కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. బ్యాగులు మొదలు లంచ్ బాక్సుల వరకు అన్నీ కొత్తవే ఉండాలి పిల్లలకి. వీటన్నిటికీ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. పిల్లల చదువుల కోసం చేసే ఖర్చులో, పర్యావరణానికి మనం చేసే నష్టం చాలా ఎక్కువనే చెప్పాలి. జూన్‌లో స్కూళ్ల హడావుడితో పాటు వానల పలకరింపులూ మొదలవుతాయి. మరి ఈ కాలంలో మన పిల్లలను కేవలం మార్కుల వేటలోనే కాకుండా, ప్రకృతితో మమేకమయ్యేలా ఎలా పెంచాలి? అమ్మల ఆలోచన మారితే… రేపటి తరం ఆరోగ్యం ఎలా పచ్చగా మారుతుంది? లాంటి అంశాలను కలగలిపే ‘గ్రీన్ పేరెంటింగ్’ అనే సరికొత్త జీవనశైలి గురించి ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన అవసరం ఉంది. అందులోని మెలకువలు తెలుసుకుంటే మీరూ అవ్వచ్చు ఎకో మదర్!

ప్రాక్టికల్ మార్పు ఎప్పుడూ వంటింటి నుంచే మొదలవ్వాలి. మార్కెట్లో దొరికే రంగు రంగుల ప్లాస్టిక్ బాక్సుల స్థానంలో ‘గ్రేడ్ 304 స్టెయిన్లెస్ స్టీల్’ లేదా ఎకో-ఫ్రెండ్లీ ‘సిలికాన్ కొలాప్సిబుల్ బాక్సులను’ వాడొచ్చు. ఇవి బరువు తక్కువగా ఉంటాయి, విషపూరిత రసాయనాలను విడుదల చేయవు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు స్వస్తి చెప్పి, రాగి లేదా తేలికపాటి స్టీల్ బాటిళ్లను అలవాటు చేయొచ్చు. చపాతీలు, శాండ్విచ్లు ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ బదులు, ఉతకగలిగే బీస్‌వ్యాక్స్ రాప్‌లు లేదా నూలు వస్ర్తాలను వాడటం సరికొత్త ట్రెండ్.
జూన్ నెలలో కురిసే తొలకరి జల్లులను పిల్లల ఇండోర్ గేమ్స్ మింగేయకూడదు. ప్రకృతిని ఆస్వాదించేలా తల్లులే ముందడుగు వేయాలి. ఆదివారం నాడు పిల్లలతో కలిసి మట్టి, ఎరువు, రకరకాల పండ్ల గింజలను కలిపి చిన్న చిన్న ‘సీడ్ బాల్స్’ తయారు చేయించండి. స్కూల్ వ్యాన్‌లో వెళ్లేటప్పుడో లేదా వారాంతాల్లో బయటికి వెళ్లినప్పుడో… ఖాళీ ప్రదేశాల్లో, రోడ్డు పక్కన ఆ సీడ్ బాల్స్‌ను విసిరేయమని చెప్పండి. వర్షాలకి అవి మొక్కలుగా మొలుస్తుంటే పిల్లల్లో కలిగే ఆనందం అమూల్యమైనది.

పిల్లలు వాడే పెన్నులు, పెన్సిళ్ల వల్ల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీనికి విరుగుడుగా ఇప్పుడు అద్భుతమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. అవే ప్లాంటింగ్ పెన్సిళ్లు. వాడేసిన తర్వాత మట్టిలో నాటితే మొక్కలు మొలిచే ‘సీడ్ పెన్సిల్స్’, ‘సీడ్ పెన్స్’ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. పిల్లలు రాయడం పూర్తయ్యాక వాటిని నాటడం ఒక థ్రిల్లింగ్ అనుభూతి కలుగుతుంది. బ్లీచ్ చేయని, క్లోరిన్ రహిత కాగితంతో చేసిన బ్రౌన్ కలర్ నోట్‌బుక్స్ వాడటం వల్ల అడవులను కాపాడినవాళ్లమవుతాం. పైగా ఇవి కంటికి కూడా శ్రమను తగ్గిస్తాయి.
స్కూల్స్ మొదలవగానే పిల్లలకు రకరకాల ప్రాజెక్ట్ వర్క్‌లు, అసైన్మెంట్లు ఇస్తుంటారు. చాలామంది అమ్మలు వెంటనే మార్కెట్‌కి వెళ్లి ప్లాస్టిక్ థర్మాకోల్ షీట్లు, మెరిసే ప్లాస్టిక్ స్టిక్కర్లు, రసాయన రంగులు కొనేస్తుంటారు. వీటివల్ల డబ్బు వృథా అవ్వడమే కాకుండా, ప్రాజెక్ట్ అయిపోయాక అవన్నీ చెత్తకుప్పల్లోకి చేరి పర్యావరణాన్ని పాడుచేస్తాయి. దీనికి బదులుగా ఇంట్లోని వ్యర్థాలనే ప్రాజెక్టులకు వాడటం ఒక అద్భుతమైన గ్రీన్ ఐడియా. ప్రాజెక్ట్ బేస్‌ల కోసం థర్మాకోల్ షీట్లకు బదులుగా ఇంట్లో ఉండే పాత ఇ-కామర్స్ (అమెజాన్/ఫ్లిప్‌కార్ట్) కార్డ్బోర్డ్ బాక్సులను వాడొచ్చు.
ప్లాస్టిక్ పూసలు, గ్లిట్టర్ల బదులు రంగు రంగుల పప్పు ధాన్యాలు, ఎండిన ఆకులు, పువ్వులు, ఐస్‌క్రీమ్ పుల్లలు, పిస్తా పప్పు తొక్కలను ఉపయోగించి ప్రాజెక్ట్‌లను ఆకర్షణీయంగా మార్చవచ్చు. కెమికల్ గమ్‌లకు బదులుగా మైదాపిండి లేదా జొన్నపిండితో ఇంట్లోనే వండుకునే సహజమైన జిగురును వాడటం మేలు. దీనివల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రాజెక్టులు పూర్తవుతాయి. వ్యర్థాలను ఎలా మళ్లీ వాడుకోవాలో పిల్లలకు ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది.

