పావుకిలో పచ్చిమిర్చి కొంటే కవర్. అరకిలో టమాటాలకు ఇంకో కవర్. పాలిథిన్ సంచులు ముంచుతాయని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇదిలాగే కొనసాగితే.. నేలలో కరగని ప్లాస్టిక్ వ్యర్థాలు.. మనిషి శరీరంలోకి చేరిపోవడం ఖాయం. ఈ దుస్థితి దాపురించొద్దని పర్యావరణహిత ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తారు వైశెట్టి సునీతారాణి. జూట్ బ్యాగులతో పర్యావరణంపై తన సచ్చాయీని చాటుతున్నారు. ‘జస్ట్ గ్రీన్ లీఫ్’ సంస్థను స్థాపించి బయోడీగ్రేడబుల్,కస్టమైజ్డ్ జనపనార సంచులను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యాపారుల అందరి లక్ష్యం లాభార్జనే! వ్యాపారిగా లాభాలు అందుకుంటూనే.. మనిషిగా ప్రకృతిని కాపాడుతున్న సునీతా రాణి స్టార్టప్ స్టోరీ ఆమె మాటల్లోనే..
తరాలుగా మానవాళి మనుగడకు ప్రకృతి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ప్రకృతి వనరులే నిచ్చెనగా ఎదిగిన మనిషి.. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ వరప్రదాయిని గుండెల మీద చిచ్చు రేపుతున్నాడు. దైనందిన జీవితంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తూ.. భూతాపాన్ని పెంచుతున్నాడు. జనాభా పెరిగే కొద్దీ ప్లాస్టిక్ వినియోగం కూడా వృద్ధి చెందుతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇది నియంత్రణలోకి రావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పుకోసం నా వంతుగా పర్యావరణహితమైన సంచులు తయారుచేయాలని ఈ రంగంలోకి అడుగుపెట్టాను. పరిశ్రమ నెలకొల్పడానికి ముందు ఎన్నో పరిశోధనలు చేశాను. బ్యాగుల ముడిసరుకు, తయారీ, కస్టమైజేషన్, ప్రింటింగ్ ఇలా అన్ని విభాగాలనూ పరిశీలించాను. నేను చేయగలనన్న నమ్మకం కలిగాక ‘జస్ట్ గ్రీన్ లీఫ్’ సంస్థను నెలకొల్పి జూట్ బ్యాగుల ఉత్పత్తి ప్రారంభించాను.
ప్లాస్టిక్ కారణంగా మానవాళికి జరుగుతున్న నష్టంపై అవగాహన పెరుగుతున్నా.. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గడం లేదు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయమైన ఉత్పత్తులు విస్తృతంగా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. అందుకే సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా అనుకూలమైన విధానాల్లో ఉండేలా బయోడీగ్రేడబుల్ బ్యాగులను అందుబాటులోకి తేవాలని నిశ్చయించుకున్నాను. జనపనార, కూరగాయల నుంచి సేకరించిన ఫైబర్, పత్తితో మన్నికైన జూట్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టాను. ఈ రంగంలో విస్తారమైన డిమాండ్ ఉంది. కానీ, అందుకు తగిన మౌలిక వసతులు లేవు. ముడిసరుకు ఖరీదు కూడా అధికంగా ఉండటంతో చౌకగా దొరికే ఉత్పత్తులు తీసుకురావడం సాధ్యం కావడం లేదు. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీగా భావించి… డిజైనింగ్, కటింగ్, కుట్టుపని, ప్రింటింగ్, ఉత్పత్తి అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల ఉత్పత్తి మొదలుపెట్టాను.
కేవలం జూట్ బ్యాగులను తయారుచేయడం వరకే పరిమితమైతే మార్కెట్లో నిలబడలేం. కస్టమైజ్డ్ ఉత్పత్తులను కూడా తీసుకువస్తున్నాం. గ్రీటింగ్ కార్డులు, డెకరేటివ్ హ్యాంగింగ్స్, కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఉండే సంచులు, పర్సులను కూడా తయారుచేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఉండే అన్ని రకాలను ‘జస్ట్ గ్రీన్ లీఫ్’ మార్కెట్లోకి తీసుకువస్తున్నది. మా ఉత్పత్తులను ఈ కామర్స్ వేదిక ద్వారా విక్రయిస్తున్నాం. పలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా జూట్ సంచులకు ఆర్డర్లు వస్తున్నాయి. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. పర్యావరణ హితం కోరుతూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ మా సంస్థకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. 2019లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్
తెలంగాణ చాప్టర్ సుస్థిరమైన ఉత్పత్తుల సంస్థగా గుర్తించి అవార్డు ప్రకటించింది.
సహజసిద్ధమైన ఫైబర్లను కలిగిన జనపనార ప్రపంచంలోనే అతిచౌకగా దొరికే గట్టిదనం కలిగిన పదార్థం. ప్రస్తుతం దీనికి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ వీటితో తయారైన వస్తువుల వినియోగం పెరగడం లేదు. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలిగే జనపనారతో ఎలాంటి వస్తువులైనా తయారుచేయొచ్చు. అంతేకాదు ఇవి పాతబడిన తర్వాత భూమిలో సులభంగా కలిసిపోయి నేలకు మేలుచేస్తాయే తప్ప.. ఎలాంటి నష్టమూ ఉండదు. ప్రకృతికి రక్షణగా నిలిచే జూట్ అంటే స్వచ్ఛత అని నేను నమ్మతాను. అయితే, మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. అందుకే మా ఉత్పత్తులను నయా డిజైన్లలో అందిస్తున్నాం. ఆధునిక జీవనశైలికి అనువుగా ఉండేలా డిజైనరీ జూట్ బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నాం.