
ఎడ్విన్ లూక్ అనే శాస్త్రవేత్త ఎన్నో పరిశోధనల ఆధారంగా గోల్-సెటింగ్ థియరీ అనే సిద్ధాంతాన్ని రూపొందించాడు. స్పష్టమైన, ఉన్నతమైన లక్ష్యాలు మన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయనీ.. జీవితం పట్ల ఆశనీ, అది సార్థకమైందనే సంతృప్తినీ అందిస్తాయని ఈ థియరీ నిరూపిస్తుంది.
బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నదాంతో సంబంధం లేకుండా మన మనసు ఎంత నిండుగా ఉన్నదన్న మాటే జీవితంలో
సంతృప్తిని మిగిలుస్తుందని తెలుసు. దీన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు Xi, Lee అనే పరిశోధకులు Inner Peace Scale (IPS)ని తయారుచేశారు. ఈ స్థాయి ఎంత బాగుంటే, వారి జీవితాలు అంత పరిపూర్ణంగా ఉన్నట్టు నిరూపించారు.
గుర్తించని ధనం!
చూసీచూడనట్టు ఉంటాం కానీ, కొన్ని విషయాలు మన వ్యక్తిత్వాన్నీ, విజయాన్నీ, పరిపూర్ణతనీ సూచిస్తాయి.
ప్రతి మనిషినీ చిరునవ్వుతో పలకరించే సహృదయత, అందరినీ కలుపుకొనిపోయే నేర్పు, సాయం కోరేందుకు బిడియపడక సాయం చేసేందుకు వెనుకడుగు వేయని చొరవ, ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడో గమనించే విచక్షణ… పైకి పీపుల్ మేనేజ్మెంట్లా కనిపించే ఈ లక్షణాలు నిజానికి సామాజిక జీవితాన్ని పరిపూర్ణం చేసేందుకు అత్యవసరం.
అందం అనేది చూసే చూపుని బట్టి ఉండేమాట నిజమే. పుట్టుకతో వచ్చేమాట వాస్తవమే. కానీ, అంతకుమించి మనతీరు మీదే ఆధారపడి ఉంటుంది. శుభ్రంగా ఉండటం, మంచి దుస్తులు ఎంచుకోవడం, చెప్పుల నుంచి క్రాఫ్ వరకు గమనించుకోవడం… ఇప్పటి మాటల్లో ‘డ్రెసింగ్ ఎటికెట్’ గా పిల్చుకునే ఈ తీరు తెలియకుండానే మన జీవితాలకి ఓ పరిపూర్ణత తీసుకొస్తుంది. కనిపించని ఫలితాలనిస్తుంది.
వీధిలో కష్టం వచ్చింది, పక్కింట్లో ఒకరికి అనారోగ్యం చేసింది, ఇంట్లో ఓ పెద్ద వేడుక చేయాలి అనకుంటున్నాం. జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని, ప్రణాళికతో ఆ గండమో గడువో దాటించే కార్యనిర్వహణ ఉండాలి. ఆ నేర్పు ఉన్నవారినే జనం ఇష్టపడతారు. అలాంటి వ్యక్తి పక్కన ఉంటే భరోసాగా భావిస్తారు.
జ్ఞానం చేజారిపోని మూలధనం. అది చదువు మాత్రమే కాదు. ఇప్పటి కాలానికి కావాల్సిన నైపుణ్యం, మారుతున్న సమయానికి అనుగుణంగా కొత్త విజ్ఞానం, చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే లోకజ్ఞానం… సోషల్ మీడియా హోరులో, గూగుల్ వెతుకులాటలో, చాట్ జీపీటీల మీద ఆసరాతో ఈ నిరంతర అధ్యయనమే లోపించిపోయింది. కానీ, అవసరంలో ఉన్నప్పుడు, మనసులో సందిగ్ధత తలెత్తినప్పుడు, ఒంటరితనం కమ్మినప్పుడు మనలో ఉన్న జ్ఞానమే శ్రీరామరక్షగా నిలుస్తుంది.
అష్టలక్ష్ములే అసలు లక్ష్యం
నిజమైన సంపద కేవలం డబ్బులోనే లేదని ఇప్పుడు చెప్పుకొంటున్నాం కానీ, మన పెద్దలు ఎప్పుడో తేల్చేశారు. అష్టలక్ష్ములుగా వినిపించే పేర్లు కేవలం దేవతలు మాత్రమే కాదు. మన జీవితం పరిపూర్ణంగా ఉండేందుకు కావల్సిన అంశాలు. నరసింహస్వామిని శాంతింపచేసిన ఆదిలక్ష్మి ప్రశాంతతకు, స్థితప్రజ్ఞతకు చిహ్నం; ధాన్యలక్ష్మి పాడిపంటలకు, సమతుల ఆహారానికి సూచన; ధైర్య లక్ష్మి శారీరక బలానికి, సహనానికి, మానసిక దృఢత్వానికి ప్రతీక; ఇంద్రునికి సాయపడిన గజలక్ష్మి పదవికి, పరపతికి గుర్తు; సంతాన లక్ష్మి అంటే సంతానం మాత్రమే కాదు! కుటుంబ జీవనం కూడా. ఇప్పుడనుకునే వర్క్ లైఫ్ బ్యాలెన్స్; విజయ లక్ష్మి కష్టాలను దాటే తెగువు, నిరంతరం సవాళ్లను ఎదుర్కొని గెలిచే సత్తా; విద్యాలక్ష్మి అంటే చదువు మాత్రమే కాదు.. జ్ఞానం, విచక్షణ, పరిష్కారాలు కనుగొనే నేర్పు; ఇక ధనలక్ష్మి డబ్బుకి మాత్రమే కాదు అందుబాటులో ఉన్న వనరులను తెలివిగా వినియోగించుకోవడానికీ, ఆశతో కాకుండా ఆలోచనతో చేసే పెట్టుబడులకీ, పొదుపు, జమాఖర్చులకీ ఓ ఆలంబన.
…? కె.ఎల్.సూర్య