ప్రతి ఏటా జూన్ నెలలో కొత్త పుస్తకాల కోసం లక్షలాది చెట్లను నరికేస్తున్నారు. పైగా పాత క్లాస్ పుస్తకాలను చాలామంది తల్లులు పాత సామాన్ల కింద పారేస్తుంటారు. దీనికి బదులుగా పర్యావరణాన్ని, డబ్బును ఆదా చేసే సరికొత్త ఆలోచన ‘బుక్ బ్యాంక్’. కాలనీ లేదా స్కూల్ ఫ్రెండ్స్ తల్లులంతా కలిసి ఒక ‘మదర్స్ బుక్ క్లబ్’ ఏర్పాటు చేసుకోవాలి. సీనియర్ క్లాస్ పిల్లల పాత పుస్తకాలు, స్టోరీ బుక్స్, రిఫరెన్స్ గైడ్లను పారేయకుండా… జూనియర్ క్లాసుల్లోకి వచ్చే పిల్లల తల్లులకు అందించాలి. పుస్తకాలకు ప్లాస్టిక్ కవర్లు వేయడానికి బదులు పాత క్యాలెండర్లు, బ్రౌన్ పేపర్లతో బైండింగ్ చేయడం పిల్లలకు నేర్పించాలి. దీనివల్ల కాగితం వృథా కాదు, వేల రూపాయల బడ్జెట్ ఆదా అవుతుంది, పిల్లల్లో ‘పంచుకునే తత్వం’ పెరుగుతుంది.
పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపుతో పాటు పర్యావరణ స్పృహను కూడా నేర్పించే సూపర్ ఐడియా ఇది. చిన్నారులు డబ్బులు దాచుకునేందుకు ప్లాస్టిక్ పిగ్గీ బ్యాంకులు కాకుండా మట్టితో చేసిన గల్లా గురుగులను కొనివ్వండి. అలాగే ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినందుకు లేదా కరెంట్, వాటర్ ఆదా చేసినందుకు (లైట్లు ఆపడం, ట్యాప్ కట్టేయడం వంటివి) పిల్లలకు రివార్డ్‌గా కొంత పాకెట్ మనీ ఇవ్వండి. ఆ డబ్బుతో వాళ్లకు నచ్చిన ప్లాస్టిక్ బొమ్మలు కాకుండా… ఇండోర్ ప్లాంట్స్ లేదా నచ్చిన పుస్తకాలు కొనేలా ప్రోత్సహించండి. దీనివల్ల పిల్లలకు పర్యావరణాన్ని కాపాడటం అనేది ఒక సరదా ఆటలా మారుతుంది.

స్కూల్ దగ్గరకు వెళ్తే వందల సంఖ్యలో బైక్‌లు, కార్లు కనిపిస్తాయి. దీనివల్ల స్కూల్ జోన్లలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతున్నది. కాలనీ లేదా అపార్ట్మెంట్లో ఒకే స్కూల్‌కు వెళ్లే పిల్లల తల్లులంతా ఒక వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడాలి. వారంలో ఒక్కొక్కరు ఒక్కో రోజు చొప్పున పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లే బాధ్యత పంచుకోవాలి. దీనివల్ల పెట్రోల్ ఖర్చులు సగానికి సగం తగ్గుతాయి, ట్రాఫిక్ తగ్గుతుంది, పిల్లలకు తోటివారితో కలిసి ప్రయాణించే సామాజిక స్పృహ అలవడుతుంది.