ఒకప్పుడు అరవై దాటితేనే దాడిచేసే గుండెపోటు.. ఇప్పుడు ముప్పై ఏళ్లకే ముప్పుగా పరిణమిస్తున్నది. ఉరుకులు పరుగుల నేటి జీవితంలో.. యువతలోనూ ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నది. ఇది.. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. వెంటనే ప్రభావం చూపకుండా.. చాపకింద నీరులా ప్రమాదాన్ని పెంచుతున్నది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే.. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నది. జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే.. ‘గుండె’కు అండ దొరుకుతుంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ‘ఒత్తిడి’ మామూలు విషయంగా మారిపోయింది. నిద్రలేమి, వేళాపాళ లేని భోజనం, డిజిటల్ స్క్రీన్లకు గంటల తరబడి అతుక్కుపోవడం, పని ఒత్తిడి.. ఇవన్నీ యువత గుండెకు హాని కలిగిస్తున్నాయి. నైట్ డ్యూటీలు కూడా.. అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి. రాత్రంతా మేల్కొని ఉండటంతోపాటు నిద్ర రాకుండా ఉండేందుకు టీ-కాఫీలను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇక ధూమపానం, మద్యంతోపాటు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా తోడై.. గుండెకు చేటు చేస్తున్నాయి. ఫలితంగా.. శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి హార్మోన్లు దారి తప్పుతున్నాయి. అన్నీ కలిసి హృదయ స్పందనల రేటును పెంచుతున్నాయి. ఇక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి.. హృదయానికి హానికరంగా పరిణమిస్తున్నాయి.
ఒత్తిడి లక్షణాలు అంత త్వరగా బయటపడవు. ముఖ్యంగా.. 30 – 40 ఏళ్లలోపు చాలామంది ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపిస్తారు. ఇలాంటివారిలో హెచ్చరిక లక్షణాలు కూడా తక్కువగానే ఉంటాయి. అసౌకర్యంగా ఉండటం, అజీర్ణం, అసాధారణ అలసట వంటివి కనిపిస్తాయి. కానీ, వీటిని చాలామంది అంతగా పట్టించుకోరు. చిన్నచిన్న ఇబ్బందులుగానే భావిస్తారు. కానీ, గుండెపోటు రావడానికి ముందు.. కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం-వాంతులతోపాటు అధికంగా చెమటలు పడతాయి. కొందరిలో తల తిరగడం, తీవ్రమైన అలసట కనిపిస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే.. మరింత ప్రమాదకరంగా మారుతుంది.
సమతుల ఆహారం తీసుకోవడం, రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం, సరైన వేళల్లో నిద్రపోవడం, డిజిటల్ స్క్రీన్ల నుంచి విరామాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి భరోసా ఇవ్వొచ్చు. యోగా, ధ్యానంతో శరీరంతోపాటు మనసూ రీసెట్ అవుతుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి. ఈసీజీ, కొలెస్ట్రాల్ టెస్ట్, బీపీ పరీక్షలు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీనివల్ల సమస్యను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. కరోనరీ క్యాల్షియం స్కోరింగ్, హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ లాంటి పరీక్షలు గుండె సమస్యలను ప్రారంభంలోనే గుర్తించగలవు. ఇక స్మార్ట్వాచ్లూ హృదయ స్పందన రేటును ఎప్పటికప్పుడు చెబుతుంటాయి.