పిల్లల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఏ విషయాన్నయినా పెద్దల కంటే పిల్లలే తొందరగా నేర్చుకుంటారనేది నిపుణుల మాట. చదువు, ఆటలు, పాటలు.. ఒక్కటేమిటి విషయం ఏదైనా ఒక్కసారి వినగానే, చూడగానే ఇట్టే పట్టేస్తారు. అందుకే చిన్నప్పటినుంచే వారికి ఆసక్తిగల రంగాల్లో ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు చదువుతోపాటు జీవన నైపుణ్యాలను కూడా ఒంటబట్టించుకుంటారు.
ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే పిల్లలకు అన్ని రంగాల్లో నైపుణ్యం తప్పనిసరి. చదువుతోపాటు అదనపు అంశాలపైనా అవగాహన ఎంతో ముఖ్యం. ఆ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆటలు, సంగీతం, చిత్రలేఖనం, ఇతర లలిత కళల్లో వారికి దేనిపై ఆసక్తి ఉందో గమనించాలి. బడి వేళలకు ఇబ్బంది కలగకుండా.. వారికి నచ్చిన రంగంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. శని, ఆదివారాలు ఈ తరగతులు ఉండేలా ప్రణాళిక చేసుకోవాలి. వేసవి సెలవుల్లో ప్రత్యేక క్యాంపుల్లో చేర్పించడం వల్ల మరింత ప్రయోజనం పొందొచ్చు.
చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం నేర్పించాలి. పొదుపు అంటే చాలామంది డబ్బు మాత్రమే అనుకుంటారు. కానీ నీరు, ఆహారం వృథా చేయకపోవడం కూడా పొదుపుగానే భావించి వారిని ప్రోత్సహించాలి. అంతేకాదు పొదుపుగా మాట్లాడటం అలవాటు చేయాలి. మాటలు తూటాల లాంటివని, పొరపాటున లేదా కోపంలో నోరు జారినా, భేషజానికి పోయి మాట ఇచ్చినా జీవితం తారుమారు అయ్యే ప్రమాదం ఉందని వారికి కథల రూపంలో తెలియజేయాలి. ప్రతి రోజూ ఒక నీతి కథ చెబుతూ.. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి.
సమయం ఎంతో విలువైనది. పోయిన ఘడియ తిరిగి రాదన్న సత్యాన్ని పిల్లలకు బోధించాలి. ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో విశ్లేషించి చెప్పాలి. ప్రణాళికా బద్ధంగా పనులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించాలి. అంతేకాదు, వాళ్ల పనులు వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించాలి. అలాగని సమయంతో పరుగులు పెట్టమని ఒత్తిడి చేయొద్దు. అనవసరమైన విషయాలకు సమయం వెచ్చించకూడదని తరచూ హెచ్చరిస్తూ ఉండటం మంచిదే!