ప్రతిరోజూ స్నానం చేయడం మన దినచర్యలో భాగమే! అయితే, ఉదయం పూట స్నానం చేస్తే మంచిదా, రాత్రి పూట చేయడం మంచిదా? అనే విషయంలో చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవానికి ఉదయం, సాయంత్రం స్నానాల వల్ల శరీరానికి విడివిడిగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయపు స్నానం రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తే.. రాత్రి చేసే స్నానం రోజంతా పడిన అలసటను దూరం చేస్తుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్, అవసరాలకు ఏది సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం.
ఉదయం స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. నిద్ర మత్తు వదిలిపోతుంది. రాత్రిపూట పట్టిన చెమట అంతా శుభ్రంగా తొలగిపోతుందని ఎన్ఎల్ఎం అధ్యయనం పేరొంది. అంతేకాకుండా.. ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది, శరీర దుర్వాసన కూడా తగ్గుతుంది.
రాత్రిపూట గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది రోజంతా పడిన శ్రమ నుంచి ఉపశమనం పొందే సమయం ఆసన్నమైందని మెదడుకు సంకేతం పంపుతుంది. దీనివల్ల పగటిపూట శరీరంపై చేరిన మురికి, ధూళి అంతా కొట్టుకుపోయి బాడీ ఫ్రెష్‌గా మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. అంతేకాదు, రాత్రి పూట స్నానం వల్ల ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది.
ఉదయం పూట స్నానం చేయాలా లేదా రాత్రిపూట చేయాలా? అనేది మీ లైఫ్ స్టైల్, షెడ్యూల్, అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలి. అవకాశం ఉంటే రెండు పూటలా చేస్తే మరీ మంచిది! అయితే రాత్రి భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం మంచిది కాదని, భోజనం చేసిన గంట లేదా గంటన్నర తర్వాతే స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.