ఈ స్మార్ట్ యుగంలో మీరు మీ కంట్రోల్లో ఉన్నారని భావిస్తున్నారా! మీరు భ్రమల్లో పరిభ్రమిస్తున్నట్టే!! డిజిటల్ దునియాలో ట్రెండింగ్ ఐటమ్ ఏంటో తెలుసా? మీరే!! కృత్రిమ మేధ వికృత క్రీడలో మీరో సేల్డ్ ప్రొడక్ట్! ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మిమ్మల్ని అమ్మేసిన విషయం మీక్కూడా తెలియదు! ఇటీవల విడుదలైన ‘CTRL’ సినిమా ఈ విషయాన్ని క్లియర్‌గా చూపించింది. క్షణాల్లో మన పనులు చక్కబెడుతున్న ఏఐ మిమ్మల్ని రింగ్ మాస్టార్లా ఆడిస్తుందన్నది నిజం. కావాలంటే చెక్ చేసుకోండి..
గూగుల్ మీ ఆసక్తులకు తగ్గ వస్తువులకు సంబంధించిన నోటిఫికేషన్లు పంపిస్తుంది కదా! ఎప్పుడో ఏడాది కిందట దిగిన ఫొటోలు.. మళ్లీ రీక్యాప్ చేస్తుంది కదా! ఈ ఉదాహరణలు చాలు అరచేతిలో ఒదిగిపోయిన ఫోన్లో మీ జీవితమంతా ఇమిడిపోయిందని చెప్పడానికి. ‘గోడలకు చెవులుంటాయ్’ పాత సామెత! కానీ, ఇప్పుడు జేబులో ఉన్న ఫోనో.. ఒడిలో ఉన్న ల్యాపీనో వింటుందేమోనని సందేహించాల్సిందే! మైక్రోఫోన్, బిల్ట్ఇన్ కెమెరా.. ఈ రెండూ దేంట్లో ఉన్నా పరేషానే! ఇవి వాటంతట అవి మీ జీవితంలోకి ప్రవేశించవు. అవగాహనా రాహిత్యంతో మీరిచ్చే పర్మిషన్లు వాటిని యాక్టివేట్ చేస్తాయి. మనం పడుకున్నప్పుడు కూడా అవి మనల్ని గమనిస్తూ ఉంటాయి. మన మాటలు వింటుంటాయి. మన ఇన్‌బాక్స్‌లో మేసేజ్‌లను చదివేస్తాయి. మన టైమ్ బాగోకపోతే.. ‘కంట్రోల్’ సినిమాలో లాగా మనకు తెలియకుండానే మెసేజ్‌లకు రిైప్లెలు కూడా ఇచ్చేస్తుంటాయి.
మన కమాండ్‌తో పనిచేసే గ్యాడ్జెట్ కేవలం యంత్రం అనుకుంటే పొరపాటే! ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం ఆలోచించకుండా పర్మిషన్స్ ఇచ్చేస్తుంటాం. విశేష అనుమతులు పొందిన ఏఐని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు రకరకాల విన్యాసాలకు పాల్పడుతుంటారు. మీ ముఖాన్ని ఫేక్ చేయొచ్చు, మీ మాటల్ని వింటూ కరెక్ట్‌గా మిమిక్రీ చేయొచ్చు! ఈ రెండూ ఫేక్ చేయగలితే మీ పరిస్థితి ‘కంట్రోల్’ సినిమాలో కథానాయికలా మారిపోతుంది.
దీనికి విరుగుడు డిజిటల్ డిటాక్షన్ మాత్రమే! స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే మీరు అంత సేఫ్‌గా ఉన్నట్టు. యాప్‌లు ఇన్స్టాల్ చేసేటప్పుడు, వెబ్ సర్వీస్‌లు వినియోగించే ముందు టర్మ్స్ అండ్ కండీషన్స్ ఓపికగా చదవాలి! ఆ ఏం చదువుతాంలే అని ఓకే.. ఓకే.. అనుకుంటూ వెళ్లిపోతే, అసలుకే ఎసరొస్తుంది. సదరు యాప్‌లు, వెబ్ సర్వీస్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ మిమ్మల్ని వాటి కంట్రోల్లోకి తీసుకుంటాయి. అలా జరగొద్దంటే.. ఒక యాప్ ఇన్స్టాల్ చేసే క్రమంలో ‘ఓకే’ అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదని సామాజిక మాధ్యమాల్లో దుమ్మురేపాలన్న ఆలోచన ధోరణిని తగ్గించుకోవాలి. ఏఐ విప్లవాత్మకంగా విస్తరిస్తున్న తరుణంలో ఫోన్‌ను ఎడాపెడా వాడేసే సంస్కృతిని తగ్గించుకోవాలి. డిజిటల్ అక్షరాస్యత తప్పనిసరి. సమస్య ఏదైనా కుటుంబసభ్యులతో పంచుకోవాలి. లేదంటే.. ‘కంట్రోల్’ సినిమాలోని కథానాయికలా వర్చువల్ వరల్డ్‌కు సరెండర్ అవ్వాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.