పాలు.. చాలాకాలంగా ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రధానమైనవిగా ఉంటున్నాయి. కాల్షియం, విటమిన్ డి లాంటి ప్రయోజనాలను శరీరానికి అందిస్తున్నాయి. అయితే, పాలలోనూ పలు లోపాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా, మహిళల గుండె ఆరోగ్యంపై పాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరిస్తున్నాయి.
పులియబెట్టని పాలు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. వీటిని ఎక్కువగా తీసుకునే మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెంచుతుందని చెబుతున్నది. పురుషులతో పోలిస్తే పులియబెట్టని పాలు తీసుకునే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 21% ఎక్కువగా ఉన్నదనీ తేల్చింది. బీఎంసీ మెడిసిన్లో ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం.. పాలలోని లోపాలను ఎత్తిచూపుతున్నది. అయితే, పెరుగు, యోగర్ట్ వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులు.. ఈ విషయంలో ప్రయోజనకరంగా ఉన్నాయని చెబుతున్నది. ఈ అధ్యయనంలో భాగంగా పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే మహిళల ఆరోగ్య వివరాలను పరిశోధకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా పులియబెట్టని పాలను రోజుకు 300 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువగా తీసుకునే మహిళల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నదని తేల్చారు. ఈ పాల వల్ల ధమనులు ఇరుకుగా మారడం, గుండె కండరాలకు తగినంతగా రక్తం అందకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని అంటున్నారు. వీరిలో కార్డియోమెటబాలిక్ ప్రొటీన్లు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయనీ, అవి మధుమేహం, గుండె వ్యాధులు రావడానికి కారణం అవుతాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో గుండెపోటుకూ దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పులియబెట్టని పాలలో డీ-గెలాక్టోస్ అనే చక్కెర ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్తోపాటు ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది.
ముఖ్యంగా మహిళల్లో హార్మోన్లలో తేడాలు, గట్ బ్యాక్టీరియా కారణంగా ఈ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ధమనుల గోడ లోపల కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయే పరిస్థితిని పెంచుతాయి. అదే సమయంలో పులియబెట్టిన పాలతో ఈ సమస్య లేదట. అంతేకాకుండా పెరుగువంటి పదార్థాలు గుండెకు ప్రయోజనాలు అందిస్తాయని చెబుతున్నారు. గుండెకు రక్షణగా నిలిచే అనేక బయో యాక్టివ్ సమ్మేళనాలు పెరుగులో సమృద్ధిగా ఉంటాయి.
లాక్టోబాసిల్లస్, బిఫిడోబ్యాక్టీరియం వంటి ప్రోబయోటిన్లు గట్ బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. గుండె జబ్బులకు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్నూ తగ్గిస్తాయి. కాబట్టి మహిళలు పులియబెట్టిన పాలనే ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. డెయిరీ పాలకు బదులుగా.. బాదం, సోయా, ఓట్ పాలను ఎంచుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.